12 ఏళ్ల వయసు వరకూ స్వప్న ఆగస్టయిన్‌కు తన చేతులు తనకు ఉపకరించవన్న సంగతే తెలియదు. వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవం ఆమెకు అవగతమవుతూ వచ్చింది. తాను జీవితాంతం చేతులు లేకుండానే ఉండాలన్న విషయం ఆమెకు స్పష్టమయ్యింది. దీనిని గ్రహించిన ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. చేతులు లేకపోతేనేం తనకు చక్కనైన కాళ్లు ఉన్నాయి కదా అని అనుకుంది. తన పాదాలనే వినియోగిస్తూ స్వప్న తనలోని కళా ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది.
పాదాలతో అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించే ప్రపంచ కళాకారిణిగా స్వప్న పేరు తెచ్చుకుంది. వరల్డ్ మలయాళీ ఫౌండేషన్ ఆమెకు ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్- 2018’ అవార్డుతో సన్మానించింది. స్వప్న తన కుటుంబానికే కాకుండా యావత్‌దేశానికే గర్వకారణంగా మారింది. ఆమె తన పెయింటింగ్స్‌ను ఎంఎఫ్‌పీఏ ఫోరమ్‌కు విక్రయిస్తుంటుంది. ఈ ఫోరమ్‌లోని సభ్యులు ప్రతీనెలా రెమ్యునరేషన్ పొందుతుంటారు. 1999 నుంచి స్వప్న ఈ ఫోరమ్‌లో మెంబర్‌గా ఉంది. స్వప్న ఆగస్టయిన్ 1975, జనవరి 21న కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది.
ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. ఆమె తండ్రి ఆగస్టయిన్ రైతు. తల్లి సోఫీ గృహిణి. స్వప్నకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అదిమొదలు ఆమె తన పాదాలతో బ్రెష్ పట్టుకుని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. స్వప్న పెయింటింగ్, డ్రాయింగ్ మాత్రమే కాకుండా అన్ని పనులను తన పాదాల సాయంతోనే చేస్తుంటుంది.
ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఐదుగురు తోబుట్టువులలో స్వప్న మొదటి సంతానం. డెలివరీ అనంతరం ఆమె తల్లికి.. స్వప్న చేతులు లేకుండా జన్మించిందని చెప్పారు. నాలుగేళ్ల వయసులోనే స్వప్న తన పాదాలతో పెన్సిల్ పట్టుకుని రాయడం మొదలుపెట్టింది.
తరువాతి కాలంలో స్కెచ్చింగ్ వేయగలిగే స్థాయికి చేరింది. అలప్పుజాలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో స్వప్న హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత పూర్తి స్థాయిలో పెయింటింగ్‌పై దృష్టి సారించింది. ప్రొఫెషనల్ పెయింటర్ స్థాయికి చేరింది. కేన్వాస్ మీద అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించసాగింది. అదే సమయంలో ఆమెకు మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్(ఎంఎఫ్‌పీఏ) గురించి తెలిసింది. దానిలో స్వప్న సభ్యత్వం తీసుకుంది. ఎంఎప్‌పీఏ అనేది దివ్యాంగ కళాకారుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. 27 మంది భారతీయ కళాకారులకు దీనిలో సభ్యత్వం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment