సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్‌లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్‌సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు.
హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్‌ఆర్‌సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్‌లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్‌ఆర్‌సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment