గోటితో చిత్రం గీస్తున్న రాజమౌళి,అవార్డు పొందిన భారతమాత చిత్రం
సాక్షి, నంగునూరు(సిద్దిపేట) : సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పల్లె కళాకారుడు. గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలను ఆవిష్కరిస్తున్నాడు బస్వరాజ్ రాజమౌళి. పోస్ట్ కార్డులపై భారీ భరతమాత చిత్రాన్ని గీయడంతో లిమ్కా బుక్‌ఆఫ్ రికార్డుతో పాటు ఇండియన్ వరల్ట్ రికార్డు సొంతమైంది. నంగునూరు మండలం పాలమాకులకు చెందిన రాజమౌళి చిన్నప్పటి నుంచి గోర్లతో చిత్రాలు వేయడం అలవాటుగా మారింది. పోస్టు కార్డును కాన్వాస్‌గా, గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలు గీస్తున్నాడు. కళ్ల ముందు కదలాడిన చిత్రాన్ని అట్టపై చేతి గోటితో ఏకాగ్రతతో గీసి మిగతా ప్రాంతాన్ని తొలగిస్తాడు. కార్డుపై కార్బన్ పేపర్‌తో రుద్దడంతో చిత్రం స్పష్టమవుతుంది. ఉపాధి కోసం మెకానిక్‌గా పనులు చేస్తూనే ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తాడు.
అద్భుత చిత్రంతో రికార్డులు సొంతం..
బసవరాజ్ గోటితో తెలంగాణ తల్లి చిత్రాన్ని గీశాడు. దీనికి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్‌రావు మన్ననలు పొందాడు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్ఫూర్తితో వరల్ట్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో పదివేల పోస్టుకార్డులతో 34 ఫీట్ల పొడవు, 16 ఫీట్ల వెడల్పుతో భరతమాత చిత్రాన్ని 45 రోజుల పాటు శ్రమించి అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. దీంతో 2012 ఆగస్టు 15న ఇండియన్ వరల్డ్ రికార్డుగా గుర్తించడంతో అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు తోపాటు అధికారులు ధ్రువపత్రాన్ని అందజేశారు.
అలాగే రాజమౌళి గీసిన చిత్రాన్ని ప్రగతి భవన్‌లో ప్రదర్శించడంతో లిమ్కా రికార్డు అధికారులు గుర్తించారు. దీంతో 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లిమ్కా అవార్డు అందుకున్నాడు. విజయనగరంకు చెందిన నఖ చిత్రకారుడు సత్యనారాయణ గీసిన చిత్రం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి వెక్కిన విషయాన్ని గ్రహించి అంతకన్నా భారీగా భరతమాత చిత్రాన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి రూపొందిచడంతో అవార్డు సొంతమైందని చెబుతున్నాడు రాజమౌళి. తనకు తగిన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని నఖ చిత్రాలను గీస్తానని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment