కృషితో నాస్తి దుర్భిక్షం | Funday children story of the week 09 dec 2018 | Sakshi
Sakshi News home page

కృషితో నాస్తి దుర్భిక్షం

Published Sun, Dec 9 2018 2:15 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

Funday children story of the week 09 dec 2018 - Sakshi

అది ఆరవ తరగతి గది.‘‘ఏం అవినాష్‌ నిన్న నువ్వు స్కూల్‌కి ఎందుకు రాలేదు?’’ అడిగాడు సైన్స్‌ టీచర్‌ సుధాకర్‌ అవినాష్‌ వంక చూస్తూ.‘‘సార్‌..! మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో వాళ్లంతా వెళ్తుంటే... మా అమ్మానాన్నా నన్ను కూడా తీసుకెళ్లారు సార్‌!’’ అన్నాడు అవినాష్‌.‘‘అవునా! అయితే నీకు పనేముంది ఆ బాబాతో’’ అడిగాడు సుధాకర్‌ సార్‌!‘‘సార్‌ మరేమో ‘ఆనంద బాబా’ చాలా మహిమలు కలిగినవాడట. ఆయన మంత్రం చదివి తాయత్తు కడితే... ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుందట. అందుకే నేను కూడా తాయత్తు కట్టించుకోవడానికి వెళ్లాను’’ అంటూ తనచేతికున్న తాయత్తు చూపించాడు అవినాష్‌.‘‘ఏం లాభమటా ఈ తాయత్తుతో?’’ వెటకారంగా అడిగాడు సుధాకర్‌‘‘మరి ఈ తాయత్తు కట్టుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయట సార్‌!’’ఎంతో అమాయకంగా చెప్పాడు అవినాష్‌.వాళ్లిద్దరి సంభాషణ క్లాస్‌లోని మిగతా పిల్లలంతా వింటున్నారు. ‘‘అరే మనం కూడా ఆ తాయత్తు కట్టించుకుంటే ర్యాంకులు తెచ్చుకోవచ్చు కదరా’’అనుకుంటున్నారంతా.సుధాకర్‌ సార్‌ పిల్లల మనసులోని ఆలోచనలను ఇట్టే పట్టేశాడు. ‘‘అయితే పిల్లలు మీరు కూడా అవినాష్‌లాగే తాయత్తు కట్టించుకోవాలనుకుంటున్నారా?’ అన్నాడు.‘‘అవును సార్‌!’’ అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో..‘అయ్యో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించాలి కానీ ఇలా మాయలు, మంత్రాలు, తాయత్తులను నమ్మి పిల్లలు కృషిచేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, ఇది వారి భవిష్యత్త్‌కు ఎంతో ప్రమాదమ’ని మనసులోనే అనుకున్నాడు సుధాకర్‌.అంతే కాకుండా ఆ ‘ఆనంద బాబా’ జనాలకు కష్టాలు తీరుతాయి. అనుకున్నవి జరుగుతాయని తాయత్తులిచ్చి వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో పైసలు గుంజే విధానం అప్పటికే తను విని ఉన్నాడు కనుకఎలాగైనా పిల్లల మనస్సులోని ఆ ఆలోచనలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆనంద బాబా’ చేసే మోసాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనుకున్నాడు. ఆ వెంటనే సుధాకర్‌ సార్‌.. స్కూల్‌లోని మిగతా టీచర్లతో ఈ విషయం గురించి చర్చించి చివరికి అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.పిల్లల దగ్గరి కొచ్చి ‘‘చూడండి పిల్లలు..! ఇప్పుడు మనమంతా ఆ ఆనంద బాబా దగ్గరకెళ్దాం. మన నాగరాజు సార్‌కి అమ్మాయి వేషం వేసి తీసుకెళ్దాం. అక్కడ బాబాను కొన్ని ప్రశ్నలు వేసి మనం పరీక్షిద్దాం.అతను కరెక్ట్‌గా సమాధానం చెబితే మీరంతా తాయత్తు కట్టుకోండి. లేదంటే ఆ బాబాకు ఏం తెలియదని, అతను చెప్పేదంతా బూటకమని తేలితే మీరు ఆయన చెప్పేది నమ్మకుండా కష్టపడి చదువుకోవాలి సరేనా?’’ అన్నాడు సుధాకర్‌ సార్‌.

పిల్లలకు ఇందంతా తామాషాగా అనిపించింది. ‘‘అలాగే సార్‌!’’ అంటూ పిల్లలంతా గట్టిగా అరిచారు.సోషల్‌ టీచర్‌ నాగరాజు సార్‌కి అచ్చం అమ్మాయిలా ఉండేటట్లు చీర కట్టి, విగ్గు పెట్టి అమ్మాయిలా వేషం వేసి, పొట్టదగ్గర కనిపించకుండా బట్టలు చుట్టి.. కడుపు ఎత్తుగా వచ్చేటట్లు చేశారు.అవినాష్‌ని ఇంకా మిగిలిన పిల్లలను తీసుకుని ఆ రోజు స్కూల్‌ అయిపోయిన తర్వాత ఆనంద బాబా ఉండే చోటుకు వెళ్లారు.పువ్వులతో అలంకరించిన ఆసనంమీద ఆనంద బాబా కూర్చోని ఉన్నాడు.భక్తులంతా తన్మయత్వంతో అతను చెప్పే మాటలు వింటున్నారు.కాసేపటి తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఆయన వాళ్లకి విభూతి, తాయత్తులు ఇస్తున్నాడు.సుధాకర్‌ సార్‌ కూడా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని తీసుకుని ‘ఆనందబాబా’ దగ్గరకు వెళ్లాడు. అనుమానం రాకుండా ఆనందబాబా కాళ్లను మొక్కారు.అప్పుడు సుధాకర్‌ సార్‌... ‘‘బాబా ఈమె నా భార్యకమల. మాకు పెళ్లై పదేళ్ల తర్వాత ఇప్పుడు తను గర్భం దాల్చింది. బాబా మీ మహిమలతో నా భార్య గర్భంలో ఉండేది ఏ బిడ్డో చెప్పండి’’ అన్నాడు.ఆనంద బాబా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని చూసి, అతని తలమీద చెయ్యి పెట్టి కళ్లు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్ఛరించాడు. తర్వాత కళ్లు తెరచి నవ్వుతూ ‘‘నాయనా..! నీ భార్యకు పండంటి మగబిడ్డ పుడతాడు. ఈ తాయత్తు ఆమె చేతికి కట్టునాయనా!’’ అన్నాడు. అంతే అక్కడ కూర్చున్న పిల్లలంతా పెద్దపెద్దగా నవ్వారు.

వెంటనే పిల్లలవైపు తిరిగి.. ‘‘ఇప్పుడు చూశారు కదా పిల్లలూ..! ఈ బాబాకి ఎంత మహిమ ఉందో.. మన నాగరాజు సార్‌కి మగబిడ్డ పుడతాడట. ఇప్పుడు తెలిసింది కదా ఈ బాబా దగ్గర ఏ మాయలు, మహిమలు లేవని. ఇకనైనా మీరు ఇటువంటి దొంగబాబాల మాయమాటలు నమ్మడం మానేసి కష్టపడి చదువుకోవాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. అలా కాకుండా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మీరు సోమరిపోతులుగా తయారుకాకూడదు. మీ శ్రమనే మీరు నమ్ముకోవాలని మీకు తెలియజెప్పడానికే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది’’ అన్నాడు.అర్థమైనట్లుగా పిల్లలంతా తలలు ఊపారు. ఆ తర్వాత బాబా మోసాలని గ్రహించిన గ్రామస్తులు ఆ బాబాని తరిమితరిమి కొట్టారు.
-  వి. రోహిణి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement