మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు.
శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు.
ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు.