
తొలిసారి సిటీ స్ట్రీట్ ఆర్ట్‌కు విదేశీ ఆతిథ్యం లభించింది. ఫ్రెంచి గోడలపై నగర‘వాసి’ కాంతులీనింది. పారిస్ నగరం కారణంగా అంతర్జాతీయంగా ఫ్యాషన్‌లకూ పెయింటింగ్స్‌కూ..అంతెందుకు సకల కళలకూ రాజధానిగా మారిన ఫ్రాన్స్ దేశంలో మన నగరానికి చెందిన చిత్రకారుడు..అదీ స్ట్రీట్ ఆర్టిస్ట్ కుంచె కదిలించారు. ప్రస్తుతం ఆ చిత్రం భాగ్యనగర కళా ప్రతిభకు సాక్షిగా స్థానికుల అభినందనలు అందుకుంటోంది.
-సాక్షి, సిటీ బ్యూరో
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆర్టిస్టులెందరో ఉన్నారు. దేశ విదేశాల్లో తమదైన ముద్ర వేసిన గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారు. అయితే సిటీలో స్ట్రీట్ ఆర్టిస్టులు తక్కువే. అందులోనూ సిటీని గ్లోబల్ చిత్ర పటంలో పెట్టే స్ట్రీట్ ఆర్టిస్టులు దాదాపు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఆర్టిస్ట్స్ జంట స్వాతి, విజయ్‌లు ఈ ఘనత సాధించి భాగ్యనగర యువ చిత్రకారుల ప్రతిభను అంతర్జాతీయం చేశారు. ఫ్రాన్స్‌లో పర్యటన ముగించుకుని వచ్చిన ఈ యువ చిత్రకారులు, దంపతులు అయిన స్వాతి, విజయ్ తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా...
వసతులు అదరహో...
మేం చేసిన ఆర్ట్‌వర్క్ 45 నుంచి 50 అడుగుల ఎత్తు, వెడల్పు కూడా దాదాపు అంతే ఉంటుంది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మాకు వాలంటీర్‌గా వర్క్ చేయడానికి అసిస్టెంట్‌ని ఇచ్చారు. ఇద్దరికీ అన్నీ వసతులూ కల్పించి మాకు పేమెంట్ కూడా ఇచ్చారు. మా ఆర్ట్ వర్క్‌కి కూడా ఇండియన్ ట్రెడిషన్ మేళవించాం. బొమ్మ గీసేటప్పుడు కింద పడతామేమో లాంటి కించిత్తు భయాలు కూడా లేకుండా మాతో పాటు సరంజామా పెట్టుకోవడానికి చక్కని స్టాక్ హోల్డింగ్ ఇచ్చారు. మా పరికరాలు వీధిలో వెళ్లేవారి మీద పడే అవకాశం లేకుండా నెట్ ఏర్పాటు చేశారు. మా జీవితంలో ఇంత హాయిగా, ఇబ్బంది లేకుండా స్ట్రీట్ ఆర్ట్ వేసిన సందర్భం లేదని చెప్పాలి.
ఆశ్చర్యానుభూతులు పంచిన అవకాశం..
మేమిద్దరం కళాభిరుచితో పాటూ జీవితాన్నీ పంచుకున్నాం. విడివిడిగా కాకుండా స్వాతి విజయ్ పేరుతో ఒకే ఆర్టిస్టుగా కొనసాగుతున్నాం. నగరంలో చాలా గోడలపై మేం విభిన్న సమస్యలపై గీసిన చిత్రాలు నగరవాసులు చూసే ఉంటారు. దాదాపు ఆరేడేళ్లుగా రాత్రి పగలూ తేడా లేకుండా స్ట్రీట్ ఆర్ట్‌కి అంకితమయ్యాం. హైదరాబాద్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, అలాగే మన దేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాం. ఈ నేపథ్యంలో రెణ్నెళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌కి మాకు పిలుపొచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే విదేశాల్లో నిర్వహించే అంతపెద్ద ఆర్ట్ ఫెస్టివల్‌కి అదీ ఇంత త్వరగా మాకు అవకాశం ఊహించలేదు. నెల రోజుల తర్వాత అధికారికంగా ఆహ్వానంతో పాటు వీసా, ఫ్‌లైట్ టిక్కెట్స్ కన్ఫర్మ్ అయ్యేదాకా మాకు నమ్మకం చిక్కలేదు.
మ్యుజీషియన్ గోడపై మన సంగీత చిత్రం
ఆ ఊరిలో అక్కడి మన ఇంటి గోడలు, కిటికీలు సహా అన్ని ఇళ్లూ ఒకే డిజైనింగ్‌లో ఉంటాయి. ఇంటిలో ఇంటర్నల్‌గా మార్పు చేర్పులు మన ఇష్టం కానీ బయట చేసే మార్పులకు మాత్రం ప్రభుత్వ అనుమతి అవసరం. మాకు ఒక ప్రైవేట్ భవనాన్ని ఇచ్చారు. అది ఒక మ్యుజీషియన్‌ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాం. మేం గీసిన చిత్రంలో ఒక మోడ్రన్ మ్యూజిక్‌ని తన్మయత్వంతో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటున్న ఒక అమ్మాయి చిత్రం. దీనిలో భారతీయతను మేళవిస్తూ...ఆ అమ్మాయి వీణ మోస్తూ ఉన్నట్టు గీశాం. అంటే ఎంత మోడ్రౖనైజ్ అయినా కూడా సంప్రదాయాన్ని వదలం అని చెప్పకనే చెప్పాం.
ఆర్ట్ హబ్ చేయడం మంచి ఆలోచన
మొత్తం మీద స్వంతంగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా విదేశీ ఆతిథ్యం తీసుకుని, రెమ్యునరేషన్ సహా అందుకుని ఈ నెల 18న తిరిగి వచ్చాం. ఆ ఊరిలో ఈ 150 చిత్రాలు అయ్యేటప్పటికి మరో సంవత్సరం..రెండు సంవత్సరాలు పడుతుంది. ఒక ఊరు మొత్తం 150 పెయింటింగ్స్‌తో ఆర్ట్ హబ్‌గా మార్చాలనే వారి ఆలోచన నాకు బాగా నచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఏదైనా ఒక ఊరు తీసుకుని ఇలా చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం.
స్వాగతించిన కళా నగరం
ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్ట్ ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న డ్యాక్స్ సిటీలో నిర్వహిస్తున్నారు. విభిన్న దేశాల నుంచి 150 మంది స్ట్రీట్ ఆర్టిస్ట్స్ పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో మన దేశం తరపున గత నెల 28న ఫ్రాన్స్‌లో అడుగుపెట్టాం. ఒక్కోక్కరికి ఒక్కో ఆర్ట్ వర్క్ వేసే అవకాశం అందించారు. అయితే ఒకేసారి అన్ని ఆర్ట్ వర్క్స్ మేనేజ్ చేయలేరు కాబట్టి ఫేజ్‌ల వారీగా చేస్తున్నారు. మేం మూడవ ఫేజ్‌లో పాల్గొన్నాం. అది బాగా రిచ్ పీపుల్ ఉండే ప్రాంతం. ఆర్ట్‌కి చాలా గౌరవం లభిస్తుంది. మాకిచ్చిన వర్క్ పూర్తి చేయడం కోసం 8 రోజులు పట్టింది మాకు.
Comments
Please login to add a commentAdd a comment