రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ఏ గ్రామానికి వెళ్లినా నీటి ట్యాంకులు, బోరు బావుల వద్ద ప్రజల క్యూలు కన్పిస్తున్నాయి. బిందెడు నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇవి రాయచూరు జిల్లాలో తాగునీటి కోసం ప్రజల పాట్లు. బోర్లలో అడుగంటిన నీరు, నిరుపయోగంగా తాగునీటి పథకాలు, దీనికి విద్యుత్ కోత తోడు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది.
రోజు రోజుకూ తాగునీటి కోసం కష్టాలు అధికం అవుతున్నాయి.ఎండల తీవ్రత ఎక్కువ కావడం వల్ల బావులు కూడా ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో మహిళలు తాగునీటి కోసం 3-4 కి .మీ దూరం నడవాల్సి వస్తోంది. మెట్ట ప్రాంతాలైన దేవదుర్గ, లింగస్కూరు తాలుకాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బావుల్లో కూడా గుక్కెడు నీరు లభించడం లేదు. రాయచూరు తాలుకాలోని యరగెర, గుంజళ్లి, మలియబాద్, జేగరకల్‌లో దాహం తీర్చుకునేందుకు బావి నుంచి ప్రజలు నీరు తోడుకుంటున్నారు.
గిల్లెసుగూరు, వెంకటేశ్వర క్యాంప్, జాగటగల్ తదితర క్యాంపుల్లోని బోర్లలో నీరు ఇంకిపోవడంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. సాగుకు లేకపోతే పోయాయి.. కనీసం తాగేందుకైనా గుక్కెడు నీరివ్వాలి కదా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పథకాలు ఉన్న చోట్ల ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు నీరు వస్తాయో తెలియక పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోందని ప్రజలు న్యూస్‌లైన్‌తో వాపోయారు. లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిరుపయోగంగా ఉండిపోయాయి.
క్యాంపుల్లో రైతులు సొంతంగా నిర్మించుకున్న చెరువులు కూడా పూర్తిగా ఎండిపోయాయి. ఏటా వేసవిలో ఈ సమస్య తీర్చడానికి నిధుల కోసం సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారే గాని నిధులు మాత్రం అందడం లేదు. అరకొరగా విడుదల అవుతున్నా అవి దుర్వినియోగం అవుతున్నాయి. జిల్లాకు రెండు వైపులా కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా.. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఏటా నీటి సమస్య తలెత్తడం ప్రజల దురదృష్టంగా చెప్పవచ్చు. తాగునీటి కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
గ్రామాల్లో తాగునీటికి హాహాకారాలు
Published Mon, May 5 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement