ఇక ‘జిందాల్’ పెయింట్స్
♦ రెండు ప్లాంట్ల పనులు ప్రారంభం
♦ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి..
ముంబై: సజ్జన్ జిందాల్ కుటుంబం పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. రెండు ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఒక ప్లాంట్‌ను(డెకరేటివ్ పెయింట్స్) కర్ణాటకలోని విజయ్‌నగర్‌లో, మరో ప్లాంట్(ఇండస్ట్రియల్ సెగ్మెంట్)ను మహారాష్ట్రలోని వసింధ్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఈ వ్యాపారాన్ని చూస్తున్న పార్థు జిందాల్ తెలియజేశారు. ఈ రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, రెండేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోనూ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన. ఈ కుటుంబం జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కంపెనీలను నిర్వహిస్తోంది.
వన్ స్టాప్ సొల్యూషన్
పెయింట్ల పరిశ్రమ ప్రతి ఏటా 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తోందని, ఈ రంగంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా ప్రతి ఏడాదీ పెరుగుతోందని పార్థు జిందాల్ చెప్పారు. ఇప్పటికే స్టీల్, సిమెంట్ రంగాల్లో ఉన్నామని, పెయింట్ల రంగంలో ప్రవేశించడం ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ (అన్ని ఉత్పత్తులు ఒకే చోట అందించే) అవకాశం లభించనున్నదని వివరించారు. బీ2బీ (బిజినెస్ టు బిజినెస్), బీ2సీ (బిజినెస్ టు కన్సూమర్) సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందిస్తామని పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం పెయింట్ల మార్కెట్ ఏడాదికి 25 లక్షల కిలో లీటర్లని, దీంట్లో ఏషియన్ పెయింట్స్ వాటా 10 లక్షల కిలోలీటర్లని తెలిపారు. 2025 కల్లా 10 లక్షల కిలోలీటర్ల మార్కెట్‌ను సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. మొదట్లో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలపై దృష్టి పెడతామని ఆయన వివరించారు.