సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
నంగునూరు మండలం అక్కెనపల్లికి తొలి విడతలో ఆదర్శ పాఠశాల మంజూరైంది. భవన నిర్మాణం పూర్తి కాకమునుపే తరగతులు ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో పాలమాకుల ప్రభుత్వ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు తాత్కాలికంగా తరగతులు నిర్వహించారు. అక్కడా సరైన వసతులు లేకపోవడంతో పక్షం రోజుల క్రితం గట్లమల్యాల ప్రాథమిక పాఠశాల ఆవరణకు విద్యార్థులను తరలించారు. అక్కెనపల్లిలో జరుగుతున్న ఆదర్శ పాఠశాల భవన నిర్మాణ పనులు పునాదుల్లోనే ఉండటంతో మరో ఏడాదైనా సొంత గూడు సమకూరే పరిస్థితి లేదు. దీంతో ఆదర్శ పాఠశాలల్లో పిల్లలను చేర్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తొలి విడతలో జిల్లాకు మంజూరైన 24 ఆదర్శ పాఠశాలల్లోనూ ఇంచుమించు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ఒక్కో ఆదర్శ పాఠశాల నిర్మాణానికి రూ.3.02 కోట్లు చొప్పున 24 ఆదర్శ పాఠశాలలకు రూ.72.48 కోట్లు మంజూరయ్యాయి. 24 భవనాల నిర్మాణ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించిన అధికారులు, గత ఏడాది జనవరి 19న కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌళిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టు సంస్థలు అంచనా విలువకు 0.07 శాతం తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి. రామాయంపేట మోడల్ స్కూల్ పనులు మాత్రం అంచనా విలువకు 8.19శాతం తక్కువ కోట్ చేయగా పనులు కేటాయించారు. పనులు దక్కించుకున్న సంస్థలు 16 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ కాంట్రాక్టర్లు గత ఏడాది ఫిబ్రవరి మొదలుకుని మే వరకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వెళ్లారు. ఒప్పందం తేదీని పరిగణనలోనికి తీసుకున్నా 21 భవనాలకు సంబంధించి ఇప్పటికే నిర్దేశిత కాల పరిమితి ముగిసింది. నిబంధనల మేరకు నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థలకు తొలుత నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అపరాధ రుసుము కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. చాలా చోట్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇతరులకు సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనులు అప్పగించారు. అక్సాన్‌పల్లి (అందోలు), టేక్మాల్, గుండ్లమాచునూరు (హత్నూర), తిరుమలాపూర్ (చిన్నశంకరంపేట), మోర్గి (మనూరు), అక్కెనపల్లి (నంగునూరు) పాఠశాలల భవనాల నిర్మాణ పనులు ఇంకా పునాదుల్లోనే ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మిగతా చోట్ల గోడలు, స్లాబ్‌ల స్థాయిలోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఇసుక కొరత వల్లేనట!
ఆదర్శ పాఠశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కాకపోవడానికి ఇసుక కొరతే ప్రధాన కారణమని ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు చెప్తున్నారు. ‘‘ఇసుక క్వారీయింగ్‌పై జిల్లాలో ఆరు నెలలుగా నిషేధం ఉంది. కొంతకాలం సడలించినా మళ్లీ నెల రోజులుగా క్వారీయింగ్ జరగడం లేదు. రెవెన్యూ విభాగంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా ఇసుక కేటాయించడం లేదు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ఇసుకను కేటాయించినా అందులో నాణ్యత ఉండటం లేదు’’ అంటూ అధికారులే సమస్యలు ఏకరువు పెడుతున్నారు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే కదా అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఓ వైపు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా, మరోవైపు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారులు భారీగానే చూపుతున్నారు. ఇప్పటికే రూ.34.01 కోట్లు వ్యయం చేసినట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే సహేతుక కారణాలు లేకుండా నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లకు త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు.
పునాదుల్లోనే ‘ఆదర్శ’ పాఠశాలలు
Published Wed, Nov 20 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement