సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన విజయశాంతి మాటలు ఏమంటున్నాయంటే...?
ట్విట్టర్ వేదికగా విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌లో బీఆర్‌ఎస్‌పై పోటీ విషయంలో బీజేపీ ఎన్నడూ వెనక్కు తగ్గదని కార్యకర్తలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటంలో భాగంగా తాను కామారెడ్డి నియోజకవర్గం నుంచి, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కార్యకర్తలు అడగడం తప్పు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేనప్పటికీ పార్టీ నిర్దేశిస్తే చేస్తానని పరోక్షంగా తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023
అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు.
అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX
రేపే అభ్యర్థుల ప్రకటన!
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం ఢిల్లీలో ప్రకటించే అవకాశముంది. ఢిల్లీలో బుధవారం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. జాబితా బుధవారం రాత్రే ప్రకటించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని పార్టీ నేతలు చెబుతున్నారు. జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఇలా అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60–70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు ఓ అంచనాకు రాగా ఏకాభిప్రాయం కుదిరని సింగిల్ క్యాండిడేట్ నియోజకవర్గాలు కొన్నింటిని రెండు లేదా మూడో జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలి జాబితాలో 35–40 మంది అభ్యర్థులు ఉండొచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద ఇతర పార్టీల కంటే కూడా బీసీలు (దాదాపు 40 సీట్లు), మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది.
మేనిఫెస్టోకు ఓపిక పట్టండి
తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత కొరవడటంతో స్థానిక కాషాయ నేతలు దిగాలు చెందుతున్నారు. ఆయా అంశాలను కొందరు ముఖ్య నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలో చివర్లో ఎన్నికలు జరగనుండటంతో ఎందుకు తొందర పడుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో మేనిఫెస్టో ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment