
సాక్షి, సిటీబ్యూరో: పెయింటర్లుగా ఇంటికి రంగులు వేస్తూ రెక్కీలు నిర్వహిస్తూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యులతో కూడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ సీసీఎస్, ఆర్‌జీఐఏ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన 15 తులాల బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లా గద్వాచౌరకు చెందిన మహమ్మద్ అబేద్ ఆలీ కూరగాయల వ్యాపారం చేసే తండ్రికి చేదోడు వాదోడుగాఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన మోహన్ యాదవ్‌తో కలిసి కిరాణా దుకాణం లో రూ.50 వేలు దొంగిలించిన కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 జనవరిలో జైలు నుంచి విడుదైన తర్వాత మోహన్ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వచ్చి గొల్కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం అబేద్ ఆలీ, తన స్నేహితుడు షేక్ ఫరూక్ హుస్సేన్‌తో కలిసి నగరానికి వచ్చి మోహన్‌యాదవ్‌తో కలిసి ఉంటున్నారు.
పెయింటర్లుగా పని చేసే వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌కు రంగులు వేసేందుకు వెళ్లిన వారు ఇంట్లో వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి చోరీకి పథకం పన్నారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న వీరిలో మోహన్ యాదవ్ బయట కాపలా ఉండగా అబేద్ ఆలీ, ఫరూక్ హుస్సేన్ ఇంటి గ్రిల్స్ తొలగించి కిటికీ ద్వారా లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని పారిపోయారు. పోలీసులు ఘటనాస్థలిలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా యూపీకి చెందిన పాతనేరగాళ్ల పనిగా గుర్తించారు. వృద్ధ దంపతులను విచారించగా ఇంటికి రంగులు వేసేందుకు యూపీకి చెందిన వారు వచ్చినట్లు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గోల్కొండలో అద్దె గదిలో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన వజ్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రత్యేకంగా కృషి చేసిన శంషాబాద్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు, బాలానగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లతో పాటు ఇతర సిబ్బందిని సీపీ సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment