powerful woman
-
నాడు నమ్మి లోన్ ఇవ్వలేదు.. నేడు రూ.40 వేల కోట్ల కంపెనీ
వ్యాపార రంగంలో రాణించడం అంత సులువు కాదు.. అందునా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోయినా దశాబ్దాల క్రితం దేశంలో ఓ మహిళ వ్యాపారం ప్రారంభించడమంటే పెద్ద సాహసమే. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా తన ప్రయాణాన్ని గ్యారేజీలో ప్రారంభించి, దేశపు అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు.కిరణ్ మజుందార్ షా కథ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు ఆమె 3.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29,050 కోట్లు) నికర విలువతో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించారు. ఈ లిస్ట్‌లో 82వ స్థానంలో నిలిచిన కిరణ్ మజుందార్ షా భారత్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో 91వ స్థానంలో ఉన్నారు.విద్య, నేపథ్యంకర్ణాటకలోని బెంగళూరులో 1953 మార్చి 23న జన్మించిన కిరణ్ బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో తన బీఎస్సీ పూర్తి చేశారు. సైన్స్‌పై ఆకాంక్షతో, ఆమె ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మాల్టింగ్ అండ్ బ్రూయింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె భారత్‌కు తిరిగి రావడానికి ముందు నాలుగు సంవత్సరాల పాటు కార్ల్టన్ & యునైటెడ్ బ్రూవరీస్లో ట్రైనీ బ్రూవర్‌గా పనిచేశారు.జాబ్ ఇవ్వని కంపెనీలుభారత్కు తిరిగి వచ్చిన తర్వాత బ్రూయింగ్‌లో కెరీర్‌ను నిర్మించుకోవాలని కిరణ్ భావించారు. అయితే ఆ సమయంలో భారతీయ పరిశ్రమ పురుషులకు ప్రత్యేకమైన వృత్తిగా బ్రూయింగ్ను చూసేది. దీంతో విద్యార్హతలు ఉన్నప్పటికీ ఢిల్లీ, బెంగళూరులోని కంపెనీలు ఆమెకు జాబ్ ఇవ్వకుండా తిరస్కరించాయి.ఇలా ఉండగా ఐరిష్ వ్యాపారవేత్త లెస్ ఆచిన్‌క్లోస్‌ను కలుసుకోవడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించమని కిరణ్ మజుందార్ షాను ఆయన ప్రోత్సహించారు. ప్రారంభంలో సంశయించిన ఆమె ఐర్లాండ్‌లోని బయోకాన్ బయోకెమికల్స్‌లో ఆరు నెలల శిక్షణ కోసం ఆయన ప్రతిపాదనను అంగీకరించారు. ఒక వేళ ఆమెకు వ్యాపారం సరిపడకపోతే ఉద్యోగం కల్పించడంలో సహాయం చేస్తానని కూడా ఆచిన్‌క్లోస్ హామీ ఇచ్చారు.రూ.10,000తో బయోకాన్ ప్రారంభం1978లో భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కిరణ్ బయోకాన్ బయోకెమికల్స్తో భాగస్వామిగా ఉంటూ కేవలం రూ.10,000 పెట్టుబడితో బయోకాన్ ఇండియాను స్థాపించారు. చిన్న గ్యారేజీలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆమె బొప్పాయి సారం నుండి ఎంజైమ్‌లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమె ఉత్పత్తులు యూఎస్, యూరప్‌లో మార్కెట్‌ను పొందాయి. బయోకాన్‌కు మొదటి విజయం దక్కింది.తరువాత బీర్ వడపోతలో ఉపయోగించే ఐసింగ్లాస్ను తయారు చేయడం ప్రారంభించారు. బయోకాన్ దేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ. దీని విలువ రూ.40,000 కోట్ల కంటే ఎక్కువ.లోన్ ఇవ్వని బ్యాంకులుకిరణ్ తొలిరోజులలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పట్లో బయోటెక్నాలజీ భారత్‌లో ఒక నూతన రంగం. ఒక మహిళా వ్యాపారవేత్తగా ఆమె రాణించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పరిశ్రమలో విజయం సాధించగల ఆమె సామర్థ్యాన్ని అనుమానిస్తూ బ్యాంకులు ఆమెకు రుణాలు మంజూరు చేసేందుకు నిరాకరించాయి. అయినప్పటికీ, ఆమె సంకల్పం, వినూత్న విధానం సందేహాల వ్యక్తం చేసినవారి కళ్లు తెరిపించాయి. -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
Matilda Kullu: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్.. ఎందుకంటే..?
Who Is Matilda Kullu: శక్తిమంతమైన మహిళ అంటే కార్పొరేట్ సి.ఇ.ఓ... పెద్ద రాజకీయ నాయకురాలు.. గొప్ప కళాకారిణి... లేదా ఏ ఒలింపిక్స్ క్రీడాకారిణో అయి ఉండవచ్చు. కాని ఫోర్బ్స్ పత్రిక తాజా భారతీయ శక్తిమంతమైన మహిళల్లో ఒక ఆశా వర్కర్ చేరింది. అదీ వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రం నుంచి. ఆమె పేరు మెటిల్డా కుల్లు. హేమాహేమీల మధ్య ఇలా ఆశావర్కర్కు చోటు దొరకడం ఇదే ప్రథమం. ఏమిటి ఆమె ఘనత? కోవిడ్ వాక్సినేషన్ కోసం ఆమె ఏమి చేసింది? సూదిమందుకు కులం ఉంటుందా? ఉంటుంది... కొన్నిచోట్ల... ఆ సూది వేసే చేతులు బహుశా షెడ్యూల్డ్ తెగవి అయితే. అందునా చిన్న ఉద్యోగంలో ఉంటే. ఆశా వర్కర్ అంటే నెలకు 4,500 రూపాయల జీతం. గడప గడపకు తిరిగే ఉద్యోగం. అంత చిన్న ఉద్యోగి, స్త్రీ, పైగా షెడ్యూల్డ్ తెగ... తరతరాలుగా వెనుగబడిన ఆలోచనలు ఉన్న ఊళ్లలో, అంటరానితనం పాటించడం వదులుకోని ఇళ్లల్లో ఎంత కష్టం. పైగా ఆ ఊళ్లో చాలామంది మూఢ విశ్వాసాలతో, జబ్బు చేస్తే బాణామతిని నమ్ముకునే అంధకారంలో ఉంటే వారిని ఆస్పత్రి వరకూ నడిపించడం ఎంత కష్టం. ఈ కష్టం అంతా పడింది మెటిల్డా కుల్లు. అందుకే ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా విమెన్ పవర్ 2021’ పట్టికలోని మొత్తం 20 మంది భారతీయ మహిళలలో కుల్లుకు 3వ స్థానం ఇచ్చింది. ఆమెకు ముందు బ్యాంకర్ అరుంధతి భట్టాచార్య ఉంది. ఆమె తర్వాత క్రీడాకారిణి అవని లేఖరా, నటి సాన్యా మల్హోత్రా, కాస్మోటిక్స్ దిగ్గజం వినీతా సింగ్ తదితరులు ఉన్నారు. వీరందరి మధ్య ఒక చిరు ఉద్యోగి చేరడం సామాన్య ఘనత కాదు. ఇలా ఒక ఆశా వర్కర్ కనిపించడం ఇదే ప్రథమం. ఆ మేరకు భారతదేశంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ గౌరవం దక్కిందని భావించాలి. ఎవరు మెటిల్డా కుల్లు? 45 ఏళ్ల మెటిల్డా కుల్లు ఒడిసాలోని సుందర్ఘర్ జిల్లాలో గార్దభహల్ అనే పల్లెకు ఏకైక ఆశా వర్కర్. గార్దభహల్లోని 964 మంది గ్రామీణులకు ఆమె ఆరోగ్య కార్యకర్త. 15 ఏళ్ల క్రితం ఆమె ఈ ఉద్యోగంలో చేరింది. అయితే ఒడిసా పల్లెల్లో ఆశా వర్కర్‌గా పని చేయడం సులభం కాదు. ‘జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లాలి అని నేను చెప్తే నన్ను చూసి గ్రామీణులు నవ్వే వారు. ఏదైనా గట్టి రోగం వస్తే బాణామతికి ఆశ్రయించడం వారికి అలవాటు. కాన్పులు ఇళ్లల్లోనే జరిగిపోవాలని కోరుకుంటారు. పైగా నేను షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళను కావడం వల్ల ఇళ్లల్లోకి రాకపోకలకు కొందరు అంగీకరించే వారు కాదు. నన్ను ఏమన్నా ఎంత అవమానించినా వారి ఆరోగ్యం నాకు ముఖ్యం. నేను వారికి చెప్పీ చెప్పీ మార్పు తేవడానికి ప్రయత్నించేదాన్ని’ అంటుంది మెటిల్డా కుల్లు. ఉదయం 5 గంటల నుంచి మెటిల్డా దినచర్య రోజూ ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది. ఇల్లు చిమ్ముకుని, పశువులకు గడ్డి వేసి, భర్త.. ఇద్దరు పిల్లలకు వంట చేసి సైకిల్ మీద ఊళ్లోకి బయలుదేరుతుందామె. గర్భిణులను, బాలింతలను, పసికందుల ఆరోగ్యాన్ని ఆమె ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి సూచనలు, సలహాలు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈడేరిన అమ్మాయిలు ఎటువంటి శుభ్రత పాటించాలో చెప్పడం మరో ముఖ్యమైన పని. ఇక ఆ పల్లెల్లో చాలామందికి గర్భకుహర ఇన్ఫెక్షన్లు సహజం. దానికి తోడు లైంగిక వ్యాధుల బెడద కూడా. వీటన్నింటినీ ఆమె ఓపికగా చూస్తూ గ్రామీణులను ఆస్పత్రులకు చేర్చి వారికి నయమయ్యేలా చూసేది. కోవిడ్ టైమ్‌లో వారియర్ కోవిడ్ మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో దేశంలో అన్ని చోట్లకు మల్లే ఒడిసాలో కూడా విజృంభించాయి. ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 వేల మంది ఆశా వర్కర్ల మీద ఒత్తిడి పడ్డట్టే మెటిల్డా మీద కూడా పడింది. ‘కోవిడ్ సమయంలో నా దినచర్య ఇంకా కష్టమైంది. రోజుకు 40, 50 ఇళ్లు తిరుగుతూ కోవిడ్ సింప్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా లేవా అని చూడటం నా పని. ఊళ్లో కోవిడ్ వ్యాపించకుండా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను. ఆశా వర్కర్లకు పిపిఇ కిట్లు అందింది లేదు. అయినా సరే ఇళ్లల్లోకి వెళ్లి సింప్టమ్స్ ఉన్నవారికి బిళ్లలు ఇచ్చేదాన్ని. గ్రామీణులతో సమస్య ఏమిటంటే వారు టెస్ట్‌లకు రారు. హాస్పిటల్‌కు వెళ్లరు. కాని ఇన్నేళ్లుగా నేను సంపాదించుకున్న నమ్మకం వల్ల వారు తొందరగా స్పందించారు. వాక్సినేషన్‌కు అంగీకరించారు. అందరికీ దాదాపుగా వాక్సిన్ నేనే వేశాను. ఆ విధంగా ఊళ్లో కోవిడ్‌ను అదుపు చేయగలిగాం’ అంటుంది మెటిల్డా కుల్లు. అయితే ఇంత ప్రాణాలకు తెగించి పని చేసినా ఒక్కసారి ప్రభుత్వం అదనంగా వేసిన 2000 రూపాయల ఇంటెన్సివ్ తప్ప వేరే మేలు ఏమీ జరగలేదు. ఇప్పటికీ ఆమె పాత జీతానికే పని చేస్తోంది. ఆ కొద్దిపాటి డబ్బు కోసం అంత పని చేయడానికి ఎంత శక్తి కావాలి, ధైర్యం కావాలి, అంకితభావం కావాలి. అందుకే ఫోర్బ్స్ ఆమె శక్తివంతమైన మహిళ అంది. సమాజం కోసం పని చేసే శక్తిని అందరూ ప్రదర్శించరు. ప్రదర్శించిన వారు ఇలా ప్రశంసను పొందుతారు. ప్రశంసకు యోగ్యమైన జీవితం కదా అందరూ కొద్దో గొప్పో గడపాలి. -
టాప్ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటుదక్కింది. హెచ్‌సీఎల్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయో కాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, సినీతార ప్రియాంక చోప్రా జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. ఆమె ఈ జాబితాలో టాప్‌లో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం. రెండో స్థానంలో యూకే ప్రధాని థెరిసా మే, మూడో స్థానంలో ఐఎమ్ఎఫ్ ఎమ్డీ క్రిస్టినా లగార్డే ఉన్నారు. 51వ స్థానంలో రోష్ని నాడార్... హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న రోష్ని 51వ స్థానంలో నిలిచారు. కిరణ్ షా 60వ స్థానంలో, హెచ్‌టీ మీడియా సీఎండీ శోభనా భర్తియ 88వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా 94వ స్థానంలో నిలిచారు. -
‘ఫోర్బ్స్’ శక్తిమంత మహిళల్లో సోనియా నం.3
వాషింగ్టన్: ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడో స్థానంలో నిలిచారు. ‘ఫోర్బ్స్’ పత్రిక ప్రకటించిన 72 మంది శక్తిమంతుల జాబితాలో సోనియా 21వ స్థానంలో నిలిచారు. జాబితాలోని మహిళల్లో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ (5వ స్థానం), బ్రెజిల్ అధినాయకురాలు దిల్మా రోసెఫ్ (20వ స్థానం) తర్వాత సోనియా ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ‘ఫోర్బ్స్’ పత్రిక సోనియాను భారత్‌కు ‘మకుటం లేని అధినేత’గా అభివర్ణించింది. శక్తిమంతుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అధిగమించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఒబామా ఈసారి రెండో స్థానానికి పరిమితం కాగా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడో స్థానంలో, పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ జాబితాలో 28వ స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 38వ స్థానంలోను, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ 51వ స్థానంలోను నిలిచారు.