ఎంపీ నిధులిచ్చా.. అభివృద్ధి చేయలేదా? | I released MP funds...but Your village is not developed | Sakshi
Sakshi News home page

ఎంపీ నిధులిచ్చా.. అభివృద్ధి చేయలేదా?

Published Fri, Nov 8 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

I released MP funds...but Your village is not developed

నంగునూరు, న్యూస్‌లైన్:  ‘అభివృద్ధి పనుల గురించి మీ ఎమ్మెల్యేకు ఎంపీ ఫండ్ నుంచి డబ్బులిచ్చా.. మీ ఊరిని అభివృద్ధి చేయలేదా?.. మీ దొర సిద్దిపేట నియోజకవర్గంలో అద్భుతాలు చేశానని గొప్పలు చెబుతున్నారే మరి’ అంటూ హరీష్‌రావుపై మెదక్ ఎంపీ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం మండలంలోని ఖానాపూర్, నంగునూరులో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. రెండు గ్రామాల్లో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ  ‘తెలంగాణ’ను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను సిద్దిపేటలో ఎగురవేయాలన్నారు.

అభివృద్ధి  చేసిన వారిని తిరిగి గెలిపించాలని, ఇంతకు మీ ఊరిలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ‘మా ఊరిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు సమాధానం ఇచ్చారు. ‘నేనే కదయ్యా మీ ఎమ్మెల్యేకు అభివృద్ధి పనులు చేస్తానంటే ఎంపీ నిధులిచ్చాను. ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు, ఏమీ చేయలేదా’ అని ప్రశ్నించారు. ‘అలాంటి ఎమ్మెల్యేను వరుసగా ఎలా గెలిపిస్తున్నారు ఈసారి బుద్ధి చెప్పండి’ అంటూ  విజయశాంతి ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణతో పాటు అభివృద్ధి ముఖ్యమని అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి వంద కోట్లు నిధులు అడిగానని అవి రాగానే ఈ ప్రాంతానికే ఖర్చు చేస్తామన్నారు.
 శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
 ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ.. వచ్చే శీతాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి నంగునూరులో బీసీ, శాలివాహణ భవనం, ఎస్సీ,బీసీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు, ఖానాపూర్‌లో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నంగునూరు, ఖానాపూర్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వానరాశి నర్సయ్య, హన్మంతు, రాజు, సతీష్‌రెడితో పాటు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు గంప మహేందర్‌రావు, నాయకులు సాకి ఆనంద్, సికిందర్,  పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, సర్పంచ్ మరియమ్మ  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement