nanganuru
-
గోరునే కుంచెగా మలిచి..
సాక్షి, నంగునూరు(సిద్దిపేట) : సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు పల్లె కళాకారుడు. గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలను ఆవిష్కరిస్తున్నాడు బస్వరాజ్ రాజమౌళి. పోస్ట్ కార్డులపై భారీ భరతమాత చిత్రాన్ని గీయడంతో లిమ్కా బుక్ఆఫ్ రికార్డుతో పాటు ఇండియన్ వరల్ట్ రికార్డు సొంతమైంది. నంగునూరు మండలం పాలమాకులకు చెందిన రాజమౌళి చిన్నప్పటి నుంచి గోర్లతో చిత్రాలు వేయడం అలవాటుగా మారింది. పోస్టు కార్డును కాన్వాస్‌గా, గోరును కుంచెగా మలిచి అద్భుత చిత్రాలు గీస్తున్నాడు. కళ్ల ముందు కదలాడిన చిత్రాన్ని అట్టపై చేతి గోటితో ఏకాగ్రతతో గీసి మిగతా ప్రాంతాన్ని తొలగిస్తాడు. కార్డుపై కార్బన్ పేపర్‌తో రుద్దడంతో చిత్రం స్పష్టమవుతుంది. ఉపాధి కోసం మెకానిక్‌గా పనులు చేస్తూనే ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తాడు. అద్భుత చిత్రంతో రికార్డులు సొంతం.. బసవరాజ్ గోటితో తెలంగాణ తల్లి చిత్రాన్ని గీశాడు. దీనికి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్‌రావు మన్ననలు పొందాడు. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇచ్చిన స్ఫూర్తితో వరల్ట్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో పదివేల పోస్టుకార్డులతో 34 ఫీట్ల పొడవు, 16 ఫీట్ల వెడల్పుతో భరతమాత చిత్రాన్ని 45 రోజుల పాటు శ్రమించి అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. దీంతో 2012 ఆగస్టు 15న ఇండియన్ వరల్డ్ రికార్డుగా గుర్తించడంతో అప్పటి ఎమ్మెల్యే హరీశ్‌రావు తోపాటు అధికారులు ధ్రువపత్రాన్ని అందజేశారు. అలాగే రాజమౌళి గీసిన చిత్రాన్ని ప్రగతి భవన్లో ప్రదర్శించడంతో లిమ్కా రికార్డు అధికారులు గుర్తించారు. దీంతో 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లిమ్కా అవార్డు అందుకున్నాడు. విజయనగరంకు చెందిన నఖ చిత్రకారుడు సత్యనారాయణ గీసిన చిత్రం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి వెక్కిన విషయాన్ని గ్రహించి అంతకన్నా భారీగా భరతమాత చిత్రాన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి రూపొందిచడంతో అవార్డు సొంతమైందని చెబుతున్నాడు రాజమౌళి. తనకు తగిన ప్రోత్సాహం లభిస్తే మరిన్ని నఖ చిత్రాలను గీస్తానని చెబుతున్నారు. -
పునాదుల్లోనే ‘ఆదర్శ’ పాఠశాలలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నంగునూరు మండలం అక్కెనపల్లికి తొలి విడతలో ఆదర్శ పాఠశాల మంజూరైంది. భవన నిర్మాణం పూర్తి కాకమునుపే తరగతులు ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో పాలమాకుల ప్రభుత్వ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు తాత్కాలికంగా తరగతులు నిర్వహించారు. అక్కడా సరైన వసతులు లేకపోవడంతో పక్షం రోజుల క్రితం గట్లమల్యాల ప్రాథమిక పాఠశాల ఆవరణకు విద్యార్థులను తరలించారు. అక్కెనపల్లిలో జరుగుతున్న ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పునాదుల్లోనే ఉండటంతో మరో ఏడాదైనా సొంత గూడు సమకూరే పరిస్థితి లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో పిల్లలను చేర్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో జిల్లాకు మంజూరైన 24 ఆదర్శ పాఠశాలల్లోనూ ఇంచుమించు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఒక్కో ఆదర్శ పాఠశాల నిర్మాణానికి రూ.3.02 కోట్లు చొప్పున 24 ఆదర్శ పాఠశాలలకు రూ.72.48 కోట్లు మంజూరయ్యాయి. 24 భవనాల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించిన అధికారులు, గత ఏడాది జనవరి 19న కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌళిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టు సంస్థలు అంచనా విలువకు 0.07 శాతం తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి. రామాయంపేట మోడల్ స్కూల్ పనులు మాత్రం అంచనా విలువకు 8.19శాతం తక్కువ కోట్ చేయగా పనులు కేటాయించారు. పనులు దక్కించుకున్న సంస్థలు 16 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ కాంట్రాక్టర్లు గత ఏడాది ఫిబ్రవరి మొదలుకుని మే వరకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెళ్లారు. ఒప్పందం తేదీని పరిగణనలోనికి తీసుకున్నా 21 భవనాలకు సంబంధించి ఇప్పటికే నిర్దేశిత కాల పరిమితి ముగిసింది. నిబంధనల మేరకు నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థలకు తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అపరాధ రుసుము కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇతరులకు సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనులు అప్పగించారు. అక్సాన్‌పల్లి (అందోలు), టేక్మాల్, గుండ్లమాచునూరు (హత్నూర), తిరుమలాపూర్ (చిన్నశంకరంపేట), మోర్గి (మనూరు), అక్కెనపల్లి (నంగునూరు) పాఠశాలల భవనాల నిర్మాణ పనులు ఇంకా పునాదుల్లోనే ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మిగతా చోట్ల గోడలు, స్లాబ్‌ల స్థాయిలోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇసుక కొరత వల్లేనట! ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడానికి ఇసుక కొరతే ప్రధాన కారణమని ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు చెప్తున్నారు. ‘‘ఇసుక క్వారీయింగ్‌పై జిల్లాలో ఆరు నెలలుగా నిషేధం ఉంది. కొంతకాలం సడలించినా మళ్లీ నెల రోజులుగా క్వారీయింగ్ జరగడం లేదు. రెవెన్యూ విభాగంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా ఇసుక కేటాయించడం లేదు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను కేటాయించినా అందులో నాణ్యత ఉండటం లేదు’’ అంటూ అధికారులే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే కదా అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఓ వైపు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా, మరోవైపు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారులు భారీగానే చూపుతున్నారు. ఇప్పటికే రూ.34.01 కోట్లు వ్యయం చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే సహేతుక కారణాలు లేకుండా నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. -
ఎంపీ నిధులిచ్చా.. అభివృద్ధి చేయలేదా?
నంగునూరు, న్యూస్‌లైన్: ‘అభివృద్ధి పనుల గురించి మీ ఎమ్మెల్యేకు ఎంపీ ఫండ్ నుంచి డబ్బులిచ్చా.. మీ ఊరిని అభివృద్ధి చేయలేదా?.. మీ దొర సిద్దిపేట నియోజకవర్గంలో అద్భుతాలు చేశానని గొప్పలు చెబుతున్నారే మరి’ అంటూ హరీష్‌రావుపై మెదక్ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం మండలంలోని ఖానాపూర్, నంగునూరులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. రెండు గ్రామాల్లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ ‘తెలంగాణ’ను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను సిద్దిపేటలో ఎగురవేయాలన్నారు. అభివృద్ధి చేసిన వారిని తిరిగి గెలిపించాలని, ఇంతకు మీ ఊరిలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ‘మా ఊరిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు సమాధానం ఇచ్చారు. ‘నేనే కదయ్యా మీ ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేస్తానంటే ఎంపీ నిధులిచ్చాను. ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, ఏమీ చేయలేదా’ అని ప్రశ్నించారు. ‘అలాంటి ఎమ్మెల్యేను వరుసగా ఎలా గెలిపిస్తున్నారు ఈసారి బుద్ధి చెప్పండి’ అంటూ విజయశాంతి ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి వంద కోట్లు నిధులు అడిగానని అవి రాగానే ఈ ప్రాంతానికే ఖర్చు చేస్తామన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ.. వచ్చే శీతాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి నంగునూరులో బీసీ, శాలివాహణ భవనం, ఎస్సీ,బీసీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, ఖానాపూర్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నంగునూరు, ఖానాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వానరాశి నర్సయ్య, హన్మంతు, రాజు, సతీష్రెడితో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గంప మహేందర్‌రావు, నాయకులు సాకి ఆనంద్, సికిందర్, పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, సర్పంచ్ మరియమ్మ పాల్గొన్నారు.