Interior Designers
-
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ పొదరిల్లు!
సాక్షి, హైదరాబాద్ : కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నిచర్‌ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నిచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నిచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్‌తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్. అలాగే ఈ ఫర్నిచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నిచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వాల్ క్యాబినెట్స్ వంటగది లేదా లివింగ్ రూమ్‌లో సెరామిక్ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరించటానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్స్ టేబుల్లా కూడా ఉపయోగపడతాయి. లివింగ్ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులుంచుకోవచ్చు. మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్.. ఇంట్లోని మొత్తం ఫర్నిచర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు. కోజీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు. సైడ్ టేబుల్స్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్‌లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్‌ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్‌ను అమర్చుకోవచ్చు. -
అదిరిందయ్యా..
ఇంద్రభవనం వంటి ఇల్లు లేకున్నా.. ఇంటీరియర్స్ కలర్ఫుల్గా కనిపిస్తే.. బొమ్మరిల్లులో కూడా ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. అలాగని ఇంటికి వల్లెవేసి అందంగా ముస్తాబు చేస్తే.. ‘అదిరిందయ్యా చంద్రం’ అని అనిపించుకోలేం. రంగులు ఎంచుకోవడంలో మీ టేస్ట్‌ను బట్టి మీ ఇంటి అందం ఆధారపడి ఉంది. మారుతున్న ట్రెండ్‌ను అందుకుంటేనే.. మీ నెలవు సప్తవర్ణాల లోగిలిగా మారుతుంది. ఒకప్పుడు ఇంటికి రంగులు వేయాలంటే లైట్ కలర్స్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. మారుతున్న కాలాన్ని అందిపుచ్చుకున్న నగరవాసులు తమ ఇళ్ల గోడలు మల్టీకలర్స్లో మెరిసిపోయేలా చేస్తున్నారు. గతంలో ఇంటి బయటివైపు ఓ రంగు.. లోపలి వైపు ఒక రంగుతో సరిపెట్టుకున్న యజమానులు.. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒక్కో రంగులో ఒక్కో గదిని చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకే గదిలోని నాలుగు గోడలూ నాలుగు డిఫరెంట్ కలర్స్ వేయిస్తున్నారు. గోడలకు అమర్చే షెల్ప్‌లు, పెయింటింగ్స్, ఫర్నిచర్ సహా ప్రతిదీ కలర్ ఫుల్‌గా ఉండేలా తీర్చి దిద్దుకుంటున్నారు. కలర్‌ఫుల్... ఇల్లు చిన్నదా పెద్దదా కాదు.. ఎంత అందంగా ఉందనేదే ముఖ్యమైపోయింది. వెయిటింగ్ రూమ్, మెయిన్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్‌కు సెపరేట్ కలర్స్ వేస్తూ ఇల్లంతా ఆధునికతకు ఆలవాలంగా మార్చేస్తున్నారు. ఫర్నిచర్ కూడా గోడల రంగులకు సూటయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లోరింగ్నూ వదలట్లేదు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ గోడలపై బొమ్మలు వేయిస్తే వారికి అంతకన్నా మంచి గిఫ్ట్ ఉండదంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. మాస్టర్ లుక్... మాస్టర్ బెడ్రూమ్ గోడలకు గతంలో లైట్ బ్లూ ఎక్కువగా ఫ్రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు మల్టీకలర్స్ ఉండటమే ఫ్యాషన్ అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. గదికి మూడు వైపులా ఒకే రంగు వేసినా.. నాల్గో వైపు గోడకు, దానికి అమర్చే షెల్ఫ్‌లకు రకరకాల రంగులను చొప్పించి మల్టీ కలర్ లుక్ తీసుకొస్తున్నారు. మనసుకు ప్రశాంతత కలిగించే గులాబీ, నీలం, వంకాయ రంగుల్లోని షేడ్స్ వాడటమే కాకుండా వీటికి మ్యాచయ్యే ఫర్నిచర్‌ను అమరుస్తున్నారు. వంటగది, డైనింగ్ హాల్‌ను కూడా డిఫరెంట్ కలర్స్‌లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బాత్రూమ్ల విషయానికి వస్తే ముదురు రంగులైతే క్లీన్ చేయడం సులువని చెబుతున్నారు. డూప్లెక్ల్స్లూ, విల్లాలు వంటి వాటికి ఇంట్లోనే మెట్లు కామన్. వాటికి లైట్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఏదైనా ఒక కార్నర్‌ను కూడా రకరకాలా కలర్స్‌తో ప్రత్యకంగా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో మోర్ కలర్‌ఫుల్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అన్నది నేటి ట్రెండ్. - మాధురీ, ఇంటీరియర్ డిజైనర్ -
మీ ఇంట పూలు పూయించండి!
కొత్తగా ఆలోచించే మనసు ఉండాలే కానీ... మన ఇంటిని మనం అలంకరించినంత అందంగా ఇంటీరియర్ డిజైనర్లు కూడా అలంకరించలేరు. నిజానికి ఇంటిని తీర్చిదిద్దడానికి మనం పెద్ద కష్టపడిపోవాల్సిన పని కూడా లేదు. అందుబాటులో ఉన్న వస్తువులను మనకు నచ్చినట్టుగా మార్చుకుని అలంకరించుకుంటే సరిపోతుంది. అందుకు ఇక్కడున్న డిజైన్లే ఉదాహరణ. ఇవన్నీ దేనితో చేశారో తెలుసా! వాటర్ బాటిళ్ల అడుగు భాగాలతో! ఇన్ని అందమైన పూలను సృష్టించడానికి మనకు కావలసింది కేవలం వాటర్ బాటిళ్లు, ఓ కత్తెర/చాకు, అగ్గిపెట్టె, క్యాండిల్, జిగురు, కొన్ని రంగులు... అంతే! వాడకుండా వదిలేసిన సీసాల అడుగు భాగాలను కత్తిరించుకోవాలి. వాటికి కొవ్వొత్తి మంటతో కాస్త వేడిని తగిలిస్తే చాలు, మెత్తగా అయిపోతాయి. అప్పుడు నచ్చిన ఆకారంలో ఆకులు/రేకులు ఎలా కావాలంటే అలా కత్తిరించుకోవాలి. తర్వాత వాటికి నచ్చిన రంగులు వేసుకుని జిగురు సాయంతో కావలసిన పద్ధతిలో అతికించుకోవాలి. కావాలంటే మెటీరియల్ మెత్తగా ఉన్నప్పుడే సూదీ దారంతో కుట్టేసుకోవచ్చు కూడా (మేకింగ్ ఫొటో చూడండి). అవగాహన కోసం ఇక్కడ మీకు కొన్ని డిజైన్లు ఇచ్చాం. చూసి ప్రయత్నించండి. ఇవి మీ ఇంటికి కొత్త అందాలను తీసుకురాకపోతే అడగండి! ఈ ఐసులు త్వరగా కరగవు! తీయని చల్లని ఐస్ఫ్రూట్ని ఆరగిస్తుంటే కలిగే మజా కోసం అందరూ ఆరాటపడతారు. పెద్దలు సైతం పిల్లలతో పోటీ పడుతుంటారు. కానీ బయట కొనే ఐసుల్లో ఏం నీళ్లు వాడతారో, ఎలాంటి రంగులు వాడతారో అంటూ ఓ పక్క భయం పీకుతూ ఉంటుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే సందేహం వెంటాడుతూ ఉంటుంది. అలా ఆలోచించేబదులు చక్కగా ఈ క్విక్ పాప్ మేకర్ని కొనేసుకుంటే సరిపోతుంది. జోకు అనే కంపెనీ దీనిని తయారు చేసింది. పట్టుకు ఒకటి, రెండు, మూడు ఐసులు చేసుకునే విధంగా మూడు రకాలుగా లభిస్తోంది. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. ఐస్ మిక్స్ తయారు చేసుకున్న తర్వాత, దానిని ఈ మేకర్ ట్రేలలో వేసి, స్టిక్స్ పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే వీటిలో ఐసులు తయారైపోతాయి. మీరు ఏ పిక్నిక్కో వెళ్తుంటే కనుక వాటిని ట్రేతో సహా బ్యాగ్‌లో వేసుకుని వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, వీటి తయారీకి వాడిన అధునాతన టెక్నాలజీ వల్ల ఫ్రిజ్‌లోంచి తీసిన కొన్ని గంటల వరకూ కూడా ఐసులు కరగవు. దాంతో తీరికగా కావాలనుకున్నప్పుడు ఎంచక్కా తీసుకుని తినవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు రేటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది కదా! రూ. 3200, రూ.2600, రూ.2100... ఇలా ఉన్నాయి రేట్లు. మీ పిల్లల్ని సంతోషపెట్టాలంటే మాత్రం రేటు గురించి ఆలోచించకూడదు మరి! -
నట్టింట్లో డ్రాగన్
హైదరాబాదీల నట్టింట్లో చైనా కొలువవుతోంది. ఇల్లు కట్టడానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న నగరవాసులు ఇంటీరియర్కీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే తక్కువ ధర... ఎక్కువ మన్నిక... డిఫరెంట్ డిజైన్స్ ఇన్ మోర్ కలర్స్‌తో ఆకట్టుకుంటున్న చైనా ఇంటీరియర్‌పై మోజు పెంచుకుంటున్నారు. లేట్ అయినా సరే లేటెస్ట్గా ఉండాలని చైనా నుంచి ఇంటీరియర్ డిజైన్స్‌తోపాటు ఫర్నిచర్‌ను దిగుమతి చేసుసుకుంటున్నారు. ప్రపంచంలోని అన్ని రకాల ఉత్పత్తుల్లో అగ్రదేశాల మార్కెట్లను శాసిస్తున్న చైనా ఇంటీరియర్ డిజైన్స్‌ను విరివిగా ఉత్పత్తి చేస్తోంది. అధునాతన మోడల్స్, తక్కువ ధర, ఎక్కువ మన్నికతో చేసిన పలు రకాల వస్తువులు అక్కడ దొరుకుతుండటంతో నగరంలోని ఇంటీరియర్ డిజైనర్స్ చైనా బాట పడుతున్నారు. అలాగే ైచె నా ఇంటీరియర్ కోసం సిటీలో కొన్ని ఏజెన్సీలు కూడా వెలిశాయి. ‘చైనా’ ఇల్లు సికింద్రాబాద్ బండిమెట్‌లో నివసించే నాగేందర్ అనే వ్యాపారి మొత్తం చైనా నుంచి తెప్పించిన మెటీరియల్‌తోనే ఇంటి నిర్మాణం చేయించుకున్నారు. అక్కడి నుంచి తెప్పించడం వల్ల ఖర్చు కూడా సగం తగ్గిందని చెబుతున్నారు. గ్లాస్ యాంటీ స్కిడ్ ఫోర్సెలిన్ టైల్స్ ఈ టైల్‌పై 3 ఎంఎం గ్లాస్ ఉంటుంది. ఇది షైనింగ్ ఇవ్వడమే కాదు జారిపడకుండా, గీతలు పడకుండా ఉంటుంది. ఈ టైల్స్ ఇండియాలో రూ.500లకు చదరపు అడుగుకు దొరుకుతుండగా చైనాలో రూ.200లకే లభిస్తోంది. కే9 క్రిస్టల్ శాండ్లియర్ కే9 క్రిస్టల్‌తో తయారైన ఈ శాండిలైజర్లో ఎక్కువ క్లారిటీ ఉంటుంది. ఆస్టియన్ మెటీరియల్‌తో తయారైన ఈ శాండిలైజర్ ధర చైనాలో 40 వేలు ఉండగా... ఇక్కడ సుమారు రూ.2.5లక్షలు పలుకుతోంది. త్రీడీ వాల్ పేపర్స్ గోడలకు అతికించే త్రీడీ వాల్ పేపర్స్ భిన్నమైన రంగులతో ప్రత్యేక శోభను ఇస్తున్నాయి. బయటకు చొచ్చుకుని వచ్చినట్లున్న ఇవి పక్కనే ఉన్న అనుభూతిని కల్గిస్తున్నాయి. షవర్ క్యూబికల్ ఇది బలంగా కొట్టినా పగిలిపోని గ్లాస్‌తో తయారైంది. దీన్నే టఫ్డ్ గ్లాస్ అంటారు. చైనాలో దీని ధర రూ.11వేలు మాత్రమే ఉండగా ఇక్కడ రూ. 28వేలు పలుకుతోంది. ఆటోమేటెడ్ బెడ్ ఈ ఆటోమేటెడ్ బెడ్‌కి చాలా ప్రత్యేకతలున్నాయి. బెడ్‌కే కాళ్లవైపు ఎల్సీడీ ఉంటుంది. రిమోట్ నొక్కగానే అది పైకి వస్తుంది. చేతికి ఎడమవైపున చిన్న తెర, మరో వైపు చిన్న ఎల్సీడీ డిస్ప్లే, ఊఫర్స్, బేస్ స్పీకర్స్, డీవీడీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. వెనుక వీపుకు 4 రకాలుగా మసాజ్ చేసే సౌకర్యం ఉంది. చైనాలో ఈ బెడ్ ధర 1.25 లక్షలు మాత్రమే. ఇండియాలో సుమారు రూ.4లక్షలు ఖరీదు చేస్తోంది. ఓక్ వుడ్ రెడీమేడ్ డోర్స్ ఓక్ వుడ్‌తో తయారైన ఈ రెడీమేడ్ డోర్స్‌కు 16 లాక్‌లు ఉంటాయి. లైట్ వెయిట్‌తో ఉన్న ఈ ఉడ్కి చెద పట్టదు. 50ఎంఎం మందముండే డోర్స్‌కు వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు 350 డిగ్రీల హీట్‌ను తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇది చైనాలో కేవలం 25వేలకు దొరుకుతుంది. ఆదరణ పెరుగుతోంది నగరంలో నాలుగు హోటల్స్‌లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులతో ఇంటీరియర్ డిజైన్ చేశాం. కొన్ని ఇళ్లు నిర్మించాం. చైనాలో ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో నగరమే ఉంది. సెరామిక్ సిటీ, లైటింగ్ సిటీ, ఫర్నిచర్ సిటీ, లెదర్ సిటీ ఇలా వందల షోరూమ్‌ల్లో విభిన్న డిజైన్లున్నాయి. అవి కూడా మన సగం ధరకే. దిగుమతి చేసుకునేందుకు సుమారు 45 రోజులు పడుతుంది. - కిరణ్, న్యూజెన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అధినేత ఇంటీరియర్‌కు తగ్గట్టుగా ఫర్నిచర్ ఇంటీరియర్‌తో పాటు దానికి తగినట్లుగా ఇంట్లో వాడే వస్తువులను కూడా అక్కడి నుంచే తెప్పిస్తున్నారు. ఎలివేషన్ టైల్స్, టాయిలెట్ మోటిఫ్ టైల్స్, లేజర్ కట్ టైల్స్, వెర్టిఫైడ్ ప్లోరింగ్, 3డీ వాల్ పేపర్స్, మార్బుల్ మోల్డింగ్స్, సీపీ ఫిట్టింగ్, శాండిలైజర్స్, ప్యానెల్ ఎల్ఈడీ లైట్స్, రెడీమేడ్ డోర్స్, షవర్ క్యూబికల్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, సోఫాసెట్స్ తదితర ఇంటీరియర్ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. - డి.వెంకటేశ్వరరావు/ రాంగోపాల్‌పేట్