వివాదానికి కారణమైన పెయింటింగ్
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు.
ఈడీకి రాణా చెప్పింది ఇదీ...
రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు.
వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment