ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి.
భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది.
‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది.
‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment