వాయనం: ఆలోచన ఉండాలే గానీ...
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని అంటూంటారంతా. అందుకే ఇంటిని చాలా శ్రద్ధగా తీర్చిదిద్దుకుంటారు మహిళలు. పూలతో, రంగుల కాగితాలతో, మొక్కలతో, వాల్ హ్యాంగింగ్స్‌తో, పెయింటింగ్స్‌తో... ఇలా రకరకాల సామగ్రితో ఇంటిని అలంకరించుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో అలంకరణ కూడా కాస్త ఖరీదైనదే. ఓ రంగు కాగితం కొనాలంటే రెండంకెల్లో ఉంటుంది రేటు. ఓ ఫ్లవర్‌వాజ్ కొనాలంటే మూడంకెలకు వెళ్లాలి. ఇక ఏ పెయింటింగో కొనాలంటే పర్సుకు రెక్కలు వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఓ మధ్య తరగతి ఇల్లాలికి తన ఇంటికి అలంకరించుకోవడంలో కాస్త కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది.
కానీ కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే మనంతట మనమే తక్కువ ఖర్చుతో అలంకరణ వస్తువులను తయారు చేసుకోగలుగుతాం. కావాలంటే ఈ ఫొటోలు చూడండి. వీటలన్నిటినీ ప్లాస్టిక్ స్పూన్లతో తయారు చేశారు. అద్దం, గడియారం, క్యాండిల్ స్టాండ్, బెడ్‌ల్యాంప్, బాస్కెట్... అన్నిటినీ ఎంత అందంగా చేశారో చూశారా? ఇందుకు కావలసింది కొన్ని ప్లాస్టిక్ స్పూన్లు, ఓ క్యాండిల్, అగ్గిపెట్టె, బేస్ కోసం స్టీల్ రేకు.
ముందుగా చెంచాలన్నిటి కాడలూ కత్తిరించేసుకుని, మిగిలిన లోతైన భాగాలకు నచ్చిన రంగులు వేసుకోవాలి. తర్వాత వీటి వెనుక భాగానికి క్యాండిల్ మంటను కాస్త తాకించాలి. ఆ వేడికి ప్లాస్టిక్ కొద్దిగా కరుగుతుంది. సరిగ్గా ఆ భాగాన్ని స్టీల్ రేకు మీద పెట్టి నొక్కితే అతుక్కుపోతుంది. ఇలా అన్నిటినీ వేడి చేసి ఓ వరుస క్రమంలో అతికించుకుంటూ పోవాలి. ఎన్ని వరుసలు కావలిస్తే అన్ని చేసుకోవాలి. కొద్ది నిమిషాలు శ్రమిస్తే చాలు... ఇదిగో ఇంత అందమైన వస్తువులు తయారవుతాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.
చింపండి... అతికించండి!
చిప్స్, పాప్‌కార్న్ లాంటి చిరుతిళ్ల దగ్గర్నుంచి ఉప్పులు, పప్పుల వరకూ అన్నిటినీ పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేసే అమ్ముతున్నారిప్పుడు. అయితే వీటితో ఓ సమస్య ఉంది. ఒక్కసారి ప్యాకెట్ చించితే వాటిని వాడేసుకోవాలి. మిగిలితే డబ్బాల్లో వేసుకోవాలి. లేదంటే మెత్తబడిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. కానీ ఏ ప్రయాణాల్లోనో ఉన్నప్పుడు సగం తిన్న ఫుడ్ ప్యాకెట్స్‌ని ఎలా దాచుకోగలం?
ఆ ఇబ్బందిని తొలగించేందుకే వచ్చాయి... బ్యాగ్ రీ-సీలర్స్. ఇవి స్టేప్లర్ మాదిరిగా ఉంటాయి. ఈ ఫొటోలో చూపినట్టుగా ప్యాకెట్‌ని ఓ చేత్తో పట్టుకుని, మరో చేతితో సీలర్ పట్టుకుని ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు. ప్యాకెట్ మళ్లీ మూసుకుపోతుంది. టూర్లకు వెళ్లినప్పుడు ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. రేటు కూడా తక్కువ... రెండు వందల రూపాయల లోపే!