
మొబైల్ గార్డుకు బంగారు సొబగులు
సెల్‌ఫోన్... ఆధునిక ప్రపంచంలో ఇది లేనిదే క్షణం కూడా గడవదేమో. బెంగళూరు వంటి ఐటీ నగరిలో అయితే సెల్‌ఫోన్‌దే రాజ్యం.
సాక్షి, బెంగళూరు : సెల్‌ఫోన్... ఆధునిక ప్రపంచంలో ఇది లేనిదే క్షణం కూడా గడవదేమో. బెంగళూరు వంటి ఐటీ నగరిలో అయితే సెల్‌ఫోన్‌దే రాజ్యం. మరో వైపు ఫ్యాషన్ నగరిగా పేరు గాంచిన ఈ మెట్రో నగరంలో అయితే అత్యాధునిక లేటెస్ట్ మాడల్స్ ఉండాల్సిందే. ఇందు కోసం మొబైల్‌కు ఉపయోగించే గార్డ్ అయితే రోజుకొకటి వాడుతూ చుట్టుపక్కల ఉన్నవారిని తమ ఫోన్ వైపునకు తిప్పుకొనేవారు లేకపోలేదు.
ఇలాంటి వారి కోసం బెంగళూరులోని చిత్రకళా పరిషత్‌లో శనివారం ప్రారంభమైన ఒడిశా మేళాలోని ఓ స్టాల్‌లో బంగారపు మెరుగులు అద్దిన ఈ మొబైల్ గార్డ్ ప్రత్యేకంగా ఆరర్షిస్తోంది. 24 క్యారెట్ల బంగారం, నవరాత్నాలను సన్నని పొడిగా చేసి కాటుక, పసుపుతో రంగరించి సరికొత్త రంగులను తయారు చేసి, ఆ రంగులను మొబైల్ గార్డుకు అద్ది మరింత అందంగా తీర్చి దిద్దుతున్నారు. ధర కాస్త ఎక్కువైనా వీటిని కొనడానికి యువత ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు ఉత్సాహం చూపుతున్నారని స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు.
150 ఏళ్లనాటి పత్రాలే కాన్వాసులుగా
ఒరిస్సా ప్రాంతానికి చెందిన 150 నుంచి 200 ఏళ్లనాటి దస్తావేదులను కాన్వాసులుగా చేసుకొని మినియేచర్ హాండ్ పెయిటింగ్ విధానంలో గీసిన చిత్రాలు కూడా ఒడిస్సా మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రంగురాళ్లను పొడిగా చేసుకొని వీటికి ఆకులు, బీట్‌రూట్ వంటి వాటితో రూపొందించిన సహజ రంగులను కలిపి ఈ దస్తావేదుల పై చిత్రాలను చిత్రీకరిస్తారు. ఇక ఈ విధానంలో గీసిన సూక్ష్మచిత్రాలను చూడటానికి లెన్స్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. మినియేచర్ హాండ్ పెయింటింగ్‌గా పిలిచే ఈ చిత్రకళకు దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉందని కళాకారుడు మహేంద్రకుమార్ తెలిపారు.