భయమొద్దు.. బ్రెడ్డే!
చూడ్డానికి భయానకంగా కనిపిస్తోంది కదూ.. మానవ శరీర భాగాలను ఖండఖండాలు చేస్తున్నట్లుగా.. భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది బ్రెడ్ మాత్రమే. ఎంచక్కా జామ్‌తో నంజుకు తినేయొచ్చు. థాయ్‌లాండ్‌కు చెందిన కిట్టివత్ ఉనారమ్ అనే కళాకారుడి ‘ప్రతిభ’కు నిదర్శనమీ చిత్రం.
పెయింటింగ్, శిల్పాలు చెక్కడం ఇలా చాలా ప్రయత్నాలు చేసిన కిట్టివత్ ఏదైనా కొత్తగా చేయాలని తలంచాడు. చివరికి తమ కుటుంబానికి చెందిన బేకరీ వ్యాపారాన్ని చేపట్టిన తర్వాత అందులో తనకు కావాల్సిన ప్రయోగాలన్నీ చేశాడు. ఇందుకోసం ఫోరెన్సిక్ లాబొరేటరీలను సందర్శించాడు. మానవ శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు.
తర్వాత వీటిని రూపొందించాడు. ఇవి చూడ్డానికి నిజమైన విలా కనిపిస్తుండటంతో ఇతడి కళకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో కిట్టివత్ ‘బాడీ బేకరీ’ ఓ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఈ చిత్రవిచిత్రమైన బ్రెడ్‌ను తిందామని థాయ్‌లాండ్ వెళ్లేరు. ఎందుకంటే.. కిట్టివత్ వీటిని అమ్మడం లేదు. ప్రస్తుతానికివి ప్రదర్శనకు మాత్రమేనట.