టెక్ కుబేరుల జాబితాల్లో ఇద్దరు భారతీయులు
ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది టెక్ కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయులకు చోటు దక్కింది. విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్లు ఫోర్బ్స్ జాబితాలో టాప్-20లో నిలిచారు. 16 బిలియన్ డాలర్ల ఆస్తితో ప్రేమ్జీ 13వ ర్యాంకును దక్కించుకోగా.. 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో శివ్ నాడార్ 17వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. "100 రిచెస్ట్ టెక్నాలజీ బిలినీయర్ల ఇన్ ది వరల్డ్ 2016" జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో 78 బిలియన్ డాలర్ల ఆస్తితో మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలి స్థానంలో ఉన్నారు. ఇండో -అమెరికన్ టెక్నాలజీ సింఫొనీ టెక్నాలజీ గ్రూప్ సీఈవో రొమేశ్ వాధ్వాని, ఐటీ కన్సల్టింగ్, ఔట్సోర్సింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకులు భరత్ దేశాయ్, ఆయన భార్య నీర్జా సేతీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
భారత మూడో అతిపెద్ద ఔట్సోర్సర్గా ఉన్న ప్రేమ్జీ కంపెనీ విప్రో, గత ఏళ్లుగా నమోదుచేస్తూ వస్తున్న వృద్ధితో ఆయన కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. నాడార్కు హెచ్సీఎల్ టాలెంట్ కేర్తో పాటు, గ్రాడ్యుయేట్లకు శిక్షణను ఇచ్చే స్కిల్స్ డెవలప్మెంట్ సంస్థ ఉందని పేర్కొంది. ఆయన తాజా వెంచర్ 500 మిలియన్ డాలర్ల ఫండ్ను పలు స్టార్టప్ల్లో, అమెరికా హెల్త్ కేర్ టెక్ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు ఫోర్బ్స్ తెలిపింది. గూగుల్ అల్ఫాబెట్ ఛైర్మన్ ఎరిక్ ష్మిత్, ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్‌లు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో అత్యధికంగా దాదాపు సగం మంది అమెరికాకు చెందిన వారు ఉన్నారు. తొలి పది మందిలో ఎనిమిది మంది అమెరికా వారే. తర్వాత స్థానాల్లో చైనాకు చెందిన వారు 19 మంది ఉన్నారు.