
చిత్రకారుడు శశికాంత్ దోత్రే (ఇన్‌సెట్‌లో)
రాయచూరు రూరల్: కుంచెతో కళా నైపుణ్యం ఉట్టి పడేలా, జీవకళ ఉట్టిపడేలా పెయింటింగ్స్ వేయడంలో శశికాంత్ దోత్రేది అందె వేసిన చేయి. ఆయన గీసిన చిత్రాలను చూస్తే ఇది చిత్రమా, ఫోటోనా అనే భ్రమ కలగకమానదు. ఆ స్థాయిలో కుంచె సామర్థ్యాన్ని దోత్రే సొంతం. ఫొటోగ్రఫీని మించి కుంచె ద్వారా చిత్రాలు వేసిన దోత్రేకు ఏ బొమ్మనైనా అదే సర్వస్వమనే తపనతో లీనమై గీస్తారు. శశికాంత్ దోత్రే తండ్రి ఒక చిరుద్యోగి. శశికాంత్ పుట్టి, పెరిగింది, టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది రాయచూరు పట్టణంలోనే. తరువాత బదిలీపై మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నా చిత్ర కళను జీవితాశయంగా ఎంచుకున్నారు.
మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి
ముంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబం, ఫీజులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో మధ్యలో కళాభ్యాసాన్ని ఆపిన దోత్రే ఇంటిలోనే తన కుంచెకు పదును పెట్టారు. వివిధ రకాలైన కాగితాలలో రంగు రంగుల పెన్సిళ్లతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. చిత్రకళకు జీవకళ ఉట్టి పడేలా చేశాడు. జాగర్ పేరుతో దేశ వ్యాప్తంగా 40 నగరాలలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇటీవల రాయచూరులోని ఉపాధ్యాయుడు వెంకటేష్ నవలి నివాసంలో తన ప్రతిభను వివరించారు. బల్లపై కూర్చొని పూసలు అల్లుతున్న యువతులు, పూలు కుడుతున్న మహిళ, తిరగలితో ధాన్యం విసరడం, పాతకాలంలో గోళీలు ఆడుతున్న పిల్లలు, వంట చేస్తుంటే తల్లి వెనుక కొడుకు ఉండటం, దుప్పట్లు కుట్టడం, తులసి మొక్కకు నీరు పోస్తున్న మహిళ దృశ్యం సంభ్రమానికి గురిచేస్తాయి.
దైనందిన జీవితమే చిత్రం
తల్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి, కూతురిని ముస్తాబు చేస్తున్న తల్లి, వంట కోసం కాయగూరలు తరుముతున్న దృశ్యం, అల్లికలు వేస్తున్న యువతి, ధాన్యం చెరుగుతున్న స్త్రీ.. ఇలా ఎన్నో పెయింటింగ్స్ కళ ఉట్టి పడుతూ మరులు గొలుపుతాయి. గోరింట పెట్టుకుంటున్న యువతులు, ఇంటివద్ద కట్టపై కూర్చుని మాట్లాడే మహిళలు.. ఇలా పేద, మధ్య తరగతి మానవ జీవితపు పార్శా్వలు చూపరులను ముగ్ధుల్ని చేస్తాయనడంలో సందేహం లేదు.





Comments
Please login to add a commentAdd a comment