Icon Art Gallery
-
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’.. : స్టార్ డిజైనర్ ఓస్వాల్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్ డిజైనింగ్, అధునాతన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’ అని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనిత ఓస్వాల్ తెలిపారు. దశాబ్దాల కాలం నుంచే ఇక్కడి రిచ్ కల్చర్ ప్రసిద్ధి చెందిందని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ సౌందర్య వాణిజ్య రంగానికి కూడా కేంద్రంగా రాజసాన్ని నిలుపుకుంటుందని ఓస్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కు జ్వువెల్లరీ డిజైన్ చేస్తున్న సమయంలో పలుమార్లు దక్షిణాది సౌందర్య సొగసుల పైన చర్చించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అనిత ఓస్వాల్ డిజైన్ చేసిన బంగారు, వజ్రాభరణాలను నగరంలోని రూం 9 పాప్ అప్ వేదికగా ‘ఝౌహరి’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. తనతో పాటు కవిత కోపార్కర్ ఆధ్వర్యంలోని అత్యంత విలువైన ప్రతా పైథానీ, బనారస్ శారీస్నూ ప్రదర్శిస్తున్న ’ఝౌహరి’ని ప్రముఖ సామాజిక వేత్త శ్రీదేవి చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓస్వాల్ నగరంలోని ఫ్యాషన్ హంగులను, బాలీవుడ్ తారల అభిరుచులను పంచుకున్నారు.హైదరాబాద్.. డ్రీమ్ ప్రాజెక్ట్..విలాసవంతమైన జీవితాల్లో ఆభరణాలు, జీవన శైలి ప్రధానమైన అంశాలని ఓస్వాల్ వివరించారు. 25 ఏళ్లుగా బాలీవుడ్ తారలకు జువెల్లరీ డిజైన్స్ రూపొందిస్తున్నానని, కానీ హైదరాబాద్ వేదికగా తన డిజైన్స్ ప్రదర్శించడం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నానని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కిరన్ ఖేర్, సోనాక్షి సిన్హా, సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్స్‌కు డిజైనర్‌గా చేశాను. ఐశ్వర్యరాయ్ భారతీయ సంస్కృతిలోని ఆభరణాల సౌందర్య వైభవాన్ని మరింత ఉన్నతంగా గ్లోబల్ వేదికపైన ప్రదర్శించడానికి ఇష్టపడేదని ఆమె అన్నారు.ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్‌ను అందిపుచ్చుకోవడంలో ఆసక్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్‌ను అనుకరిస్తూ, సృష్టిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచే హైదరాబాద్ ఫ్యాషన్ ఔత్సాహికులను కలవడం, వారి అభిరుచులను మరింతగా గమనించడం సంతోషాన్నిచ్చింది. సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డా.మాధవి నేతృత్వంలో రిచ్ లైఫ్‌ను ప్రతిబింబించే కవిత కోపార్కర్ ప్రతా పైథానీ, బనారస్ డిజైన్లతో రూం 9 పాప్ అప్‌లో... 3 రోజుల పాటు నగర ఫ్యాషన్ ప్రేమికులకు మరో ప్రపంచాన్ని చేరువ చేయనుందని ఆమె తెలిపారు.ఇవి చదవండి: An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం! -
కొండల్లో కొలువేల్పు
ఉద్యోగం ఉన్న ఇంట్లో దేవుడు ఉన్నట్లే. దేవుడి పటాన్నైతే తెచ్చిపెట్టుకోవచ్చు. ఉద్యోగాన్ని ఎవరు పటం కట్టి ఇస్తారు? పటాలతో కొండపైకి వెళ్లింది కివాసింగ్. మాట తీరును మెరుగుపరిచే పటం.. డబ్బులు కాసే ఐడియాల పటం.. మార్కెటింగ్‌కు పదును పెట్టే పటం.. అన్నీ కలిపి చూస్తే.. దేవుడు ప్రత్యక్షం! కుమావోన్ కొలువేల్పు కివా ఇప్పుడు. సరస్సులు కొండలపైకి ఎగసిపడలేవు. కివాసింగ్ రెండున్నరేళ్లుగా కొండలపైకి వెళ్లివస్తోంది. కొద్దిరోజులు కొండలపైనే ఉంటుంది కూడా. ‘సరస్సుల జిల్లా’ నైనిటాల్ అమ్మాయి కివాసింగ్. ‘టీచ్ ఫర్ ఇండియా’ లో ప్రోగ్రామ్స్ స్పెషలిస్టుగా అనుభవం ఉన్నవారికి చిన్నా చితకా ఉద్యోగాలేమీ రావు. నెత్తిన పెట్టుకుని విమానాల్లో ఊరేగించే ఉద్యోగాలే అన్నీ. అవొద్దనుకుని దేవుడి గుడి మెట్లు ఎక్కినట్లుగా.. కుమావోన్ కొండల్లోని ప్రతి గడపా ఎక్కి దిగుతోంది. ఏముంటాయి కొండల్లో! ఏముంటాయేమిటి? కొండలే ఉంటాయా! మనుషులు ఉండరా? వాళ్లకు పిల్లలు ఉండరా? వాళ్లు పెద్దయి ఉండరా? ఉద్యోగాల కోసం చూస్తూ ఉండరా? ‘‘నా పేరు కివాసింగ్ అమ్మా. నైనిటాల్ నుంచి వచ్చాను. మీ కిందే నేను ఉండేది. మీరు కొండపైన, నేను సరస్సు పక్కన..’’ ఆమె చేతిలో ఉన్న ఫైల్స్, ల్యాప్‌టాప్ చూస్తారు వాళ్లు. ఆమె ముఖంపై చిరునవ్వును కూడా. ఇంట్లోకి రమ్మనే అవసరం ఉండదు. కొండల్లో భాగమై ఉండే ఇళ్లు కనుక కొండంతా ఇల్లే. కూర్చునే చోటు, నిలబడే చోటు అంటూ ఏమీ ఉండవు. కూర్చున్నాక కివాసింగ్ అడుగుతుంది.. ‘‘చదువుకునే పిల్లలు గానీ, చదువుకున్న పిల్లలు గానీ ఇంట్లో ఉన్నారా?’’ అని. ‘‘ఉన్నారు తల్లీ. నీ అంత పిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తావా?’’.. వాళ్ల ప్రశ్న. నవ్వుతుంది కివాసింగ్. ‘‘ఏం ఉద్యోగం?’’ అంటుంది. ‘‘ఏదైనా.. ఇల్లు గడవడానికి నాలుగు రూపాయలు వస్తే చాలు’’ అంటారు. కుమావోన్ ప్రాంతంలో ప్రతి ఇంటి ముందూ కనిపించే మందార చెట్టులా, కనిపించకుండా ప్రతి చెట్టుకూ విరబూసే ఆశ.. ఉద్యోగం. బడికి పోతున్న పిల్లలున్నవాళ్లయితే.. ‘‘నీలాగా ఇంగ్లిష్ మాట్లాడాలి. నీలాగా కంప్యూటర్ వచ్చి ఉండాలి. అప్పుడు వాళ్లకు ఉద్యోగం వస్తుంది’’ అంటారు. మధ్యలో కివాసింగ్ ఫోన్ మాట్లాడ్డం విని ఉంటారు వాళ్లు. శ్రావ్యమైన ఆ కంఠంలోంచి జలపాతంలా దూకుతుండే ఇంగ్లిష్తో తమ పిల్లలకు తలస్నానం చేయించలేక గానీ.. లేకుంటే అంతపనీ చేసేవారు. ‘‘ఇంగ్లిష్ వస్తుంది అమ్మా.. చక్కగా మాట్లాడగలరు కూడా. నాకంటే చక్కగా..’’ అంటుంది కివాసింగ్. ఇదంతా రెండేళ్ల క్రితం వరకు. కివాసింగ్ టీమ్‌లోని వాలంటీర్ కుమావోన్‌కు కివాసింగ్ ఇప్పుడు తరచూ ఏమీ వెళ్లడం లేదు. ఆమె తరఫున వాలంటీర్లు వెళుతున్నారు. సాయంత్రాలు స్కూల్లో, కాలేజీ ఆవరణల్లో వర్క్‌షాపులు పెడుతున్నారు. వర్క్‌షాపు అనే మాట ఎంత లేదన్నా కాస్త గంభీరమైనదే. ఏదో కార్ఖానా అన్నట్లు ఉంటుంది. అలాంటి భయాలేమీ కలగకుండా వాలంటీర్లు పిల్లల్ని కలుసుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడ్డానికీ, ఇంగ్లిష్ అనే కాదు.. అసలంటూ చక్కగా మాట్లాడ్డానికి, కొత్తవాళ్లతోనైనా చొరవగా మాట్లాడడానికీ వారికి ఇప్పటి నుంచే శిక్షణ ఇస్తున్నారు. ఈ వాలంటీర్లలోనే నికార్సయిన స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించేవారు ఉంటారు. పిల్లల టీచర్లకు కూడా వాళ్లు బోధనలోని మెళుకువలు నేర్పిస్తుంటారు. ‘మెళకువ’ అంటే చెప్పడంలో మెళకువ కాదు, వినేలా చెప్పడంలో సరళత. అలాగే పిల్లల ఆసక్తుల్ని అడిగి తెలుసుకుని వాటిపై మరింత ఆసక్తిని కలిగించేందుకు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తుంటారు. ఇక చదువు అయిపోయి, ఉద్యోగాల కోసం చూస్తున్న యువతుల వర్క్‌షాపు వేరుగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్‌కు కంపెనీల వాళ్లు వచ్చినట్లు కొండల్లోకి వచ్చి రిక్రూట్ చేసుకునే వారూ ఉంటారు. అదంతా కూడా కివాసింగ్ ఏర్పాటే. అయితే వాళ్లేమీ పెద్ద పెద్ద అర్హతల కోసం చూడరు. ‘అదుంటే బాగుండేది, ఇదుంటే బాగుండేది’ అనరు. ‘మీరేం చేయగలరు?’ అని అడుగుతారు. కుమావోన్ అమ్మాయిలు తగ్గుతారా! ‘ఏదైనా చేయగలం’ అంటారు. ‘ఇక్కడే ఉండి ఏం చేయగలరు?’ అని వీళ్లు మళ్లీ అడుగుతారు. అప్పుడు అమ్మాయిల ఆలోచన స్వయం ఉపాధి వైపు మళ్లుతుంది. ఆ కొండల్లో తమకు ఏ ముడిసరుకు లభిస్తుందో గమనిస్తారు. సెలక్షన్ వాళ్లు వెళ్లిన మొదట్లో ఒక అమ్మాయి.. ‘ఐపన్ జాపపద కళ మాకు ప్రత్యేకం’ అని చెప్పింది. కుట్లు అల్లికల వంటిది ఐపన్. వాటితో అలంకరిస్తూ బ్యాగుల్ని తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు అని వీళ్లు ఐడియా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఇంకో టీమ్ వచ్చి కుమావోన్ ‘మహిళా పారిశ్రామిక వేత్త’లకు మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్పి వెళ్లింది. ‘ఇక మీద మిమ్మల్ని మీరు ఎప్పుడూ కుమావోన్ అమ్మాయిల్లా చూసుకోకండి. మీ ఉత్పత్తులకు మీరు యజమానుల్లా ఉండండి’ అని కూడా! అమ్మాయిల కాన్ఫిడెన్స్ కళకళలాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరైనా వెళ్లి కుమావోన్లో చూడొచ్చు. ఎవరెస్టునే ఎక్కాలనేముందీ, సొంత కాళ్లపైన కూడా నిలబడొచ్చు. కుమావోన్‌లోని రెండు గ్రామాలకు ఆ శక్తిని ఇచ్చిన కివాసింగ్.. మిగతా గ్రామాలకూ చేరేందుకు టూల్ కిట్‌తో ఇప్పుడు నెట్లో ‘మౌటేన్ విలేజ్ ఫౌండేషన్’ అనే వెబ్ గుడారం వేసుకుని ఉంది. ఐపన్ ఆర్ట్‌తో సంచుల తయారీ : కుమావోన్ యువతులు -
పల్లెకు పోదాం.. చలో
-
పల్లెకు పోదాం.. చలో
ప్రముఖ చిత్రకారిణి నైశిత కాసర్ల గీసిన చిత్రాల ప్రదర్శన ‘పల్లెకు పోదాం’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో 24న(ఈ రోజు) ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి 7గంటలకు మంత్రి ఈటల రాజేందర్ దీనిని ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 31 వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. – సాక్షి, సిటీబ్యూరో -
పచ్చిరంగుల కాన్వాసుల్లో అలుపు తీర్చుకునే మనుషులు
తొలి ప్రదర్శన తెలంగాణతనాన్ని కేవలం మనిషి ఆలంబనగా చిత్రించాలన్నది పి.ఎస్.చారి ప్రయత్నం అనుకొంటాను. అందుకే అతని బొమ్మల్లో లాండ్స్కేప్కు ప్రాధాన్యత తక్కువ. తెలంగాణను పట్టించేందుకు గొడ్లో, మేకలో, కచ్చీరో, జాజురంగు దర్వాజాలో, మట్టిగోడలో, ఇసుర్రాళ్లో... ఇలాంటి సరంజామాను వాడుకోడు. మనుషుల్ని మాత్రమే కాన్వాసులపైకి తీసుకొస్తాడు. తలపాగాలూ, తువ్వాళ్లూ, కడియాలూ, మెళ్లో పూసలూ, అన్నింటికన్నా ముఖ్యంగా కవళికలూ, భంగిమలతోనే తెలంగాణ లాండ్స్కేప్ మొత్తాన్ని ఆవిష్కరిస్తాడు. పనిలో ఉండే, పనికోసం చూసే, పని మధ్యలో సేదతీరే వారు ఈ బొమ్మల్లో ఎక్కువ కనిపిస్తారు. రోజుల్ని శ్రమతో అలంకరించే ఈ మనుషులు మధ్యలో అయాచితంగా దొరికే చిరుఖాళీల్ని మరలా పనికోసం ఎదురుచూస్తూనో, పరస్పర సమక్షాల్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తూనో పూరించుకుంటారు. చారీ బొమ్మల్లో పడుచమ్మాయిలూ అతనికే ప్రత్యేకం. ఆడతనం నుంచి అతను ఏరుకున్న అందమది. ఈ అమ్మాయిలు సోనామసూరి తిని పెరగలేదు, ఒడ్డొరుసుకుంటూ పారే కాలవగట్లపై మేకల్ని తరమలేదు, వారి దేహాలు కొబ్బరాకుల్లోంచి ప్రసరించే వెన్నెల నుంచి నిగారింపు తీసుకోలేదు, శృంగారాన్ని పడగ్గదుల్లో మాత్రమే భద్రంగా దాచుకొనే ప్రపంచాల్లోంచి వచ్చినవారు కాదు. వీరి బలమైన దవడలూ, దొడ్డు పెదాలూ జాణతనానికి దూరం. వీరి యవ్వనం మిగతా జీవితం నుంచి విడివడిన పచ్చటి ద్వీపం కాదు. లచ్చి లచ్చక్కగా మారి లచ్చుమవ్వగా మిగిలే క్రమం అంతా అదే ముఖంలో కనిపిస్తుంది. చారి తన ఇతివృత్తాల నిసర్గ స్వరూపానికి బద్ధుడు. అందుకే అతని బొమ్మల్లో మోడర్నిజం వైపు ఏ మొక్కుబడి హాట్ టిప్పింగులూ లేవు. గీసే క్రమంలో గీతని పోనిస్తూనే అదుపులో ఉంచుకొంటాడు. వేసే క్రమంలో రంగులు చేసే అనూహ్య విన్యాసాల్ని ఉదారంగా ఆహ్వానిస్తాడు. బొమ్మల చేత గొప్ప ఐడియాల్నీ, ఉదాత్తమైన భావాల్నీ పలికించాలనుకోడు. బొమ్మల్ని వాటి సబ్జెక్టును బట్టీ, దాని మేధోపరమైన ఆధిక్యని బట్టీ అంచనా కట్టే వారికి చారీ కాన్వాసులు తెరుచుకోవు. బొమ్మ ముందు ఆగి ఏ పనితనం, ఏ శ్రద్ధ, ఏ అనురక్తి వాటిని నడిపించాయోనని ఆలోచిస్తే... ఏ రంగు లోపల్నించి సన్నగా కనిపిస్తూ దేన్ని బాలన్స్ చేసిందో, టెక్చర్‌లో ఏ మాయ వీపు వెనక ముడుచుకున్న మన చేతుల్ని విప్పదీసి బొమ్మని తడిమేలా చేసిందో, ఇతివృత్తాన్ని ఎంత ప్రేమిస్తే కొన్ని పత్తాలేని పనిగంటల ఫలితంగా ఆ చెవిదుద్దు అలా మెరిసిందో, అలవోకగా సాగిన గీత అక్కడ కనిపించని మరెన్ని గీతల్ని స్ఫురింపజేస్తుందో ఇలా మిడిసిపడుతూ బోలెడు కబుర్లు చెబుతాయి అతని కాన్వాసులు. - మెహెర్ (పి.ఎస్.చారి పెయింటింగ్ షో Undulating Reposes జూన్ 4 నుంచి 16 దాకా ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, బంజారాహిల్స్ రోడ్ నం.12, హైదరాబాద్‌లో జరగనుంది.) -
నౌ అండ్ దెన్
నాటికీ... నేటికీ... రాజకీయ నాయకుల మధ్య ఉన్న అంతరాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా చూపారు పి.రవికుమార్. ప్రింట్ మేకింగ్‌లో స్పెషలైజేషన్ చేసిన రవికుమార్ వర్ణచిత్రాల ఎగ్జిబిషన్ ‘పొలిటీషియన్ అండ్ ద స్టేట్స్‌మన్’ వినూత్నంగా ఉంది. బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో... ఒకప్పటి రాజకీయ నాయకులపై ఉన్న అభిమానం, గౌరవం ఇప్పుడు ఎందుకు లేవన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాలు మలిచారు రవి. దేశ అభివృద్ధిని స్టేట్స్‌మన్ ఆకాంక్షిస్తుంటే... పొలిటీషియన్స్ విధానం మాత్రం మరోలా ఉందనే భావంతో వీటిని గీశారు. ఈ నెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుంది. -
ఆర్ట్ ICON
మదిలో మెదిలే ఆలోచనలు చిత్తరువులుగా మారితే పెయింటింగ్. ఇదో కళ... ఇలాంటివే మరో అరవైమూడు కళలు. ‘సమాజాన్ని ప్రభావితం చేయగలిగి, ఉపయోగపడేదే నిజమైన కళ’ అంటారు అవనిరావ్ గండ్ర. దాన్ని ఆచరణలోనూ పెట్టి చూపుతున్నారు. యువ ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చేందుకు ‘ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ’ ప్రారంభించారు. ఇటీవలే ఆర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ కల్చర్ పాలసీలో ఆర్ట్ థింక్ సౌత్ ఏసియా (ఏటీఎస్ఏ) ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆర్టిస్టుగా రికార్డులకెక్కిన అవని ‘సిటీ ప్లస్’తో తన అనుభవాలు పంచుకున్నారు. నగరంలో ప్రతిభ ఉన్న చిత్రకారులకు కొదవ లేదు. వీరందరికీ రావల్సినంత పేరు ప్రఖ్యాతులు లభించడం లేదు. అందుకు ఆర్థిక పరిస్థితులు, కమ్యూనికేషన్ నైపుణ్యం, ఆర్ట్ మేనేజ్మెంట్ లేకపోవడం వంటివి కారణాలు కావచ్చు. తమ బలంతో పాటు బలహీనతలు కూడా వీరికి తెలియాలి. అప్పుడే ప్రతి బొమ్మా అర్థవంతమవుతుంది. ఆదరణ పొందుతుంది. ప్రోత్సాహం కావాలి.. ప్రముఖ ఆర్టిస్టుల పెయింటింగ్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీరి కళాఖండాలు లక్షల రూపాయల్లో అమ్ముడవుతుంటాయి. అందుకే చాలా గ్యాలరీలు వారి ఆర్ట్‌ల వైపే మొగ్గుచూపుతాయి. వీరితో పాటుగా యువ ఆర్టిస్టుల పెయింటింగ్‌లకు కూడా అన్ని గ్యాలరీలు ప్రాధాన్యమిస్తే... మరెంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తారు. ఆర్ట్‌ను వ్యాపారంలా కాకుండా ఓ కళగా ప్రోత్సహిస్తే మరింత మంది కళాకారులు పుట్టుకొస్తారు. ఈ చిన్ని ప్రయత్నంలో భాగంగానే నాలుగేళ్ల క్రితం ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ పుట్టుకొచ్చింది. ఎక్కువ శాతం యువ ఆర్టిస్టుల ఎగ్జిబిషన్లు చేస్తుంటాం. సిటీతో పాటుగా ముంబై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై... ఇలా వివిధ నగరాలకు చెందిన ఆర్టిస్టుల పెయింటింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత సమస్యలతో పాటు మంచి థీమ్‌పై పెయింటింగ్ చేసిన వారికి గ్యాలరీలో స్పేస్ ఇస్తున్నాం. ఆర్ట్ ప్రేమికుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. చాలా మంది ఆర్టిస్టులను ఒకేచోట చేర్చి వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నాం. పెయింటింగ్ ప్రావీణ్యం పెంచేందుకు మార్గదర్శనం చేస్తున్నాం. ఆనందంగా ఉంది... స్వతహాగా ఆర్టిస్టును. ఆర్టిస్ట్ క్రియేటివిటీ నుంచి మొదలుకొని గ్యాలరీ మ్యూజియం, ఆర్ట్ రెసిడెన్సీ నడిపిస్తున్నా. చాలా మంది ఆర్టిస్టులు ఒకేచోట చేరి పని చేసుకోవడానికి ఉచితంగానే ఈ రెసిడెన్సీ నడుపుతున్నా. యువ ఆర్టిస్టులను వెలుగులోకి తేవాలన్న ధ్యేయమే ఈ రోజు నన్ను లండన్ (మే)లో జరిగే నెల రోజుల ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసింది. నాతో పాటు భారత్ నుంచి నలుగురికి ఈ అవకాశం దక్కింది. ఇది ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇక... హైదరాబాద్‌లో వండర్‌ఫుల్‌గా కళాఖండాలు గీసే ఎనిమిది మంది ఆర్టిస్టులను గుర్తించా. వీరిని అంతర్జాతీయ వేదికగా ప్రమోట్ చేయాలనుకుంటున్నా. నా లండన్ పర్యటనలో ఈ కోరిక నెరవేరుతుందనుకుంటున్నా. వాంకె శ్రీనివాస్ -
ప్రేమకు రూపం
రాధాకృష్ణులు... శివపార్వతుల అనురాగ బంధాన్ని కుంచెతో కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు కళాకారుడు రాజేశ్వర్ న్యాలపల్లి. ఆయున వేసిన పెరుుంటింగ్స్తో బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ఫార్మ్స్ ఆఫ్ లవ్’ చక్కని దృశ్య కావ్యంగా నిలిచింది. వచ్చే నెల4 వరకు ప్రదర్శన ఉంటుంది.