వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.
కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.
విద్య, నేపథ్యం
కర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్‌టన్ & యునైటెడ్ బ్రూవరీస్‌లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.
జాబ్ ఇవ్వని కంపెనీలు
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్‌ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.
ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.
రూ.10,000తో బయోకాన్ ప్రారంభం
1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్‌తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్‌లాస్‌ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.
లోన్ ఇవ్వని బ్యాంకులు
కిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment