వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం? | What is cause to rain drops round shape ? | Sakshi
Sakshi News home page

వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం?

Published Wed, Dec 10 2014 12:44 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం? - Sakshi

వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం?

నునుపైన తలం లేదా శుభ్రమైన ఆకుపై నీటి బిందువు పడినప్పుడు ఆ నీరు అర్ధగోళాకృతిని పొందుతుంది. దీనికి కారణం నీటి తలతన్యత. ఒక నీటి బిందువును గుండు సూది సహాయంతో విడగొట్టలేక పోవడానికి కారణం నీటి తలతన్యత. వాన చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం ఈ ధర్మమే. ఆకుపచ్చని మొక్కలు కేశనాళికీయత వల్ల వేర్ల ద్వారా నీటిని శోషించుకొని మొక్క వివిధ భాగాలకు సరఫరా చేస్తాయి.
 
 తలతన్యత
 అణువుల మధ్య ఆకర్షణ బలం రెండు రకాలుగా ఉంటుంది. అవి:
     1) సంసంజన బలం
     2) అసంసంజన బలం
 1.    సంసంజన బలం:
 ఒకే జాతికి చెందిన అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ‘సంసంజన బలం’ అంటారు. ఉదా: నీటి అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలం. ఈ సంసంజన బలాల వల్ల నీరు తక్కువ ఘనపరిమాణం, వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది.
 తలతన్యత: సంసంజన బలాల వల్ల ద్రవాలు అతి తక్కువ వైశాల్యం, ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. దీని వల్ల ద్రవ ఉపరితల అణువులు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకొని, ఒకదాని నుంచి మరొకటి విడివడకుండా ఉంటాయి. ఈ ధర్మాన్నే ‘తలతన్యత’ అంటారు. సంసంజన బలాల వల్ల ద్రవాలు తలతన్యత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి.
     
 అనువర్తనాలు:
 -    రెండు నీటి బిందువులను కలిపినప్పుడు అవి వెంటనే అతుక్కుపోవడానికి కారణం నీటి తలతన్యత.
 -    వర్షం కురవడానికి ముందు మేఘాల్లోని నీరంతా ఒక దగ్గరికి చేరుతుంది. దీనికి కారణం తలతన్యతే.
 -    చెలమ లేదా బావిలో నీరు ఊరడానికి కారణం నీటి తలతన్యత.
 -    కొంత నీరున్న బకెట్‌లో పెయింటింగ్ బ్రష్‌ను ఉంచినప్పుడు దాని వెంట్రుకలు దూరంగా వెళ్లిపోతాయి. అదే బ్రష్‌ను నీటిలో నుంచి బయటకు తీసినప్పుడు కుంచె వెంట్రుకలు దగ్గరగా వస్తాయి. దీనికి కారణం నీటి తలతన్యత.
 -    కుళాయి నుంచి నీరు ఒక జట్టుగా రావడానికి/ కారడానికి కారణం నీటి తలతన్యతే.
     
 2. అసంసంజన బలం:
 వేర్వేరు జాతులకు చెందిన అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ‘అసంసంజన బలం’ అంటారు.
 ఉదా: ఒక గాజు పాత్రను కొంత వరకు నీటితో నింపినప్పుడు గాజు గోడల వద్ద నీరుపైకి ఎగబాకుతుంది. దీనికి కారణం నీటికి, గాజుకీ మధ్య పనిచేసే అసంసంజన బలం.
 
 కేశనాళికీయత
 సన్నటి వ్యాసార్ధం ఉన్న గాజు గొట్టాన్ని ఒక ద్రవంలో ముంచినప్పుడు దాని ద్వారా ఆ ద్రవం పైకి ఎగబాకే ధర్మాన్ని ‘కేశనాళికీయత’ అంటారు. సన్నటి వ్యాసార్ధం ఉన్న గాజు గొట్టాన్ని ‘కేశనాళిక’ అంటారు. ద్రవాలు అసంసంజన బలాల వల్ల ‘కేశనాళికీయత’ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి.
 స్పర్శ కోణం: ఏదైనా ఒక వస్తువును ఒక ద్రవంలో ముంచినప్పుడు ఆ ద్రవ ఉపరితలం స్పర్శ బిందువు వద్ద వస్తువుతో చేసే కోణాన్ని ‘స్పర్శకోణం’ అంటారు. గాజుతో నీరు చేసే స్పర్శ కోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం.
 గాజుతో పాదరసం చేసే స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అధికకోణం. ఇది సాధారణంగా
 139ని లుగా ఉంటుంది.
 
     స్పర్శ కోణాన్ని ప్రభావితం చేసే అంశాలు:
 1.    నీటితో గాజు చేసే స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం. నీటి స్వచ్ఛత పెరిగే కొద్దీ స్పర్శ కోణం తగ్గుతుంది. అందువల్ల  వస్తువులను సాధారణ నీటిలో కంటే స్వచ్ఛమైన నీటిలోనే బాగా శుభ్రపరచవచ్చు.
 2.    ఉష్ణోగ్రత పెరగడం వల్ల నీటి స్పర్శకోణం తగ్గుతుంది. అందువల్ల వస్తువులను సాధారణ నీటిలో కంటే వేడి నీటిలోనే బాగా శుభ్రం చేయవచ్చు.
 3.    నీటితో స్పర్శ కోణాన్ని తగ్గించే పదార్థాలను సంసిక్తకాలు అంటారు.
     ఉదా: సబ్బు, సర్ఫు, డిటర్జెంట్, చాకలి సోడా మొదలైనవి. సంసిక్తకాల స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అల్పకోణం.
 4.    నీటితో స్పర్శ కోణాన్ని పెంచే పదార్థాలను అసంసిక్తకాలు అంటారు.
 ఉదా: కొవ్వులు, నూనెలు, చమురు పదార్థాలు, మైనం, గ్రీజు మొదలైనవి. అసంసిక్తకాల స్పర్శకోణం ఎల్లప్పుడూ ఒక అధిక కోణం.
 5.    పైపులను అతికించేటప్పుడు గ్రీజుతో పూత పూస్తారు. దీని వల్ల నీటికి, పైపునకు మధ్య స్పర్శ కోణం పెరిగి నీరు కారడం ఆగిపోతుంది.
 6.    వాటర్ ఫ్రూఫ్ బ్యాగుల్లో లోపలి గోడలను మైనం లాంటి అసంసిక్తకాలతో పూత పూయడం వల్ల నీటికి, సంచికి మధ్య స్పర్శకోణం పెరిగి నీరు కారడం ఆగిపోతుంది.
 
 కేశనాళికీయత అనువర్తనాలు:
 -    కిరోసిన్ దీపం, కొవ్వొత్తి కేశనాళికీయత ధర్మం ఆధారంగా పనిచేస్తాయి.
 -    సాగు భూములు వదులుగా (మెత్తగా) ఉండటం వల్ల వేర్లు కేశనాళికీయత ధర్మం ద్వారా లోపలికి ఇంకిన నీటిని కూడా పీల్చుకొని మొక్కలకు అందిస్తాయి.
 -    ఏదైనా ఒక మట్టి గోడ పక్కన ఉన్న గుంతలో నీరు నిలిచినప్పుడు కేశనాళికీయత వల్ల నీరు ఆ గోడలపైకి ఎగబాకుతుంది.
 -    కాటన్, స్పాంజ్, నాప్‌కిన్‌‌స మొదలైనవి కేశనాళికీయత వల్ల ద్రవాలను పీల్చుకుంటాయి.
 -    స్నానం చేసిన తర్వాత టవల్‌తో రుద్దినప్పుడు అది కేశనాళికీయత ధర్మం వల్లే నీటిని పీల్చుకోగలుగుతుంది.
 -    ఫౌంటేన్ పెన్ (పత్తి పెన్ను), మార్కర్, స్కెచ్ పెన్ను మొదలైనవి కేశనాళికీయత ధర్మం ఆధారంగా పనిచేస్తాయి.
 
 గతంలో అడిగిన ప్రశ్నలు
 1.    వర్షం చినుకులు గోళాకృతిలో ఉండటానికి కారణం?
     1) కేశనాళికీయత
     2) అసంసంజన బలాలు
     3) కేంద్రక బలాలు    4) తలతన్యత
 2.    కిరోసిన్ దీపం ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది?
     1) తలతన్యత
     2) సంసంజన బలాలు
     3) కేశనాళికీయత    4) కేంద్రక బలాలు
 3.    నీటి స్వచ్ఛత పెరిగితే స్పర్శకోణం?
     1) తగ్గుతుంది    2) పెరుగుతుంది
     3) మారదు
     4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు
 4.    ఒక గుండు సూదికి మైనాన్ని పూస్తే అది నీటిపై తేలియాడుతుంది. దీనికి కారణం?
     1) అధిక సాంద్రత    2) అల్పసాంద్రత
     3) తలతన్యత    4) కేశనాళికీయత
 5.    ఇంకు పెన్ను ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది?
     1) తలతన్యత    2) కేశనాళికీయత
     3) అభికేంద్రబలం    4) అపకేంద్రబలం
 6.    కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
     1)    ఉష్ణోగ్రత పెరిగితే నీటి స్పర్శకోణం తగ్గుతుంది
     2)    ఉష్ణోగ్రత పెరుగుదలతో పాటు నీటి స్పర్శకోణం విలువ పెరుగుతుంది
     3)    నీటి స్పర్శకోణంపై ఉష్ణోగ్రత ప్రభావం ఉండదు
     4)    ఉష్ణోగ్రతతో నీటి స్పర్శకోణం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
 7.    స్వచ్ఛమైన నీరు గాజుతో చేసే స్పర్శకోణం ఎంత?
     1) 0ని        2) 45ని
     3) 90ని        4) 180ని
 8.    ఆకు పచ్చని మొక్కలు వేర్ల ద్వారా నీటిని శోషించుకొని అన్ని భాగాలకు సరఫరా చేసుకుంటాయి. దీంట్లో ఇమిడి ఉన్న  ధర్మం ఏది?
     1) తలతన్యత    2) కేశనాళికీయత
     3) అభికేంద్ర బలం    4) అపకేంద్ర బలం
 
 సమాధానాలు
     
     1) 4;    2) 3;    3) 1;    4) 3;
     5) 2;    6) 1;    7) 1;    8) 2.
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    కిందివాటిలో కేశనాళికీయత ధర్మానికి
     ఉదాహరణ కానిది?
     1) ఇంకు ఎగబాకడం
     2) నీరు ఊరడం
     3)    వేర్ల నుంచి నీరు మొక్కలోని భాగాలకు చేరడం
     4) గుడ్డ నీటిని పీల్చుకోవడం
 2.    నీటి బిందువు అతి తక్కువ వైశాల్యం, ఘనపరిమాణాలను ఆక్రమించడానికి కారణమైన ధర్మం?
     1) తలతన్యత    2) స్నిగ్ధత
     3) సాంద్రత    4) భాష్పీభవన పీడనం
 3.    కిందివాటిలో అత్యధిక తలతన్యత ఉన్న ద్రవం?
     1) పాదరసం    2) నీరు
     3) సముద్రం    4) బ్రోమిన్
 4.    ఏ ధర్మం వల్ల నీటి బిందువులు గోళాకారంలో ఉంటాయి?
     1) స్నిగ్ధత       2) ఉపరితల తన్యత
     3) అధిక ఉష్ణం 4) వక్రీభవన సూచిక
 5.    ఏ ధర్మం వల్ల నూనె దీపం వత్తిలోకి కిరోసిన్  ఎగబాకుతుంది?
     1) పీడన వ్యత్యాసం 2) కేశిక చర్య
     3) నూనెకు స్నిగ్ధద తక్కువగా ఉండటం
     4) భూమ్యాకర్షణ శక్తి
 6.    కేశనాళిక గొట్టంలో పాదరసం ఎత్తు దాని అసలు ఎత్తుకు .... ?
     1) సమానం    2) తక్కువ
     3) ఎక్కువ    4) శూన్యం
 7.    దేని కారణంగా సన్నని గొట్టాల్లో నీటి మట్టం పెరుగుతుంది లేదా తగ్గుతుంది?
     1) తలతన్యత    2) కేశనాళికీయత
     3) లవణం      4) వాతావరణ పీడనం
 8.    టిష్యూ పేపర్ ఏ చర్య ద్వారా నీటిని గ్రహిస్తుంది?
     1) కేశనాళికీయత    2) వ్యాప్తి
     3) సంవహనం    4) అయస్కాంతం
 9.    గుండుసూది నీటిపై తేలియాడటానికి కారణం?
     1) తలతన్యత    2) స్నిగ్ధత
     3) స్థితిస్థాపకత    4) సాంద్రత
 10.    ఫౌంటేన్ పెన్ పనిచేసే సూత్రం?
     1) కేశనాళికీయత    2) తలతన్యత
     3) ఊర్థ్వ ఒత్తిడి    4) స్నిగ్ధత
 11.    స్వచ్ఛమైన నీరు గాజుతో చేసే స్పర్శ కోణం (డిగ్రీల్లో)?
     1) 0ని    2) 5ని    3) 90ని        4) 180ని
 12.    నేలపై పడిన పాదరసం చిన్న గోళాలుగా విడిపోతుంది. దీనికి కారణం?
     1) అధిక సాంద్రత వల్ల
     2) అధిక స్నిగ్ధత వల్ల
     3) లోహం కావడం వల్ల
     4) అధిక తలతన్యత వల్ల
 13.    {దవాలు మాత్రమే ప్రదర్శించే ధర్మం?
     1) తలతన్యత    2) స్నిగ్ధత
     3) స్థితిస్థాపకత    4) పైవన్నీ
 
 సమాధానాలు
     1) 3;    2) 1;    3) 1;    4) 2;
     5) 2;    6) 2;    7) 2;    8) 1;
     9) 1;    10) 1;    11) 1;    12) 1;     13) 1.
 
 - గుండె మల్లేశం
 సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement