మిథిలానగరి మైథిలమ్మలు | Madhubani paintings by gauri mishra | Sakshi
Sakshi News home page

మిథిలానగరి మైథిలమ్మలు

Published Sun, Jun 3 2018 11:59 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

Madhubani paintings by gauri mishra - Sakshi

మిథియాంచల్‌! పెద్దగా వినని పేరు. కొద్దిగా మార్చి మిథిల అంటే.. అది మనకు బాగా పరిచయమున్న పేరే. ఈ మిథియాంచల్‌లో ‘మైథిలమ్మలు’ అడుగడుగునా కనిపిస్తారు. అందరూ సీతమ్మకు చెల్లెమ్మలే. మిథియాంచల్‌ మహిళల చేతి కుంచె నుంచి సీతమ్మవారు, ఆమె పాణిగ్రహీత రాముని రూపం రంగుల్లో మధుబని కళగా జాలువారుతుంటాయి. రామాయణ ఘట్టాలు అలవోకగా కాన్వాసుపై పరచుకుంటాయి.  

కళకు ప్రాణం గౌరీ మిశ్రా
ఎంత గొప్ప కళ అయినా.. ఆ కళకు రాజపోషణ ఉన్నంత కాలమే మన్నుతుంది. ఆ కళాకారులకు అన్నం దొరికినంత కాలం బతికి బట్టకడుతుంది. మిథియాంచల్‌లో చేతిలో కళ ఉన్న కళాకారులున్నారు, వారసత్వంగా వస్తున్న కళను బతికించుకోవాలనే తపన ఉన్న వాళ్లూ ఉన్నారు. అయితే తమ చేతిలో ఉన్న కళ గొప్పదనం తెలియని తనం కూడా వారిలో ఎక్కువే. అలాంటి పరిస్థితిలో మధుబని పెయింటింగ్స్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు గౌరీ మిశ్రా.

ఆమె 1993లో ‘సేవ’ పేరుతో సంస్థను స్థాపించి మైథిలి మహిళలను ఒక గొడుగు కిందకు చేర్చారు. ‘‘మీ కళకు సమాజంలో గౌరవం ఉంది, ధైర్యంగా పని చేయండి’’ అని ఆ గ్రామీణ మహిళా హస్తకళాకారులకు ఇరవై ఏళ్ల పాటు భరోసా ఇచ్చారు.  గౌరీ మిశ్రాకు వార్ధక్యం వచ్చేసింది. ఆ మధుబని మైథిలులకు అండగా నిలిచే వాళ్లు లేరు. వారికి మార్కెట్‌ నైపుణ్యాలు తెలియచేసి ఆ ఆర్ట్‌ను మోడరన్‌ సొసైటీకి దగ్గర చేసే ఓ మనిషి కావాలి. ఆ మనిషి మహిళ అయితే మంచిదనుకున్నారు గౌరీ మిశ్రా.

మనవరాలికి వారసత్వం
2010 సంవత్సరం. ఓ రోజు మనవరాలు ఐహితశ్రీ శాండిల్యను మిథియాంచల్‌కు తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఐహిత కురుక్షేత్ర ఎన్‌ఐటిలో చదివింది. అప్పటికి ఐబిఎమ్‌లో ఉద్యోగం చేస్తోంది. తన మనసులో మాట ఏమీ చెప్పకుండా తనకు తోడుగా రమ్మని తీసుకెళ్లారు గౌరీమిశ్రా. ఆ అమ్మాయికి మధుబని కళ లోతుల్ని చూపించారు. కళాకారుల చేతిలోని గొప్పతనం గురించి చెప్పారు. మధుబని చిత్రలేఖనంలో బొమ్మ గీయడం, రంగులు వేయడం అంతా కుంచెతోనే. స్కేలు, పెన్సిల్‌ వంటివి వాడరు. 

వలయాకారాన్ని గీయడానికి కనీసం చేతి గాజునైనా ఆసరాగా తీసుకుంటారేమోనని చూసింది ఐహిత. అలాంటిది కూడా లేదు! కుంచెతోనే వలయాకారాన్ని గీసేస్తున్నారు. దాని వెనుక ఎన్నేళ్ల సాధన దాగి ఉందోనని ఆశ్చర్యపోవడం ఐహిత వంతయింది. ఇరవై ఏళ్లు శ్రమించి పదిహేను వేల మందిని ఒక చోటుకు తెచ్చి, ఉపాధికి నమ్మకం కల్పించిన విషయాన్ని మనవరాలికి గుర్తు చేశారు గౌరీమిశ్రా.

తన తర్వాత వాళ్లకు ఒక ఆలంబన కోసం ఎదురు చూస్తున్నానని కూడా ఆ సందర్భంలోనే చెప్పారు. ఆ వచ్చే వ్యక్తి.. మధుబని కళ గొప్పతనాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. మహిళల నైపుణ్యానికి పదును పెడుతూ, మార్కెట్‌ కోరుకునే డిజైన్లను ఈ ప్రక్రియలో మేళవించగలిగిన ఆసక్తి కూడా ఉన్న వ్యక్తి అయితేనే ఈ సామ్రాజ్యం నిలుస్తుందని చెప్పారు. తాను రంగంలోకి దిగినప్పటి పరిస్థితిని, ఆ తర్వాత వచ్చిన మార్పులను కూడా వివరించారు.

కాలం వెనుక మధుబని
మధుబని ఆర్ట్‌ గురించి ప్రపంచానికి తెలియని రోజుల్లో తొలి ఎన్‌జివోను స్థాపించారు గౌరీమిశ్రా. దళారులను తప్పించి ప్రభుత్వ సంస్థలతో కలిసి హస్తకళాకారుల చేత ఎగ్జిబిషన్‌లలో స్టాళ్లు పెట్టించారు. అనేక మంది ఈ కళను నేర్చుకోవడానికి వేదిక కల్పించారు. ఆ కళకు తగినంత ఆదరణ వచ్చిన తర్వాత, మార్కెట్‌లో గిరాకీ పెరగడంతోపాటు నకిలీ కళాకృతుల తయారీ కూడా మొదలైంది.

చేత్తో వేసే మధుబని డిజైన్‌ని డిజిటల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ప్రింట్‌ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. కళను ఈ కష్టం నుంచి గట్టెక్కించాలంటే, టెక్నాలజీ తెలిసిన కొత్త తరంతోనే సాధ్యమని కూడా గౌరీ మిశ్రా తన మనవరాలికి చెప్పారు.

‘అస్మిత’తో కొత్త కళ!
2012లో ఐహిత ఐబిఎమ్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చింది. ‘మధుబని అస్మిత’ పేరుతో మైథిలి మహిళలకు అండగా నిలుస్తానని నానమ్మతో చెప్పింది. ఈ ఐదేళ్లలో ఐహిత మధుబని కళను విదేశాలకు పరిచయం చేసింది.

మ్యూజియం పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా న్యూయార్క్‌లోని రుబిన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్, ముంబయిలోని జీవీకే జయహే మ్యూజియం స్టోర్, బెంగళూరు ఫోక్‌ఆర్ట్‌ గ్యాలరీలలో ఈ మైథిలీ కళను ప్రదర్శించింది. ఇప్పుడు నెలలో పది రోజులు ఢిల్లీ, చెన్నై, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌లలో ప్రదర్శనల కోసం పర్యటిస్తోంది.

టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తోంది. అలాగే స్టాల్‌లో అడిగిన వారికి, అడగని వారికి కూడా అసలైన మధుబని హస్తకళాఖండానికి, నకిలీ ప్రింట్‌కి తేడాను వివరించగలుగుతోంది.మధుబని మన సంస్కృతిలో భాగం. సంస్కృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనడానికి ఈ మైథిలమ్మలే ఉదాహరణ అంటోంది ఐహిత.

మైథిలమ్మలు
బిహార్‌ రాష్ట్రంలో ఉత్తర భాగాన ఓ మారుమూల ప్రదేశం మిథియాంచల్‌. ఇక్కడి మహిళలను మైథిలి అంటారు. మనకు తెలిసిన మైథిలి సీతమ్మ ఒక్కటే. ఇక్కడి మైథిలమ్మలంతా తప్పనిసరిగా సీతారాముల కల్యాణం ఘట్టాన్ని చిత్రించడం నేర్చుకుంటారు. ఈ చిత్రలేఖన ప్రక్రియను మధుబని అని పిలుస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement