అతడెవరు!
మిస్టరీ
రెండేళ్ల క్రితం... ఇంగ్లండ్‌లో...
‘‘ఇదేంటండీ ఇలా ఉంది’’... భర్త చేతిలో ఉన్న పెయింటింగును చూసి, ముఖం చిరాగ్గా పెట్టి అంది మారియా.
‘‘అలా అనకోయ్. ఇది మా అమ్మమ్మ దగ్గర ఉండేది. చిన్నప్పట్నుంచీ దీన్ని చూస్తూనే ఉన్నాను. చూసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది’’ అన్నాడు షాన్.
‘‘నాకైతే చెత్తగా అనిపిస్తోంది. దీన్ని ఎందుకు తెచ్చినట్టు?’’ అంది విసుగ్గా.
‘‘అమ్మమ్మ చనిపోయింది కదా! ఆ ఇల్లు అద్దెకు ఇచ్చేద్దామని శుభ్రం చేయిం చాను. ఈ పెయింటింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇంటికి తెచ్చాను’’ అంటూ దాన్ని గోడకు తగిలించి, లోనికి వెళ్లిపోయాడు షాన్. మారియా ఆ పెయింటింగ్ వైపు తీక్షణంగా చూసింది. ఎర్రని ఎరుపు రంగు... వికారమైన ముఖం... కళ్లు, నోరు ఉండాల్సిన చోట పెద్ద పెద్ద గుంటలు... వికారంగా ఉంది.‘ఎలా నచ్చిందో ఏమో ఈయనకి’ అనుకుంటూ వెళ్లిపోయింది.
‘‘ఈ టైమ్‌లో ఎక్కడికి?’’... నిద్రలో లేచి వెళ్తోన్న భార్యను అడిగాడు షాన్. ‘‘వంటింట్లో ఏదో గిన్నె పడిన శబ్దం అయ్యింది. చూసి వస్తాను’’ అంది మారియా. వంటింట్లోకి వెళ్లి పరిశీలిం చింది. ఎక్కడివి అక్కడే ఉన్నాయి. తన భ్రమేమో అనుకుంటుండగానే కంగారుగా వచ్చాడు షాన్. ‘‘ఏమైంది?’’ అంటూ.
‘‘ఏం కాలేదు. మీరేంటలా కంగారు పడుతున్నారు?’’ అందామె అతడి చేయి పట్టుకుని. ‘‘ఏం లేకుండా ఎందుకలా కేక పెట్టావ్?’’ అన్నాడు షాన్.
‘‘నేను కేక పెట్టడమేంటి?’’ అంది అయోమయంగా.
విస్తుపోయాడు షాన్. మారియా కేక పెట్టింది. వచ్చి అడిగితే లేదంటోంది. ఏమిటిదంతా? అసలేం జరిగిందో తెలియక కంగారుపడ్డాడు షాన్. ఆ రోజు నుంచి ప్రతిరోజూ అతని పరిస్థితి అదే. దానిక్కారణం... అతడు తెచ్చిన ‘ద యాంగ్విష్డ్ మ్యాన్’ చిత్రం!
రోజూ రాత్రి ఇంట్లో ఏదో ఒక శబ్దం. గిన్నెలు కింద పడినట్టు, గోడమీద ఎవరో సుత్తితో కొడుతున్నట్టు! ఒక్కోసారి ఎవరో తలుపు కొట్టేవారు.
తీస్తే ఎవరూ ఉండే వారు కాదు. మరికొన్నిసార్లు ఇల్లంతా పొగ వ్యాపించేది. ఉష్ణోగ్రత కూడా సడెన్‌గా పెరిగిపోయేది. లేదంటే తగ్గి పోయేది. ఇవన్నీ చూసి హడలిపోయింది షాన్ భార్య. ఆ పెయింటింగ్ తెచ్చినప్ప ట్నుంచే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరో పించింది. షాన్‌కూ అదే నిజమనిపిం చింది. ఎందుకంటే... అతనికి ఆ పెయింటింగ్ గురించి ముందే తెలుసు.
షాన్ అమ్మమ్మకు ఎవరో బహు మతిగా ఇచ్చారు ఆ చిత్రాన్ని. కొన్నాళ్లు ఆమె దాన్ని హాల్లోనే పెట్టింది. తర్వాత స్టోర్ రూమ్‌లో పడేసింది. తనకివ్వమని షాన్ అడిగితే వద్దంది. ఆ పెయింటింగ్ వచ్చాక ఇంట్లో ఏవేవో వింత శబ్దాలు వస్తున్నాయని, ఎవరివో అరుపులు, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని చెప్పింది. చాలాసార్లు ఏదో నల్లని నీడ ఇంట్లో తిరుగుతూ కూడా కనిపించిందని అంది. అవన్నీ పడలేకే దాన్ని స్టోర్ రూమ్‌లో పడేసినట్టు చెప్పింది.
షాన్‌కు ఇలాంటివాటి మీద నమ్మకం లేదు. కానీ ఆమె మాట కాదనలేక మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ చని పోయిన తర్వాతే ఆ పెయింటింగ్‌ను ఇంటికి తెచ్చుకున్నాడు. తీరా తెచ్చు కున్నాక అమ్మమ్మ చెప్పినవన్నీ తమ ఇంట్లో జరగడం మొదలయ్యింది. దాంతో ఆ పెయింటింగ్‌ని ఓ మారుమూల గదిలో పెట్టేశాడు. అసలేం జరుగుతోందో తెలుసు కోవాలని ఓ వీడియో కెమెరాను ఫిక్స్ చేశాడు. నాలుగు రోజుల తర్వాత రికార్డింగును చూసి అవాక్కయ్యాడు.
రోజూ రాత్రి పన్నెండు తర్వాత ఆ గది తలుపులు వాటంతటవే మూసు కుంటున్నాయి, తెరచుకుంటున్నాయి. పొగలాంటిదేదో గదంతా వ్యాపిస్తోంది. పెయింటింగ్‌లో కళ్లు కదులుతున్నట్టు, నోరు మెదలుతున్నట్టు... ఏవో మార్పులు. ఏదో నీడ ఆ గదిలో తచ్చాడుతోంది. దాంతో ఆ చిత్రంలో ఏదో తేడా ఉందని అర్థమైపోయింది షాన్‌కి. దాన్ని ఆ గది లోనే ఉంచి తాళాలు వేసేశాడు. ఆ చిత్రం చుట్టూ తిరుగుతోంది చిత్రకారుడి ఆత్మే అయివుంటుందనిపించింది. కానీ అతడు ఎవరో షాన్‌కు తెలీదు. తెలుసుకుందామని ప్రయత్నించినా ఫలితం లేదు. దాంతో ఇంత అల్లకల్లోలం సృష్టిస్తోన్న అతడెవరో ఇప్పటికీ తెలియలేదు.
ఇదే ఆ పెయింటింగ్
నిజానికి ‘ద యాంగ్విష్డ్ మ్యాన్’ చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్ ఎవరో షాన్ అమ్మమ్మకి కూడా తెలియదు. ఎంతోమందిని అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని షాన్ అమ్మమ్మ అంటూ ఉండేది. ఆ చిత్రాన్ని అతను చనిపోయేముందు గీశాడని, తన రక్తాన్ని పెయింట్‌లో కలిపి వేశాడని, అందుకే అతడి ఆత్మ ఆ చిత్రంలో ఉందని ఆమె తనతో చెబుతూ ఉండేదని షాన్ అంటున్నాడు. అది నిజమై ఉంటుందా? ఏమో మరి!