సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అసంతృప్త నేతలు త్వరలోనే ఆ పార్టీ వీడాలనే తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అక్టోబర్ 1న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. అంతకుముందే పార్టీకి రాజీనామా చేయాలన్న విషయంలో అసంతృప్త నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణలు, పార్టీ పరిస్థితి, జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నాక, ఇక పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవనే అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే ఎవరెవరు ఏ పార్టీలోకి వెళతారో అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కొందరు బీఆర్‌ఎస్ వైపు.. మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
బీఆర్‌ఎస్–బీజేపీ లోపాయికారి దోస్తీపై..
బీఆర్‌ఎస్–బీజేపీల మధ్య లోపాయికారి దోస్తీపై ప్రజల్లోనే అనుమానాలున్నాయని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై విచారణ కమిటీ, కేసీఆర్ సర్కార్‌పై వచ్చిన ఇతర అవినీతి, అక్రమాల అరోపణలపై తగిన చర్యలపై ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా స్పష్టత ఇవ్వకపోవడంపై వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివిధ కీలక అంశాలు లేవనెత్తినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
కేసీఆర్‌ను ఎలాగైనా గద్దెదించాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరామని, ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వం చర్యలు కనిపించడం లేదంటూ ఓ మాజీ ఎంపీ ‘సాక్షి’కి స్పష్టం చేశారు. అసంతృప్త నేతల అభిప్రాయాలు, తమ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు, మొత్తంగా ఈ వ్యవహారంలో తమ దృష్టికోణం ఏమిటీ, అసలు ఏం చేయాలని అనుకుంటున్నామన్న దానిపై ఆయన పలు సంకేతాలిచ్చారు.
వెంటనే కవిత అరెస్ట్‌తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్, కేసీఆర్ సర్కార్ ఇతర అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి బీఆర్‌ఎస్–బీజేపీ ఒకటి కాదనే భరోసా ప్రజలు, కేడర్‌కు కల్పించాలనే తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.
అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడంతో ఇక పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కేసీఆర్‌ను ఓడించే సత్తా ఉందని భావిస్తున్న పార్టీలోకి వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని తెలిపారు. పైకి కనిపిస్తున్నట్టుగా ఆరేడుగురు నేతలే కాకుండా మరికొంతమంది నాయకులు కూడా వీరితో టచ్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
భేటీలే..భేటీలు
మంగళవారం విజయశాంతి నివాసంలో జరిగిన సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు హాజరైనట్టు సమాచారం. నవంబర్ 20వ తేదీ దాకా ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎలాంటి సమన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన రోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గడిచిన వారంరోజుల్లోనే మూడునాలుగు పర్యాయాలు సమావేశమైన వీరు తాజాగా మరోసారి భేటీ కావడంపై కూడా చర్చ జరుగుతోంది. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపైనా ఈ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈటలకు ఇచ్చిన గుర్తింపు, ప్రాధాన్యం తమకెందుకు ఇవ్వడం లేదని, అందుకే బీజేపీలో కొనసాగాలా లేక కాంగ్రెస్‌లో చేరాలా అన్న అంశాలపై తమ శ్రేయోభిలాషులు, కార్యకర్తలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment