బొమ్మ కూచి | Interview with painter saisankar | Sakshi
Sakshi News home page

బొమ్మ కూచి

Published Wed, Aug 22 2018 12:13 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

Interview with painter saisankar - Sakshi

రేఖలలో మనోధర్మం. లేఖనంలో కీర్తనల సారం. విద్వాంసుల అంతర్ముఖం. ముఖచిత్ర ప్రబంధనం. గాత్రచిత్రాల ఖండాతరయానం. ఇదీ కూచి సాయిశంకర్‌ పరిచయం! చిత్రకళావధానం చేయడానికి సన్నద్ధులవుతున్న సందర్భంగా ఈ గాత్రచిత్రకళామతల్లి ‘కూచి’తో ఇది సాక్షి సంభాషణం.

‘‘నా ఐదో ఏట నాన్న ఒడిలో కూర్చుని వేసిన వంకాయ బొమ్మ నన్ను చిత్రకారుడిని చేసింది’’ అంటున్న ‘కూచి’ స్వస్థలం అమలాపురం. తండ్రి.. కూచి వీరభద్ర శర్మ హరికథలలో కనకాభిషేకం చేయించుకున్న కళాకారుడు! ‘‘కాలేజీ తరఫున చిత్రలేఖనం పోటీలకు వెళ్లి బహుమతులు అందుకున్నాను. కళ వైపు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించమని,  సాహిత్యం బాగా చదవమని అన్నయ్యలు ప్రోత్సహించి, నాతో పుస్తకాలు చదివించారు. తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’  నా బొమ్మలకు భగవద్గీత లాంటిది. పెయింటర్‌గా అది నాకు ప్రేరణ’’ అంటారు కూచి. ‘‘బాపు గారి గీత, వడ్డాది పాపయ్య కలరింగ్‌ నాకు ఇష్టం. వీరిద్దరినీ కలిపితే కూచి’’ అంటున్న కూచి... వడ్డాది పాపయ్యకు ఏకలవ్య శిష్యుడు. లైన్‌ డ్రాయింగ్‌ నేరుగా బాపు దగ్గర నేర్చుకున్నారు. ఇప్పటివారిలో కవి భావాన్ని చిత్రీకరిస్తున్న ఏకైక ఆర్టిస్ట్‌.

అన్నయ్యల తర్వాత నన్నయ్య
అన్నయ్యల ప్రోద్బలంతో.. కాకి, కూజా, అరటిచెట్టు, కుండ.. వీటిని దాటి ఇంకా తెలుసుకోడానికి, ఇంకా నేర్చుకోడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్‌ ఆర్ట్స్‌ చేశారు కూచి. నన్నయ్య సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇంట్లోని పూజా పీఠాన్ని స్టాండుగా అమర్చుకుని నన్నయ్య పెయింటింగ్‌ వేశారు. అది ఆయనకు మంచి పేరు తెచ్చింది. ‘‘చిత్రకళ అంటే సర్వకళల సమాహారం’’ అంటున్న కూచి, సంగీతంలో సప్తస్వరాలు ఉంటే, చిత్ర లేఖనంలో ఏడు గీతలు ఉంటాయంటారు.

బీచ్‌లో ‘బతుకు’ చిత్రాలు
సాయంత్రం ఐదు గంటలకు క్లాసు అయిపోగానే, ఎనిమిదిన్నర వరకు బీచ్‌ దగ్గర కూర్చుని 200 పేజీల పుస్తకాన్ని లైవ్‌ స్కెచెస్‌ నింపేసేవారు కూచి. బుట్టలు అల్లేవారు, గుడికి వచ్చేవారు, బీచ్‌లో ఉన్నవారు... ఇలా అందరినీ పరిశీలిస్తూ రోజుకి కనీసం నాలుగైదు వందల స్కెచెస్‌ వేసిన కూచి, ‘‘వెళ్లండి.. చూడండి.. వేయండి’ అని మా మాస్టారు చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించాను. స్పానిస్‌ చిత్రకారుడు సలోడా దాలి నాకు ప్రేరణ’’ అంటారు.

తొలి గాత్రచిత్రం.. ‘కోనేటి రాయడు’
2002లో విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన రెండున్నర గంటల షోలో 18 సంకీర్తనలకు బొమ్మలు, లైఫ్‌ సైజులో ఒక బొమ్మ  వేసి గుర్తింపు తెచ్చుకున్నారు కూచి. ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు’ ఆయన మొట్టమొదటి గాత్ర చిత్రం. అప్పుడే ఆయనకు ‘కూచి గీత.. సంగీతం’ అని అనే ప్రశంస లభించింది. ఇప్పటికీ ఆయన గాత్రచిత్రాలు వేస్తూనే ఉన్నారు.

వేలి మీద కోయిలమ్మ
‘‘త్యాగరాజు వాగ్గేయకారుడు మాత్రమే కాదు చిత్రకారుడు కూడా. ఆయన తంబుర చివరన కుంచె ఉందేమో అనిపిస్తుంది’’ అంటుండే కూచి. త్యాగరాజ విరచిత 108 కీర్తనలకు తనవైన తెలుగు గీతలతో చిత్రాలు వేశారు. వీణ చిట్టిబాబు తప్పనిసరిగా వాయించే ‘కొమ్మలో కోయిల’ పాటకు.. వీణ దండె మీద చిట్టిబాబు చేయి వేసి పంచమ వేలి మీద కోయిల బొమ్మ వేసి ఆయనకు ఇచ్చారు! ‘‘మనదైన మనోధర్మాన్ని నలుగురికీ పంచాలనేదే నా తపన.

వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాను. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు రామాయణ భారత భాగవతాలు వేయనివారు చిత్రకారులే కాదు. చిత్ర కళావధానం చేయాలని ఉంది. నన్ను సరస్వతి కటాక్షిస్తోంది కాని ఇంకా లక్ష్మీదేవి కటాక్షం లేదు. చిత్రం, చిత్రకళ అని జ్ఞాపకం రాగానే అందరికీ ‘కూచి’ పేరు గుర్తుకు రావాలి’’ అని ఆకాంక్షిస్తున్నారు కూచి సాయిశంకర్‌.


కుంచె ఉల్లాసంగా ఉంటే.. బొమ్మకు ప్రాణం వస్తుంది
ప్రముఖులను తన ఆలోచనకు అనుగుణంగా బొమ్మ వేయడం కూచికి సరదా. ‘‘సరస్వతి చేతిలో వీణ లేకపోవడం చూసి, బ్రహ్మ, ‘వీణ ఎక్కడ?’ అని ప్రశ్నిస్తుంటే, ‘భూలోకంలో చిన్న నిక్కరు వేసుకున్న చిట్టిబాబు చేతిలో ఉంది’ అంటున్నట్లు బొమ్మ వేసి ఆయన చేతికి ఇచ్చాను. చిట్టిబాబుగారి కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆయనను ఉల్లాసపరచడం కోసం, ‘బొమ్మ చూసి కంటతడి పెట్టుకున్నారా, నా బొమ్మ చూడలేక కన్నీటి పర్యంతమయ్యారా’ అనడంతో ఆయన నవ్వేసి, ‘నువ్వంటే నాకు జెలసీ. నేను వాయిస్తే ధ్వని రూపంలో గాలిలోకి Ðð ళ్లిపోతుంది, నువ్వు రాసింది కనిపిస్తుంది’ అన్నారు. కొన్ని వందల నిద్ర లేని రాత్రుల తరవాత ఇంత సాధించగలిగాను. మనం ఎంత ఉల్లాసంగా ఉంటే బొమ్మ అంత చక్కగా వస్తుందనేది నా అభిప్రాయం.

–  వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement