న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఎందుకంటే..
గ్రూప్ కంపెనీలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లలో రోష్నీ నాడార్ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.
రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫొసిస్టమ్స్ ప్రమోటర్లు హెచ్‌సీఎల్ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్ నుంచి వాటాలు లభించనున్నాయి.
ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్‌సీఎల్‌కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రోష్నీ నాడార్ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment