
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్‌కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రారంభ జీవితం పోరాటాలే..
గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.
వ్యాపార సామ్రాజ్యానికి పునాది
మోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.
ఫెవికోల్ ప్రారంభమైందిలా..
1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.
పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణం
ఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment