Nadar
-
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే.. గ్రూప్ కంపెనీలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో రోష్నీ నాడార్ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫొసిస్టమ్స్ ప్రమోటర్లు హెచ్‌సీఎల్ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్ నుంచి వాటాలు లభించనున్నాయి.ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్సీఎల్కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రోష్నీ నాడార్ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి. -
హెచ్‌సీఎల్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను .. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన ’షెవాలీర్ డి లా లెజియన్ డి హానర్’ (’నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పురస్కారాన్ని అందుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, భారత్ .. ఫ్రాన్స్ మధ్య పటిష్టమైన భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రోష్ని తెలిపారు. తమకు కీలక మార్కెట్లలో ఒకటైన ఫ్రాన్స్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నామని ఆమె పేర్కొన్నారు. -
టెక్ కుబేరుల జాబితాల్లో ఇద్దరు భారతీయులు
ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది టెక్ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్లు ఫోర్బ్స్ జాబితాలో టాప్-20లో నిలిచారు. 16 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రేమ్‌జీ 13వ ర్యాంకును దక్కించుకోగా.. 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో శివ్ నాడార్ 17వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. "100 రిచెస్ట్ టెక్నాలజీ బిలినీయర్ల ఇన్ ది వరల్డ్ 2016" జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో 78 బిలియన్ డాలర్ల ఆస్తితో మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలి స్థానంలో ఉన్నారు. ఇండో -అమెరికన్ టెక్నాలజీ సింఫొనీ టెక్నాలజీ గ్రూప్ సీఈవో రొమేశ్ వాధ్వాని, ఐటీ కన్సల్టింగ్, ఔట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకులు భరత్ దేశాయ్, ఆయన భార్య నీర్జా సేతీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారత మూడో అతిపెద్ద ఔట్సోర్సర్గా ఉన్న ప్రేమ్‌జీ కంపెనీ విప్రో, గత ఏళ్లుగా నమోదుచేస్తూ వస్తున్న వృద్ధితో ఆయన కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. నాడార్కు హెచ్‌సీఎల్ టాలెంట్ కేర్‌తో పాటు, గ్రాడ్యుయేట్లకు శిక్షణను ఇచ్చే స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థ ఉందని పేర్కొంది. ఆయన తాజా వెంచర్ 500 మిలియన్ డాలర్ల ఫండ్‌ను పలు స్టార్టప్‌ల్లో, అమెరికా హెల్త్ కేర్ టెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఫోర్బ్స్ తెలిపింది. గూగుల్ అల్ఫాబెట్ ఛైర్మన్ ఎరిక్ ష్మిత్, ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్లు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో అత్యధికంగా దాదాపు సగం మంది అమెరికాకు చెందిన వారు ఉన్నారు. తొలి పది మందిలో ఎనిమిది మంది అమెరికా వారే. తర్వాత స్థానాల్లో చైనాకు చెందిన వారు 19 మంది ఉన్నారు.