Street art
-
ఫ్రెంచ్ వాల్‌పై.. సిటీ చిత్రం
తొలిసారి సిటీ స్ట్రీట్ ఆర్ట్‌కు విదేశీ ఆతిథ్యం లభించింది. ఫ్రెంచి గోడలపై నగర‘వాసి’ కాంతులీనింది. పారిస్ నగరం కారణంగా అంతర్జాతీయంగా ఫ్యాషన్లకూ పెయింటింగ్స్కూ..అంతెందుకు సకల కళలకూ రాజధానిగా మారిన ఫ్రాన్స్ దేశంలో మన నగరానికి చెందిన చిత్రకారుడు..అదీ స్ట్రీట్ ఆర్టిస్ట్ కుంచె కదిలించారు. ప్రస్తుతం ఆ చిత్రం భాగ్యనగర కళా ప్రతిభకు సాక్షిగా స్థానికుల అభినందనలు అందుకుంటోంది. -సాక్షి, సిటీ బ్యూరో సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆర్టిస్టులెందరో ఉన్నారు. దేశ విదేశాల్లో తమదైన ముద్ర వేసిన గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారు. అయితే సిటీలో స్ట్రీట్ ఆర్టిస్టులు తక్కువే. అందులోనూ సిటీని గ్లోబల్ చిత్ర పటంలో పెట్టే స్ట్రీట్ ఆర్టిస్టులు దాదాపు లేరనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఆర్టిస్ట్స్ జంట స్వాతి, విజయ్‌లు ఈ ఘనత సాధించి భాగ్యనగర యువ చిత్రకారుల ప్రతిభను అంతర్జాతీయం చేశారు. ఫ్రాన్స్‌లో పర్యటన ముగించుకుని వచ్చిన ఈ యువ చిత్రకారులు, దంపతులు అయిన స్వాతి, విజయ్ తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారిలా... వసతులు అదరహో... మేం చేసిన ఆర్ట్‌వర్క్ 45 నుంచి 50 అడుగుల ఎత్తు, వెడల్పు కూడా దాదాపు అంతే ఉంటుంది. అయినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. మాకు వాలంటీర్‌గా వర్క్ చేయడానికి అసిస్టెంట్‌ని ఇచ్చారు. ఇద్దరికీ అన్నీ వసతులూ కల్పించి మాకు పేమెంట్ కూడా ఇచ్చారు. మా ఆర్ట్ వర్క్‌కి కూడా ఇండియన్ ట్రెడిషన్ మేళవించాం. బొమ్మ గీసేటప్పుడు కింద పడతామేమో లాంటి కించిత్తు భయాలు కూడా లేకుండా మాతో పాటు సరంజామా పెట్టుకోవడానికి చక్కని స్టాక్ హోల్డింగ్ ఇచ్చారు. మా పరికరాలు వీధిలో వెళ్లేవారి మీద పడే అవకాశం లేకుండా నెట్ ఏర్పాటు చేశారు. మా జీవితంలో ఇంత హాయిగా, ఇబ్బంది లేకుండా స్ట్రీట్ ఆర్ట్ వేసిన సందర్భం లేదని చెప్పాలి. ఆశ్చర్యానుభూతులు పంచిన అవకాశం.. మేమిద్దరం కళాభిరుచితో పాటూ జీవితాన్నీ పంచుకున్నాం. విడివిడిగా కాకుండా స్వాతి విజయ్ పేరుతో ఒకే ఆర్టిస్టుగా కొనసాగుతున్నాం. నగరంలో చాలా గోడలపై మేం విభిన్న సమస్యలపై గీసిన చిత్రాలు నగరవాసులు చూసే ఉంటారు. దాదాపు ఆరేడేళ్లుగా రాత్రి పగలూ తేడా లేకుండా స్ట్రీట్ ఆర్ట్‌కి అంకితమయ్యాం. హైదరాబాద్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్, అలాగే మన దేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాం. ఈ నేపథ్యంలో రెణ్నెళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్‌కి మాకు పిలుపొచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే విదేశాల్లో నిర్వహించే అంతపెద్ద ఆర్ట్ ఫెస్టివల్‌కి అదీ ఇంత త్వరగా మాకు అవకాశం ఊహించలేదు. నెల రోజుల తర్వాత అధికారికంగా ఆహ్వానంతో పాటు వీసా, ఫ్లైట్ టిక్కెట్స్ కన్ఫర్మ్ అయ్యేదాకా మాకు నమ్మకం చిక్కలేదు. మ్యుజీషియన్ గోడపై మన సంగీత చిత్రం ఆ ఊరిలో అక్కడి మన ఇంటి గోడలు, కిటికీలు సహా అన్ని ఇళ్లూ ఒకే డిజైనింగ్‌లో ఉంటాయి. ఇంటిలో ఇంటర్నల్‌గా మార్పు చేర్పులు మన ఇష్టం కానీ బయట చేసే మార్పులకు మాత్రం ప్రభుత్వ అనుమతి అవసరం. మాకు ఒక ప్రైవేట్ భవనాన్ని ఇచ్చారు. అది ఒక మ్యుజీషియన్ది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాం. మేం గీసిన చిత్రంలో ఒక మోడ్రన్ మ్యూజిక్‌ని తన్మయత్వంతో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటున్న ఒక అమ్మాయి చిత్రం. దీనిలో భారతీయతను మేళవిస్తూ...ఆ అమ్మాయి వీణ మోస్తూ ఉన్నట్టు గీశాం. అంటే ఎంత మోడ్రౖనైజ్ అయినా కూడా సంప్రదాయాన్ని వదలం అని చెప్పకనే చెప్పాం. ఆర్ట్ హబ్ చేయడం మంచి ఆలోచన మొత్తం మీద స్వంతంగా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా విదేశీ ఆతిథ్యం తీసుకుని, రెమ్యునరేషన్ సహా అందుకుని ఈ నెల 18న తిరిగి వచ్చాం. ఆ ఊరిలో ఈ 150 చిత్రాలు అయ్యేటప్పటికి మరో సంవత్సరం..రెండు సంవత్సరాలు పడుతుంది. ఒక ఊరు మొత్తం 150 పెయింటింగ్స్‌తో ఆర్ట్ హబ్‌గా మార్చాలనే వారి ఆలోచన నాకు బాగా నచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఏదైనా ఒక ఊరు తీసుకుని ఇలా చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. స్వాగతించిన కళా నగరం ఇంటర్నేషనల్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్ట్ ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న డ్యాక్స్ సిటీలో నిర్వహిస్తున్నారు. విభిన్న దేశాల నుంచి 150 మంది స్ట్రీట్ ఆర్టిస్ట్స్ పాల్గొంటున్న ఈ ఈవెంట్లో మన దేశం తరపున గత నెల 28న ఫ్రాన్స్‌లో అడుగుపెట్టాం. ఒక్కోక్కరికి ఒక్కో ఆర్ట్ వర్క్ వేసే అవకాశం అందించారు. అయితే ఒకేసారి అన్ని ఆర్ట్ వర్క్స్ మేనేజ్ చేయలేరు కాబట్టి ఫేజ్‌ల వారీగా చేస్తున్నారు. మేం మూడవ ఫేజ్‌లో పాల్గొన్నాం. అది బాగా రిచ్ పీపుల్ ఉండే ప్రాంతం. ఆర్ట్‌కి చాలా గౌరవం లభిస్తుంది. మాకిచ్చిన వర్క్ పూర్తి చేయడం కోసం 8 రోజులు పట్టింది మాకు. -
స్ట్రీట్ ఆర్ట్స్‌తో ప్రతిభ చాటుతున్న జంట
-
వీధి వీధి వి'చిత్రం'
నగర వీధులు ‘చిత్ర’మైన అందాల్ని సంతరించుకుంటున్నాయి. మెట్రో నగరాల్లో విజయవంతమైన స్ట్రీట్ ఆర్ట్ కాన్సెప్ట్ నగరవాసుల్ని ఇప్పుడిప్పుడే ఆకట్టుకుంటోంది. గతేడాది సిటీలో నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ ఈ ట్రెండ్‌కు ఆజ్యం పోసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా పీపుల్స్ ప్లాజా ఎదురుగా ఉన్న స్లమ్ ఏరియా ఎంఎస్ మక్తాకు సైతం సరికొత్త లుక్‌ను అందించిన నేపథ్యంలో నగరంలో తొలి ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా స్ట్రీట్ ఆర్టిస్టులు దీనిని ఎంచుకోనున్నారు. నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ఫెస్ట్.. ఈ సారి మరిన్ని చిత్ర విచిత్రాలను సిటీకి తేవడంతో నగరవాసుల్లో మరింత క్రేజ్‌ను పెంచనుంది. సాక్షి, సిటీబ్యూరో: భవనం పాతబడింది. దాని రంగులు మాత్రమే కాదు.. ఎలివేషన్ సైతం ఆకట్టుకోవడం లేదు. ఏం చేయాలి? రూ.లక్షలు ఖర్చు పెట్టి రీకన్స్ట్రక్ట్ చేయించడం తప్ప మరో మార్గం లేదా? గ్రౌండ్ బావుంది.. కానీ కాంపౌండ్ వాల్ మరీ ఫ్లాట్‌గా ఖాళీగా అనిపిస్తోంది. దీన్ని కాస్త ఆకర్షణీయంగా తీర్చిదిద్దలేమా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు స్ట్రీట్ ఆర్ట్ రూపంలో సమాధానాలు లభిస్తున్నాయి. ఆర్టిస్టులు తక్కువే... నగరంలో స్ట్రీట్ ఆర్ట్ అంటే చిత్రకారులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఎందుకంటే ఇది కాస్త వేగంగా చేయాల్సిన హార్డ్ వర్క్. ఎంత త్వరగా వర్క్ పూర్తి చేస్తారనేదే ఇందులో ముఖ్యమైన అంశం. చిత్రాన్ని బట్టి కనీసం వారం నుంచి 15 రోజులు వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్ట్రీట్ ఆర్ట్‌లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. ఆదాయం పరంగానూ గ్యాలరీ సేల్స్‌తో సమానంగా రావు. పైగా గ్యాలరీ ప్రదర్శనలతో పోలిస్తే స్ట్రీట్ ఆర్ట్‌కు దక్కే గౌరవం తక్కువేననే ఆలోచనతో సిటీలో వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో కూడా స్ట్రీట్ ఆర్టిస్టులు లేరు. ఆదరణకు ఆజ్యం... ఇన్ని సమస్యల మధ్య గతేడాది తొలిసారి నగరంలో నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ అనూహ్యంగా విజయవంతమైంది. ఇందులో దేశవిదేశీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వీరు ఎంఎస్ మక్తాను వేదికగా ఎంచుకున్నారు. ఒక్కో చిత్రకారుడికి ఒక్కో బిల్డింగ్ కాన్వాస్‌గా మారింది. తెలంగాణ కళాకారులకూ ఇందులో భాగస్వామ్యం కల్పించారు. దీన్ని స్టార్ట్ ఇండియా ఫౌండేషన్, కళాకృతి, ఆర్ట్ ఎట్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. అక్కడి 8 భవనాలను ఆర్టిస్టులు అందంగా తీర్చిదిద్దన తీరు నగరవాసులను ఆలోచనా ధోరణుల్ని అమాంతం మార్చేసింది. మెట్రోల్లో హిట్... విదేశాల్లో చాలా పాపులరైన స్ట్రీట్ ఆర్ట్‌కు మన దేశంలోని మెట్రోల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో అద్భుతమైన ఆదరణకు నోచుకుంటోంది. ముంబై, బెంగుళూర్లోనూ ఫాలోయింగ్ బాగుంది. ఇప్పుడిప్పుడే సిటీకి చేరువవుతోంది. ఒకప్పుడు వాల్ మీద ఆర్ట్ అంటే.. దానిని పాడు చేయడమనే ఆలోచన కొందరిలో ఉండేది. అయితే వాల్ని అందంగా తీర్చిదిద్దడానికి స్ట్రీట్ ఆర్ట్ మంచి మార్గమని ఇప్పుడు అర్థమైంది. మక్తా.. ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ నగరంలోని స్లమ్ ఏరియాల్లో ఒకటిగా పేరొందింది ఎంఎస్ మక్తా. గతేడాది నిర్వహించిన స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ మక్తా పరిసరాలకు కొత్త అందాలను తీసుకొచ్చింది. దీంతో మక్తా ప్రాంతాన్ని నగరంలోనే స్ట్రీట్ ఆర్ట్‌కి వేదికగా, సిటీలో తొలి ఓపెన్ ఆర్ట్ గ్యాలరీగా మార్చాలని నగరానికి చెందిన స్ట్రీట్ ఆర్టిస్టులు ఆలోచిస్తున్నారు. అవగాహన పెరగాలి... దాదాపు 8 ఏళ్లుగా సిటీలో స్ట్రీట్ ఆర్టిస్టులుగా ఉన్నాం. ఈ కళపై ఇప్పుడున్నంత అవగాహన ఇంతవరకు లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో మేం విభిన్న అంశాలపై సందేశాత్మకంగా స్పాంటేనియస్‌గా చిత్రాలు గీస్తున్నాం. చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకొని మా ప్యాషన్‌ను కొనసాగిస్తున్నాం. స్ట్రీట్ ఆర్ట్‌కు ఇప్పుడిప్పుడే మంచి రోజులొస్తున్నాయి. సిటీలోని భవన యజమానులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అయితే ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. అప్పుడు నగర వీధులు మరింత కళాత్మకంగా, సుందరంగా తయారవడం తథ్యం. స్వాతి, విజయ్ (ఆర్టిస్ట్ కపుల్) -
సరికొత్త హైదరాబాద్‌ను చూశారా?
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలు, వాటి సమీపంలోని భవనాలు సప్తవర్ణాలను పులుముకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), ఆర్ట్ తెలంగాణ, కళాకృతి, స్ట్రీట్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కడి రోడ్లను స్ట్రీట్ ఆర్ట్ గా మార్చేశారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారులు రెండు వారాలపాటు కష్టించి నెక్లెస్ రోడ్డులో ఈ కళాఖండాలను చిత్రీకరించారు. నివాస సముదాయాలతోపాటు రోడ్డు పక్కన గోడలపైనా అందమైన బొమ్మలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్డుకే పరిమితమైన ఈ స్ట్రీట్ ఆర్ట్ నగరంలోని మిగతా పర్యాటక ప్రాంతాల్లోనూ చేపట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కనువిందైన బొమ్మలు వేసిన చిత్రకారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫొటోలు ఇవే..