నేనేంటి? నాకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదా? ఈ ప్రశ్నలు పావనిని వెంటాడాయి... వేధించాయి. చదువుంది... పెద్ద ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంది. అబ్దుల్ కలామ్ చెప్పినట్లు పెద్ద కలలు కన్నదామె. ఆ కలలను నిజం చేసుకోవడానికి తగినట్లు శ్రమించింది కూడా. జీవితం మాత్రం... ఆమె చదవని సిలబస్‌తో పరీక్ష పెట్టింది. ఆ పరీక్షను సహనంతో ఎదుర్కొన్నది... ఉత్తీర్ణత సాధించింది. ఇక... తనను తాను నిరూపించుకోవాలనుంది. క్రియేటివిటీ ఆమెకు తోడుగా వచ్చి వెంట నిలిచింది. ఆమె ఇప్పుడు పట్టుదారంతో చక్కటి ఆభరణాలల్లుతోంది.
పావని కోరెం... వరంగల్ జిల్లా, హన్మకొండలో పుట్టింది. బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంది. ఆమె ఆలోచనలకు భర్త అండగా నిలిచారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో కాపురం, ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరింది. బయో ఇన్‌ఫర్మాటిక్స్‌లో పీజీ పూర్తయింది. పోటీ పరీక్షల కోసం భార్యాభర్తలిద్దరూ కలిసి కోచింగ్‌కెళ్లారు. పరీక్షలకు సిద్ధమయ్యేలోపు జీవితం మరో పరీక్ష పెట్టింది. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చిన్న సందేహం. ఆ సందేహాన్ని నిజం చేయడానికా అన్నట్టు పుట్టగానే బిడ్డ ఏడవలేదు.
నెలరోజులు హాస్పిటల్‌లోనే ఉంచి చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. స్పెషల్ కిడ్ కావచ్చనే మరో సందేహం. క్షణక్షణం బిడ్డ సంరక్షణలోనే గడిచిపోయింది. అనుక్షణం బిడ్డ ఎదుగుదల కోసం శ్రమించింది. తల్లిగా కఠోరయజ్ఞమే చేసింది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీలతో బాబుని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకు రాగలిగింది. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి తాను ఆశ్రయించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నుంచి తనను తాను తీర్చిదిద్దుకుంది. తనను తాను నిరూపించుకోవాలనే తపనతో పని చేసింది. ఇప్పుడామె తన సృజనాత్మకతతో గుర్తింపు పొందుతోంది. తన జీవితంలో దశాబ్దంపా టు సాగిన కీలక పరిణామాలను ఆమె సాక్షితో పంచుకున్నారు.
ఊహించని శరాఘాతం!
‘‘మా పెళ్లి 2009లో జరిగింది. బాబు ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య ఉందని తెలిసింది. బోర్లా పడడం, పా కడం, కూర్చోవడం, నడవడం వంటివన్నీ కొంత ఆలస్యంగా చేశాడు. నార్మల్ కిడ్ చేయాల్సిన సమయానికంటే ఎంత ఆలస్యమవుతోందా అని క్యాలెండర్ చెక్ చేసుకుంటూ... కంటికి రెప్పలా కాపా డుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాదాపుగా నార్మల్ కిడ్ అయ్యాడు. కానీ చిన్నప్పుడు రోజూ ఆందోళనే. బరువు తక్కువగా పుట్టడంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండేది. తరచూ జలుబు, జ్వరం వస్తుండేవి.
అప్పట్లో మా వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో ఉద్యోగం. కర్నాటకలో ఓ చిన్న గ్రామంలో పోస్టింగ్. అక్కడ వైద్య సదుపా యాలు తక్కువ. ప్రతినిత్యం భయంభయంగా గడిచేది. రెండున్నరేళ్లకే బాబుకి హెర్నియా ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. స్టేట్ బ్యాంకుకు అనేక అనుబంధ బ్యాంకుల్ని అనుసంధానం చేయడం కూడా అప్పుడే జరిగింది. ఎస్‌బీఐకి మారి హైదరాబాద్‌కి వచ్చేశాం.
మన ్రపా ంతానికి వచ్చిన తర్వాత నన్ను వెంటాడిన భయం వదిలిపోయింది. బాబుకి మంచి వైద్యం చేయించగలమనే ధైర్యం వచ్చింది. ట్రీట్‌మెంట్ థెరపీలు జరిగేకొద్దీ బాబులో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండేది. డిప్రెషన్ నుంచి మెల్లగా బయటపడ్డాను. రోజులు ఆశాజనకంగా గడుస్తున్నప్పటికీ నాలో ఏదో వెలితి ఉండేది.
సృజనతో సాంత్వన
నన్ను నేను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. యూ ట్యూబ్ చూసి నేర్చుకున్న పేపర్ క్విల్లింగ్ మంచి సాంత్వననిచ్చింది. బాబుకి ఫిజియోథెరపీ చేయించే ట్రైనర్ నేను క్విల్లింగ్‌లో చేసిన పూలు, బొమ్మలను చూసి, చాలా బాగున్నాయని తీసుకెళ్లారు. వాటిని ఆ రోజే వాళ్ల హాస్టల్ స్టూడెంట్స్ కొనుక్కున్నారు. అప్పుడే మా ఫ్రెండ్ పట్టు దారంతో ఆభరణాలు తయారు చేయమని చెప్పింది. అలా నా లైఫ్ కొత్త మలుపు తీసుకుంది.
హాబీగా మొదలు పెట్టిన యాక్టివిటీ కాస్తా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. తెలిసిన వాళ్ల నుంచి నా సృజనాత్మకత ఎల్లలు దాటింది. దుబాయ్, యూఎస్, యూకే, చైనా ల నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయి. ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ డయల్, మీ షోలలో నా అల్లికలు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి బల్క్ ఆర్డర్‌లు వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రంతా పని చేస్తుంటాను. ముగ్గురు అమ్మాయిలకు ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చాను.
మేము తయారు చేసిన ఉత్పత్తులను పికప్ బాయ్స్ వచ్చి తీసుకెళ్తారు. బాబును చూసుకుంటూ నా యాక్టివిటీని కొనసాగిస్తున్నాను. మొదట్లో అయితే మెటీరియల్ కోసం వెతుక్కుంటూ బాబును బండి మీద కూర్చోబెట్టుకుని బేగం పేట నుంచి బేగం బజార్‌కు వెళ్లేదాన్ని. ఇప్పుడైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ బాబుకు ఇంకా నా అవసరం ఉంది. నేను దగ్గరుండి చూసుకుంటే మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిలా కొనసాగిస్తున్నాను.
నాకు నిజంగా ఆశ్యర్యమే!
నా లైఫ్ జర్నీలో నాకు ఆశ్చర్యం, సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... నన్ను రోల్‌మోడల్‌గా చూస్తూ నా నుంచి స్ఫూర్తి ΄ పొందుతున్న వాళ్లు ఉన్నారనే విషయం. అంతా బాగున్న వాళ్లు చాలామంది ఏమీ చేయకుండా ఉంటున్నారు. ఏదైనా సమస్య రాగానే దిగాలు పడిపోయి జీవితాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసుకునే వాళ్లున్నారు. కానీ... ‘సమస్యకు పరిష్కారం వెతుక్కుని, తనకు ఒక గుర్తింపును తెచ్చుకుంది’ అని ప్రశంసిస్తున్నారు.
మా వాళ్లు మాత్రం మొదట్లో ‘నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పిల్లాడిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండు. ఇన్ని ఒత్తిడులు పెట్టుకోవద్ద’ని కోప్పడ్డారు. కానీ ఈ పని నాకు ఒత్తిడిని తగ్గిస్తోందని తెలిసి మా వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. నేను ఎంతో సంపా దిస్తున్నానని కాదు, కానీ నేను ఎటువంటి ఉనికి లేకుండా లక్షల్లో ఒకరిలా ఉండిపోకుండా, ఈ పనివల్ల వందల్లో ఒకరిగా ఓ గుర్తింపు తెచ్చుకోగలిగాను’’ అంటున్నప్పుడు పా వని కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.
– వాకా మంజులారెడ్డి , సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment