Art and Craft
-
పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది
నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్‌తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది. పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది. బయో ఇన్ఫర్మాటిక్స్లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు. నెలరోజులు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు. ఊహించని శరాఘాతం! ‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి. అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్బీఐకి మారి హైదరాబాద్‌కి వచ్చేశాం. మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది. సృజనతో సాంత్వన నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్‌లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఫేస్బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను. నాకు నిజంగా ఆశ్యర్యమే! నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్‌మోడల్‌గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు. మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. – వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!
పెరవలి: ఇత్తడి.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అజ్జరం. ఇత్తడికి పుట్టిల్లుగా ఈ గ్రామం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవ్వని వస్తువంటూ లేదు. పవిత్రమైన దేవాలయాల్లోను, సామాన్యుల ఇళ్లలోను, సినిమాల్లోనూ కనిపించే అరుదైన ఇత్తడి వస్తువులు అజ్జరంలో తయారైనవే. బ్రిటిష్ వారి హయాం నుంచీ.. బ్రిటిష్ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే. ‘దేవత’ బిందెలు.. ఆలయాల్లో గంటలు ‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే. ఈ గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు. నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. తండ్రి నుంచీ ఇదే వృత్తి మా తండ్రి గారు ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. నాకూ అదే నేర్పారు. మేం ఈ పనిని ఇష్టంగా చేస్తాం. అందుకే ఇంతకాలమైనా విసుగు రాలేదు. వచ్చిన కస్టమర్లు మా పనిని చూసి ఎంతో అందంగా చేస్తున్నావని అన్నపుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ పనిలో ఎంతో హాయి ఉంది. – నున్న వీర వెంకట సత్యనారాయణ, ఇత్తడి వస్తువుల తయారీ కార్మికుడు నేర్చుకునే వారు తగ్గిపోయారు మేం నాయీబ్రాహ్మణులం. ఈ పనంటే ఎంతో ఇష్టం. అందుకే దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాను. మెషీన్లు రావడంతో ఇత్తడి వస్తువుల తయారీ పని నేర్చుకునేవారు ఇప్పుడు తగ్గిపోయారు. కార్మిక చట్టాల వలన పిల్లలు పనికి రావడం లేదు. దీంతో ఈ పని మా తరంతోనే అంతమైపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, కార్మికుడు 40 ఏళ్లుగా ఇదే పని గత 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కులాలకు అతీతంగా అందరం కలసి ఉంటాం. గ్రామంలోని దాదాపు అందరూ ఈ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు యంత్రాల రాకతో పని నేర్చుకునేవారే లేరు. ఈ పనితో కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాం. – యడ్ల పోతురాజు, కార్మికుడు వేగం పెరిగినా కార్మికులు తగ్గిపోయారు ఒకనాడు ఇత్తడి పరిశ్రమ అజ్జరంలో వైభవంగా ఉండేది. యంత్రాలు వచ్చాక పని వేగంగా జరుగుతోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు తగ్గిపోతున్నారు. గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వ్యాపారం ఉంది. మా తాత బెప్పే పేరలింగం, మా తండ్రి సాంబమూర్తి కూడా ఈ వ్యాపారమే చేసేవారు. ఆయనకు మేం ముగ్గురు కుమారులం. అందరం ఈ పనే చేస్తున్నాం. చిన్నాపెద్దా తేడా లేకుండా 20 ఏళ్ల క్రితం అందరూ ఈ పనికి వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు పనికి రావడం లేదు. చిన్నప్పటి నుంచీ పని నేర్చుకునేవారు తగ్గిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. – బెప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని -
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్ట్ అండ్ క్రాప్ట్ టీచర్లు
-
సృజనాత్మక కెరీర్.. సిరామిక్ ఇంజనీరింగ్
అప్‌కమింగ్ కెరీర్ పింగాణి అనగానే ఠక్కున చైనా గుర్తుకొస్తుంది. రంగురంగుల పింగాణి కప్పులు, సాసర్లు, ప్లేట్లు, మెరిసిపోయే అందమైన అలంకరణ వస్తువులు గుర్తుకొస్తాయి. కానీ, ఇది వీటికే పరిమితం కాలేదు. ఆధునిక కాలంలో చాలా రంగాల్లో పింగాణి వాడకం అధికమైంది. దీనికొక శాస్త్రమే ఉంది. అదే.. సిరామిక్ ఇంజనీరింగ్. కృత్రిమ ఎముకల నుంచి రాకెట్లలో హీట్షీల్డ్ల వరకు ఎన్నో ఆధునిక ఉపకరణాల తయారీకి సిరామిక్‌ను ఉపయోగిస్తున్నారు. సిరామిక్ ఇంజనీర్లకు ప్రస్తుతం దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఉ ద్యోగావకాశాలు ఉన్నాయి. సైన్స్ అండ్ టె క్నాలజీతోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకో వచ్చు. అధిక వేతనాలతో కూడిన కొలువుల్లో కుదురుకోవచ్చు. మెండుగా కొలువులు పింగాణి అనేది ఇనార్గానిక్ నాన్ -మెటాలిక్ మెటీరియల్. దీనికి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే గుణం ఉంది. ఇందులో ట్రెడిషనల్, అడ్వాన్స్డ్ సిరామిక్స్ అనే రెండు రకాలుంటాయి. ట్రెడిషనల్ సిరామిక్స్‌తో కప్పులు, పాత్రలు, వాష్ బేసిన్ల వంటివి తయారు చేస్తారు. అడ్వాన్స్డ్ మెటీరియల్‌ను కంప్యూటర్లలో మెమరీ కోర్లు, ఇన్సులేటర్లు, బాయిలర్లు, ఫర్నేస్‌లు, కన్వర్టర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ సిరామిక్స్‌ను అభివృద్ధి చేయకపోతే సెల్ఫోన్ల తయారీ సాధ్యమయ్యేదే కాదు. రక్షణ రంగంలో రాడార్లు, సబ్మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, స్పేస్ షటిల్స్‌లో సిరామిక్స్ వాడకం తప్పనిసరి. సిరామిక్ ఇంజనీర్లకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు, గ్లాస్, సిమెంట్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆప్టిక్స్ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. అలాగే రవాణా, మెడిసిన్, ఎనర్జీ కన్వర్షన్, పొల్యూషన్ కంట్రోల్, ఏరోస్పేస్, నిర్మాణ రంగాల్లో సిరామిక్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది. అర్హతలు : సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్‌లో చేరొచ్చు. ఎంటెక్, డాక్టరేట్ కూడా పూర్తిచేస్తే ఉన్నత అవకాశాలను దక్కించుకోవచ్చు. వేతనాలు : సిరామిక్ ఇంజనీర్లకు విద్యార్హతలు, అనుభవం, పనితీరు, పనిచేస్తున్న సంస్థ స్థాయిని బట్టి జీతభత్యాలుంటాయి. బీటెక్/ఎంటెక్ కోర్సులు చేసినవారు ప్రారంభంలో నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం పొందొచ్చు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉంటే ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. కావాల్సిన స్కిల్స్ : సిరామిక్ ఇంజనీరింగ్ రంగంలో రాణించాలంటే... బేసిక్ సెన్సైస్‌పై గట్టి పట్టుండాలి. సృజనాత్మకత తప్పనిసరి. మెరుగైన కమ్యూనికేషన్, అనలిటికల్ స్కిల్స్, టీమ్ స్పిరిట్ అవసరం. సమస్యలను వేగంగా పరిష్కరించే నైపుణ్యం కావాలి. ఎప్పటికప్పుడు వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకొనే అలవాటు ఉండాలి. డిజైన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు బెనారస్ హిందూ యూనివర్సిటీ. వెబ్సైట్: www.bhu.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కెలా వెబ్సైట్: www.nitrkl.ac.in గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిరామిక్ టెక్నాలజీ-కోల్‌కతా. వెబ్సైట్: http://gcect.ac.in/ అన్నా యూనివర్సిటీ. వెబ్సైట్: www.annauniv.edu పీడీఏ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్-గుల్బర్గా వెబ్సైట్: http://pda.hkesociety.org/