
కళ తప్పాయి
నగరానికి కొత్త అందాలు తెచ్చిన
కుడ్యచిత్రాలపై నిర్లక్ష్యపు నీడలు
కుడ్య చిత్రాల అందాలను దెబ్బతీస్తున్న పోస్టర్లు
రాష్ట్ర సంస్కృతిని, సంప్రదాయాలను సమున్నతంగా చూపాయి ఆ కుడ్య చిత్రాలు. నగరానికి వచ్చే పరదేశీయులకు మైసూరు రాచరికపు హంగులను, హంపిలోని శిల్ప సౌందర్యాన్ని, జోగ్ జలపాతపు సందడిని కళ్లకు కట్టాయి. అంతేకాదు రాష్ట్రానికి వన్నె తెచ్చిన అనేక మంది కవులు, పోరాట యోధులు మరెంతో మంది కళాకారులను నేటి తరానికి పరిచయం చేశాయి. అయితే ఇదంతా గతం... నగరానికి కొత్త అందాలను తెచ్చిపెట్టిన కుడ్యచిత్రాలు ఇప్పుడు ‘కళ’తప్పుతున్నాయి. రాష్ట్ర ఘనచరితను సగర్వంగా చాటి చెప్పిన కుడ్యచిత్రాలు ప్రస్తుతం నిర్లక్ష్యపు నీడలో మసకబారిపోతున్నాయి. బీబీఎంపీ నిర్వహణ కొరవడడంతో పెచ్చులూడడంతో పాటు పార్టీలు, సినిమాల పోస్టర్ల వెనక్కి చేరిపోతున్నాయి.
-బెంగళూరు
రాష్ట్ర చరిత్రను చాటి చెప్పే ఉద్దేశంతో
రాష్ట్ర చరిత్రను, ఇక ్కడి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు చాటి చెప్పే ఉద్దేశంతో 2009లో బృహత్ బెంగళూరు మహా పాలికె (బీబీ ఎంపీ) నగరంలోని ప్రముఖ కూడళ్లలోని గోడలపై కుడ్య చిత్రాలను గీసే కార్యక్రమానికి నాంది పలి కింది. కేవలం ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజెప్పడమే కాక స్థానిక కళాకారులకు సైతం ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనుకున్నదే తడువుగా నగరంలోని ప్రముఖ కూడళ్లలో ఉన్న గోడలన్నింటిపై అందమైన కుడ్యచిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. మైసూరు రాజప్రాసాదాలు, బన్నేరుఘట్ట ప్రాంతంలోని వన్యప్రాణి సంపద, పట్టడక్కల్‌లోని కాశీ విశ్వనాథుని దే వాలయాలు, బాదామీలోని శిల్పసంపద ఇలా అనేక గొప్ప ప్రాంతాలను కళాకారులు ఈ కుడ్యచిత్రాల్లో సాక్షాత్కరింపచేశారు. కేవలం ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు, వ్యక్తులు, ప్రాంతాలే కాక ‘పర్యావరణ పరిరక్షణ’,‘వాననీటి సంరక్షణ’ తదితర అంశాలకు చెంది న సందేశాలు కూడా గోడలపై కనిపించేవి.
కొరవడిన నిర్వహణ
నగరానికి కొత్త అందాలను తెచ్చిపెట్టిన కుడ్యచిత్రాలు బీబీఎంపీ నిర్వహణా లోపం కారణంగా తమ కళను కోల్పోతున్నాయి. ఒక మంచి లక్ష్యంతో గోడలపైకు డ్యచిత్రాలను గీయడానికి శ్రీకారం చుట్టిన బీబీఎంపీ నెమ్మదిగా వాటి నిర్వహణా విషయాన్ని పక్కకు నెట్టేసింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లోని గోడలపై ఉన్న అద్భుత కుడ్యచిత్రాలపై వివిధ పార్టీలు, సంఘాలు, సినిమాల పోస్టర్లు వెలుస్తున్నాయి. మరికొన్నైతే ఏళ్లకేళ్లు నిర్వహణే లేకపోవడంతో పెచ్చులూడిపోతున్నాయి. ఇక నగర ప్రజల్లో కొరవడిన అవగాహనతో కొన్ని గోడలు మూత్రవిసర్జన శాలలుగా మారుతుంటే, మరికొన్ని చెత్తకుప్పలుగా మారుతున్నాయి. దీంతో ఈ కుడ్యచిత్రాల వైపు చూడడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలా నగరంలోని ప్రముఖ కూడళ్లలోని గోడలపై ఉన్న కుడ్యచిత్రాలన్నీ కూడా ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.