అదిరిందయ్యా..
ఇంద్రభవనం వంటి ఇల్లు లేకున్నా.. ఇంటీరియర్స్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తే.. బొమ్మరిల్లులో కూడా ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. అలాగని ఇంటికి వల్లెవేసి అందంగా ముస్తాబు చేస్తే.. ‘అదిరిందయ్యా చంద్రం’ అని అనిపించుకోలేం. రంగులు ఎంచుకోవడంలో మీ టేస్ట్‌ను బట్టి మీ ఇంటి అందం ఆధారపడి ఉంది. మారుతున్న ట్రెండ్‌ను అందుకుంటేనే.. మీ నెలవు సప్తవర్ణాల లోగిలిగా మారుతుంది.
ఒకప్పుడు ఇంటికి రంగులు వేయాలంటే లైట్ కలర్స్‌ను ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. మారుతున్న కాలాన్ని అందిపుచ్చుకున్న నగరవాసులు తమ ఇళ్ల గోడలు మల్టీకలర్స్‌లో మెరిసిపోయేలా చేస్తున్నారు. గతంలో ఇంటి బయటివైపు ఓ రంగు.. లోపలి వైపు ఒక రంగుతో సరిపెట్టుకున్న యజమానులు.. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒక్కో రంగులో ఒక్కో గదిని చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకే గదిలోని నాలుగు గోడలూ నాలుగు డిఫరెంట్ కలర్స్ వేయిస్తున్నారు. గోడలకు అమర్చే షెల్ప్‌లు, పెయింటింగ్స్, ఫర్నిచర్ సహా ప్రతిదీ కలర్ ఫుల్‌గా ఉండేలా తీర్చి దిద్దుకుంటున్నారు.
కలర్‌ఫుల్...
ఇల్లు చిన్నదా పెద్దదా కాదు.. ఎంత అందంగా ఉందనేదే ముఖ్యమైపోయింది. వెయిటింగ్ రూమ్, మెయిన్ హాల్, మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్, కిచెన్‌కు సెపరేట్ కలర్స్ వేస్తూ ఇల్లంతా ఆధునికతకు ఆలవాలంగా మార్చేస్తున్నారు. ఫర్నిచర్ కూడా గోడల రంగులకు సూటయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్లోరింగ్‌నూ వదలట్లేదు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ గోడలపై బొమ్మలు వేయిస్తే వారికి అంతకన్నా మంచి గిఫ్ట్ ఉండదంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు.
మాస్టర్ లుక్...
మాస్టర్ బెడ్‌రూమ్ గోడలకు గతంలో లైట్ బ్లూ ఎక్కువగా ఫ్రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు మల్టీకలర్స్ ఉండటమే ఫ్యాషన్ అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. గదికి మూడు వైపులా ఒకే రంగు వేసినా.. నాల్గో వైపు గోడకు, దానికి అమర్చే షెల్ఫ్‌లకు రకరకాల రంగులను చొప్పించి మల్టీ కలర్ లుక్ తీసుకొస్తున్నారు.
మనసుకు ప్రశాంతత కలిగించే గులాబీ, నీలం, వంకాయ రంగుల్లోని షేడ్స్ వాడటమే కాకుండా వీటికి మ్యాచయ్యే ఫర్నిచర్‌ను అమరుస్తున్నారు. వంటగది, డైనింగ్ హాల్‌ను కూడా డిఫరెంట్ కలర్స్‌లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బాత్రూమ్‌ల విషయానికి వస్తే ముదురు రంగులైతే క్లీన్ చేయడం సులువని
చెబుతున్నారు.
డూప్లెక్ల్స్‌లూ, విల్లాలు వంటి వాటికి ఇంట్లోనే మెట్లు కామన్. వాటికి లైట్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఏదైనా ఒక కార్నర్‌ను కూడా రకరకాలా కలర్స్‌తో ప్రత్యకంగా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో మోర్ కలర్‌ఫుల్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అన్నది నేటి ట్రెండ్.
- మాధురీ, ఇంటీరియర్ డిజైనర్