MF Hussain
-
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
ఉనికి కోల్పోనున్న ఎంఎఫ్ హుస్సేన్ కళాసౌధం
ప్రస్తుతం కూల్చివేస్తున్న ‘సినిమా ఘర్’ ఎంఎఫ్ హుస్సేన్ కలల సౌధం. ఈ భవనంలోని పోర్టికోలో కూర్చుని తన విటేజ్ కారును చూస్తూ కాఫీ తాగడం ఆ ప్రసిద్ధ చిత్రకారుడికిఅలవాటు. తన మనసుకు కష్టం కలిగినా.. ఆనందం వచ్చినా ఇక్కడే గడిపేవారు. ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రాలను ఆయన ఇక్కడే గీసారు. ఈ ప్రాంతంలో ఈ భవనం ఓ ల్యాండ్ మార్క్‌గా ఉండేది. ఇక్కడే ఓ బస్టాప్ సైతం చాన్నాళ్లు కొనసాగింది. సినిమా ఘర్కూల్చివేతతో ఇప్పుడు ఇవన్నీకనుమరుగు కానున్నాయి బంజారాహిల్స్: తన కుంచెతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది పేరు, ప్రతిష్టలతో పాటు వివాదాలను సైతం మూటగట్టుకున్న ‘ఇండియన్ పికాసో’గా సుప్రసిద్ధుడైన భారతీయ చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్(ఎంఎఫ్ హుస్సేన్) కళాసౌధం ‘సినిమా ఘర్’ కూలిపోతోంది. హుస్సేన్ 1999లో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రధాన రహదారిలో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఆనాడు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్ ఈ సినిమాఘర్ను ప్రారంభించారు. పర్షియన్ శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేకమైన గోడలు, అందంతో పాటు ఆకర్షణీయమైన మార్బుల్‌తో చూడగానే వినూత్నంగా కనిపించేలా ‘సినిమాఘర్’ను తీర్చిదిద్దారు. లోపల ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో గోడలను మలిచారు. ఎన్నోసార్లు ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సినిమాఘర్‌లో 50 సీటింగ్ కెపాసిటీతో ‘సౌందర్య టాకీస్’ పేరుతో మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. అలాగే సినిమా, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, కంప్యూటర్, సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన 2 వేల పుస్తకాలతో ‘ప్యారిస్ సూట్’ పేరుతో లైబ్రరీ కూడా ఏర్పాటైంది. ఇక సినిమా మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ. ఎంఎఫ్ హుస్సేన్ వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించేందుకు ఓ ఎగ్జిబిషన్ హాలు కూడా సుందరంగా నిర్మించారు. హైదరాబాద్ అంటే అమితంగా ఇష్టపడే ఎంఎఫ్ హుస్సేన్ దేÔశంలో ఎన్నోచోట్ల సినిమాఘర్ నిర్మాణానికి అవకాశాలు వచ్చినా ఇక్కడ మాత్రమే ఆ కోరిక తీర్చుకున్నారు. విదేశాల్లో ఉండే ఆయన స్వదేశానికి తిరిగివచ్చి సినిమాఘర్లోనే చివరి మజిలీని గడపాలనుకునేవారు. తనకు మనసు బాగాలేనప్పుడు సినిమాఘర్‌లో కాసేపు కూర్చోవడం ద్వారా మనసు తేలికపడుతుందని హుస్సేన్ బతికుండగా భావించేవారు. నెలలో వారం రోజులు ఇక్కడే ఒంటరిగా గడిపేవారాయన. ఎన్నో కళాత్మక పెయింటింగ్స్‌ను ఇక్కడ ఉండగానే గీశారు. 2002లో ఏడాది పాటు సినిమాఘర్ మూతపడ్డప్పుడు కళాభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2004, జనవరి 26వ తేదీన దీన్ని తిరిగి తెరిచారు. ఆ సమయంలో ఎంఎఫ్ హుస్సేన్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. చిత్రకారుడిగా ఘనకీర్తి పొందిన హుస్సేన్ కొన్ని వివాదాలతో ప్రాణభీతి కారణంగా 2007లో లండన్ వెళ్లిపోయి ఇక తిరిగి రాలేదు. ఎంఎఫ్ హుస్సేన్ నెలరోజుల సుదీర్ఘ అస్వస్థతతో 2011, జూన్ 9వ తేదీన లండన్‌లో తన 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దాంతో తన చివరి మజిలీని నగరంలోని సినిమా ఘర్‌లో గడపాలని భావించినా ఆయన కోరిక మాత్రం తీరలేదు. సినిమాఘర్ స్థానంలోవాణిజ్య సముదాయం ఎంఎఫ్ హుస్సేన్ మరణానంతరం సినిమాఘర్ ఘనకీర్తి మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు సంతానం. సినిమాఘర్ ప్రాపర్టీని ఇద్దరు కూతుళ్లు రైసా హుస్సేన్, అఖిలా హుస్సేన్‌తో పాటు చిన్నకొడుకు ఒవైసీ హుస్సేన్‌కు రాసిచ్చారు. వీరంతా ముంబై, దుబాయ్‌లో స్థిరపడ్డారు. తండ్రి మరణానంతరం ఇందులోని ఒక్కో కళాఖండాలను ఆయన సంతానం ముంబైకి తరలించారు. దీంతో ఇప్పుడు ఈ భవనం పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకోవాల్సిన ఈ కళాక్షేత్రాన్ని.. తమకు ఇ భవనం అవసరం లేదని ఇటీవల సంజయ్ గుప్తా అనే వ్యాపారికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఈ కళా సౌధాన్ని కూల్చివేసి ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు కళాభిమానులను రంజింపజేసిన సినిమాఘర్ ఇక తన ఉనికిని కోల్పోయినట్టే. ఎంఎఫ్ హుస్సేన్ గీచిన చిత్రాలు గుండెల్లోని భావోధ్వేగాలను తట్టి లేపుతాయని అభిమానులు చెబుతుంటారు. అలాంటి సినిమాఘర్ ఇక లేదన్న విషయాన్ని కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కట్టడం కూల్చివేత ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లో కట్టడం పూర్తిగా కనుమరుగు కానుంది. -
ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు
లివర్ క్యాన్సర్‌తో ఢిల్లీలో కన్నుమూత సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు, ప్రముఖ కళాకారుడు శంషాద్ హుస్సేన్(70) శనివారంరాత్రి ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శన లు నిర్వహించారు. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందిన శంషాద్... హైదరాబాద్‌లోనూ పదేళ్లు తన కళను కొనసాగించారు. చిత్రాల్లో పలురకాల మనస్తత్వాలను ప్రతిబింబించారు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ దిగ్భ్రాంతి... శంషాద్ మృతిపట్ల ‘హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ’ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనకు హైదరాబాద్‌తోనూ విడదీయలేని అనుబంధం ఉందని సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1980ల్లో లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్, తోట వైకుంఠం వంటి ప్రసిద్ధ చిత్రకారులతో శంషాద్ కలసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. -
కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54%
ఠాణే: అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా పనులు చేసుకోవడానికి మరొకరి సాయం అవసరమవుతున్న ఈ రోజుల్లో పుట్టుకతోనే చేతులు లేని ఆ బాలుడు కాళ్లతో పరీక్షలు రాసి టెన్త్‌లో 54 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. జిల్లాలోని నందోరి గ్రామంలో ఉన్న గిరిజన కుటుంబంలో పుట్టిన వసంత్ రావుత్ ఈ ఫీట్ సాధించి అందరి మన్ననలను పొందుతున్నాడు. ఈ సందర్భంగా స్థానిక జీవన్ వికాస్ పాఠశాల విద్యార్థి అయిన రావుత్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎంఎఫ్ హుస్సేన్ సాబ్ అంత పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా జీవితాశయం. ఇంటర్ పూర్తికాగానే ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో సీటు సంపాదించేందుకు కృషిచేస్తా. పుట్టుకనుంచి చేతులు లేకపోవడంతో కాళ్లతోనే రాయడం నేర్చుకున్నా. టెన్త్‌లోనూ నా పరీక్షలు రాయడానికి వేరే ఎవరినైనా పెట్టుకోమని మా సార్లు నాకు సలహాఇచ్చారు. అయితే నాపై నాకున్న నమ్మకమే నేను టెన్త్ 54 శాతంతో పాసయ్యేలా చేసింది. నిజానికి ఈసారి టెన్త్ పాసవ్వనేమోననే అనుమానముండేది. కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా భయముండేది. అయితే మా కంప్యూటర్ సార్ నాకు సబ్జెక్ట్‌పై భయం పోగొట్టడంతో పరీక్ష బాగా రాశాను. అలాగే చిత్రలేఖనంపై నా ఆసక్తిని గమనించి మా ఆర్ట్స్ టీచర్ నాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలితో బొమ్మలు ఎలా వేయాలో నేర్పించారు. రోజూ నేను స్కూలుకు వచ్చేందుకు నా స్నేహితుడు జయంత్ దుమాడే చాలా సహకరించాడు. మేం ఇద్దరం పాఠశాల మంజూరు చేసిన ఆటో రిక్షాలో రోజూ స్కూల్‌కు వస్తుండేవాళ్లమ’ని చెప్పాడు.ఎంఎఫ్ హుస్సేన్ అంతటి చిత్రకారుడిని కావాలనేది తన చిరకాల వాంఛ అని ముక్తాయించాడు.