
ప్రముఖ భారతీయ కళలలను సేకరించే వ్యక్తిగా, దాతగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ్‌నాడార్ సతీమణి కిరణ్ నాడార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఎంఎఫ్ హుస్సేన్ ఐకానిక్ పెయింటింగ్ ‘అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’ను 13.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)కు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇది ఆధునిక భారతీయ కళ కొనుగోలులో కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమకాలీన కళకు పెరుగుతున్న విలువను, గుర్తింపును నొక్కి చెబుతుంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని పరిరక్షించడంపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధునిక చిత్రకారుల్లో ఎంఎఫ్ హుస్సేన్‌కు అరుదైన గౌరవం ఉంది. ఆయన గ్రామీణ భారతదేశం సారాన్ని ‘అన్‌టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’లో చిత్రీకరించారు. ఈ పెయింటింగ్‌లో ఉపయోగించిన రంగులు, బోల్డ్ స్ట్రోక్స్, సంక్లిష్టమైన కథా దృశ్యాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని కొందరు తెలియజేస్తున్నారు. కిరణ్ నాడార్ ఈ కళాఖండాన్ని తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (కేఎన్‌ఎంఏ)లో ఉంచనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దాదాపు 7,000 కళాకృతులను భద్రపరిచారు. భవిష్యత్తులో దీని అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచితంగా వైద్య శిక్షణ కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని కిరణ్ తెలిపారు. కళల సంరక్షణకు కిరణ్ నాడార్ చేస్తున్న కృషిని చాలామంది అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: వంటలో రారాజులు.. సంపదలో కింగ్‌లు
బ్రిడ్జ్ ప్లేయర్‌గా గుర్తింపు..
కిరణ్ నాడార్ దాతగానే కాకుండా బ్రిడ్జ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు. ఈ విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సహా వివిధ పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలోని శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment