నాకు అందులో ఆసక్తి అధికం.. | nivetha pethuraj Special Interview On Tic Tic Tic Movie | Sakshi
Sakshi News home page

మెగాఫోన్‌ పట్టాలని ఉంది!

Published Fri, Jun 22 2018 8:15 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

nivetha pethuraj Special Interview On Tic Tic Tic Movie - Sakshi

తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటీమణుల్లో నివేదాపేతురాజ్‌ ఒకరు. ఒరు నాళ్‌కూత్తు చిత్రంతో రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలి చిత్రంతోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

అయినా నివేదాపేతురాజ్‌కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. తాజాగా జయంరవితో అంతరిక్షంలో సాహసోపేతంగా రొమాన్స్‌ చేసిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై నివేదాపేతురాజ్‌ చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సందర్భంగా నివేదాపేతురాజ్‌ చెబుతున్న సంగతులేంటో చూద్దాం.

ప్ర: మీ సినీ పయనం గురించి?
జ:   నేను పుట్టింది మదురైలోనే. అయితే పెరిగింది దుబాయ్‌లో. అక్కడ నా అనుభవం 14 ఏళ్లు. అందాల పోటీల్లో పాల్గొన్నాను. అవే తనను కోలీవుడ్‌లో కథానాయకిని చేశాయి. వరుసగా అవకాశాలు  వస్తున్నాయి. అలా ఇప్పుడు 8వ చిత్రంలో నటిస్తున్నాను.

ప్ర: తెలుగులోనూ కాలిడినట్లున్నారే?
జ:  పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం చూసి తెలుగులో నటించే అవకాశం కల్పించారు. అక్కడ కొన్ని చిత్రాలు చేస్తున్నాను. అయితే కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా జూనియర్‌ ఎన్‌టీఆర్‌తో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది.

ప్ర: సరే నటిగా మీ ప్రణాళిక ఏమిటి?
జ:  నిజం చెప్పాలంటే నటిగా నాకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. వచ్చిన అవకాశాల్లో నచ్చిన చిత్రాలను చేసుకుంటూపోతున్నాను. యోగాపై ఆసక్తి ఉంది. దర్శకత్వం చేయాలన్న ఆశ ఉంది. అందుకోసమే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను.

ప్ర: టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం గురించి?
జ:  ఇందులో స్వాతి అనే పాత్రలో నటించాను. షూటింగ్‌కు సెట్‌లోకి వెళుతున్నప్పుడే హాలీవుడ్‌ సెట్‌లోకి వెళుతున్న భావన కలిగేది. చాలా వినూత్న అనుభవం. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.ఈ చిత్రంలో నేను పోరాటాలు కూడా చేశాను.

ప్ర: సినిమా రంగంలో గట్టి పోటీ నెలకొంటుందిగా?
జ:  నేను అవకాశాల కోసం అంటూ నేనెవరి వద్దకూ వెళ్లి అడిగిందిలేదు. దీన్ని ఘనతగానే భావిస్తాను. ఇక్కడ పని లేకపోతే దుబాయ్‌ వెళ్లిపోతాను. నా పని నేను చేసుకుపోతున్నాను. అందుకే వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ప్ర: మీలో ఇతర ప్రత్యేకతలు?
జ: పెయింటింగ్స్‌ బాగా వేస్తాను. అందులో ఆసక్తి అధికం. పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని స్నేహితులు అంటున్నారు. అయితే అందుకు ఇంకా చాలా శ్రమించాల్సి ఉంది. డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. కార్‌ రేస్‌లో పాల్గొని గెలుపోటములు పొందిన అనుభవం ఉంది. ఇలాంటి సాహసాలు చేయపోతే జీవితంలో మజా ఏం ఉంటుంది. ఛాలెంజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అదే సమయంలో భయం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement