పచ్చిరంగుల కాన్వాసుల్లో అలుపు తీర్చుకునే మనుషులు
తొలి ప్రదర్శన
తెలంగాణతనాన్ని కేవలం మనిషి ఆలంబనగా చిత్రించాలన్నది పి.ఎస్.చారి ప్రయత్నం అనుకొంటాను. అందుకే అతని బొమ్మల్లో లాండ్‌స్కేప్‌కు ప్రాధాన్యత తక్కువ. తెలంగాణను పట్టించేందుకు గొడ్లో, మేకలో, కచ్చీరో, జాజురంగు దర్వాజాలో, మట్టిగోడలో, ఇసుర్రాళ్లో... ఇలాంటి సరంజామాను వాడుకోడు. మనుషుల్ని మాత్రమే కాన్వాసులపైకి తీసుకొస్తాడు.
తలపాగాలూ, తువ్వాళ్లూ, కడియాలూ, మెళ్లో పూసలూ, అన్నింటికన్నా ముఖ్యంగా కవళికలూ, భంగిమలతోనే తెలంగాణ లాండ్‌స్కేప్ మొత్తాన్ని ఆవిష్కరిస్తాడు. పనిలో ఉండే, పనికోసం చూసే, పని మధ్యలో సేదతీరే వారు ఈ బొమ్మల్లో ఎక్కువ కనిపిస్తారు. రోజుల్ని శ్రమతో అలంకరించే ఈ మనుషులు మధ్యలో అయాచితంగా దొరికే చిరుఖాళీల్ని మరలా పనికోసం ఎదురుచూస్తూనో, పరస్పర సమక్షాల్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తూనో పూరించుకుంటారు.
చారీ బొమ్మల్లో పడుచమ్మాయిలూ అతనికే ప్రత్యేకం. ఆడతనం నుంచి అతను ఏరుకున్న అందమది. ఈ అమ్మాయిలు సోనామసూరి తిని పెరగలేదు, ఒడ్డొరుసుకుంటూ పారే కాలవగట్లపై మేకల్ని తరమలేదు, వారి దేహాలు కొబ్బరాకుల్లోంచి ప్రసరించే వెన్నెల నుంచి నిగారింపు తీసుకోలేదు, శృంగారాన్ని పడగ్గదుల్లో మాత్రమే భద్రంగా దాచుకొనే ప్రపంచాల్లోంచి వచ్చినవారు కాదు. వీరి బలమైన దవడలూ, దొడ్డు పెదాలూ జాణతనానికి దూరం. వీరి యవ్వనం మిగతా జీవితం నుంచి విడివడిన పచ్చటి ద్వీపం కాదు. లచ్చి లచ్చక్కగా మారి లచ్చుమవ్వగా మిగిలే క్రమం అంతా అదే ముఖంలో కనిపిస్తుంది.
చారి తన ఇతివృత్తాల నిసర్గ స్వరూపానికి బద్ధుడు. అందుకే అతని బొమ్మల్లో మోడర్నిజం వైపు ఏ మొక్కుబడి హాట్ టిప్పింగులూ లేవు. గీసే క్రమంలో గీతని పోనిస్తూనే అదుపులో ఉంచుకొంటాడు. వేసే క్రమంలో రంగులు చేసే అనూహ్య విన్యాసాల్ని ఉదారంగా ఆహ్వానిస్తాడు. బొమ్మల చేత గొప్ప ఐడియాల్నీ, ఉదాత్తమైన భావాల్నీ పలికించాలనుకోడు. బొమ్మల్ని వాటి సబ్జెక్టును బట్టీ, దాని మేధోపరమైన ఆధిక్యని బట్టీ అంచనా కట్టే వారికి చారీ కాన్వాసులు తెరుచుకోవు.
బొమ్మ ముందు ఆగి ఏ పనితనం, ఏ శ్రద్ధ, ఏ అనురక్తి వాటిని నడిపించాయోనని ఆలోచిస్తే... ఏ రంగు లోపల్నించి సన్నగా కనిపిస్తూ దేన్ని బాలన్స్ చేసిందో, టెక్చర్‌లో ఏ మాయ వీపు వెనక ముడుచుకున్న మన చేతుల్ని విప్పదీసి బొమ్మని తడిమేలా చేసిందో, ఇతివృత్తాన్ని ఎంత ప్రేమిస్తే కొన్ని పత్తాలేని పనిగంటల ఫలితంగా ఆ చెవిదుద్దు అలా మెరిసిందో, అలవోకగా సాగిన గీత అక్కడ కనిపించని మరెన్ని గీతల్ని స్ఫురింపజేస్తుందో ఇలా మిడిసిపడుతూ బోలెడు కబుర్లు చెబుతాయి అతని కాన్వాసులు.
- మెహెర్
(పి.ఎస్.చారి పెయింటింగ్ షో Undulating Reposes జూన్ 4 నుంచి 16 దాకా ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, బంజారాహిల్స్ రోడ్ నం.12, హైదరాబాద్‌లో జరగనుంది.)