మాంగల్య గౌరీ/మంగళ గౌరీ/సప్త మోక్షపురి/ పంచ గయా క్షేత్రం బీహార్‌లోని గయలో మంగళగౌరి కొండలు, ఫల్గుణీ నది ఒడ్డున ఉన్న 51 శక్తి పీఠాలలో ఒకటి. 15వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ ఆదిశక్తి దేవి పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. మంగళ గౌరీ ఆలయం గురించిన ప్రస్తావన పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, ఇతర గ్రంథాలు, తాంత్రిక రచనలలో తప్పక కనిపిస్తుంది. మంగళగౌరిని ఉపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప–శక్తి పీఠాన్ని కలిగి ఉంది.
శ్రీ సతీదేవి శరీరభాగాలు భూమిపై పడిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలుగా కొలుస్తారు. వాటిలోని కీలకమైన వాటిని 51 శక్తిపీఠాలుగా, తిరిగి వాటిలోని అత్యంత కీలకమైన వాటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పూజిస్తారు. వాటిలో అమ్మవారి ఎడమ స్తనం పడిన ప్రదేశమే గయలోని మాంగళ్య గౌరికా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, శ్రీ సతీదేవి రొమ్ము భాగం భూమిపై పడిన ప్రదేశం శ్రీ మాంగల్య గౌరీ మందిరం.
ఈ మందిరంలో రెండు గుండ్రని రాళ్లు ఉన్నాయి, ఇవి సతీదేవి స్తనాలను సూచిస్తాయి. ఇక్కడ శక్తి రొమ్ము రూపంలో పూజించ బడుతుంది, ఇది పోషణకు చిహ్నం. ఎవరైతే కోరికలు, ప్రార్థనలతో అమ్మ దగ్గరకు వస్తారో, వారు అన్ని కోరికలు తీరి విజయవంతంగా తిరిగి వస్తారని నమ్ముతారు. సతీదేవి మృతదేహంతో శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వెళ్ళాడు అంటారు.
తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మితమైంది. గుడికి చేరుకోవాలంటే ఆ చిన్న కొండ ఎక్కాలి. మెట్ల మార్గం స్థానిక ప్రజల నివాసాల మధ్య ఉంటుంది. మెట్ల మార్గం ప్రారంభంలో, భీముని ఆలయం ఉంది. అతని మోకాలి ముద్రను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ భీముడు శ్రాద్ధకర్మ చేసాడు, అందుకే దీనిని భీమవేది గయ అని పిలుస్తారు.
కొండపై కూర్చున్న అమ్మవారిని దయగల దేవతగా భావిస్తారు. వర్షాకాలంలో ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్త్రీలు తమ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి భర్తలు విజయం, కీర్తిని పొందాలని ఉపవాసం ఉంటారు. ఈ పూజలో మంగళ గౌరీ దేవికి 16 రకాల కంకణాలు, 7 రకాల పండ్లు, 5 రకాల మిఠాయిలు నైవేద్యంగా పెట్టడం మొదటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. మంగళ గౌరీ ఆలయంలో శివుడు, దుర్గ, దక్షిణ–కాళి, మహిషాసుర మర్దిని, సతీదేవి వివిధ రూపాలను చూడవచ్చు.
ఈ ఆలయ వివరణ పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, శ్రీ దేవి భాగవత పురాణం, మార్కండేయ పురాణాలలో కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కాళి, గణపతి, శివుడు, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే లక్షలాది మంది భక్తులు ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆలయానికి వస్తుంటారు.
ఈ క్షేత్రంలోని ప్రసిద్ధ పండుగ ’నవరాత్రి’, ఇది అక్టోబర్‌లో జరుగుతుంది. ఈ మందిరం ‘మరణానంతర క్రతువులకు’ (శ్రాద్ధము) ప్రసిద్ధి చెందింది. ‘మహా–అష్టమి’ (ఎనిమిదవ రోజు), భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ మంగళ గౌరీ వ్రతం (వ్రతం), దీనిని మహిళలు తమ కోరికల సాఫల్యం కోసం చేస్తారు.
మంగళవారాలలో ఉపవాసం ఉండి, స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇతర వివాహిత స్త్రీలందరూ శ్రావణ మాసంలో మాత్రమే వ్రతం చేస్తారు. ఇవే కాకుండా, ఈ ఆలయంలో దీపావళి, హోలీ, జన్మాష్టమి వంటి ఇతర ప్రధాన పండుగలను కూడా బాగా జరుపుకుంటారు. ఆలయం ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది.
ఎలా వెళ్లాలి?
గచ రైల్వే జంక్షన్ ఆలయానికి 4 కిమీ దూరం, బస్ స్టాండ్ ఆలయం నుండి 4.7 కిమీ దూరంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment