మేకింగ్‌ ఆఫ్‌ పొదరిల్లు! | interior designers | Sakshi
Sakshi News home page

మేకింగ్‌ ఆఫ్‌ పొదరిల్లు!

Published Sat, Aug 5 2017 1:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

మేకింగ్‌ ఆఫ్‌ పొదరిల్లు!

మేకింగ్‌ ఆఫ్‌ పొదరిల్లు!

సాక్షి, హైదరాబాద్‌ : కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నిచర్‌ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం.

ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నిచర్‌ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్‌ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్‌ సేవింగ్‌ ఫర్నిచర్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్‌ ఉడ్‌తో తయారు చేసే స్పేస్‌ సేవింగ్‌ ఫర్నీచర్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇది వాటర్‌ ప్రూఫ్, స్క్రాచ్‌ ప్రూఫ్, టర్మైట్‌ ప్రూఫ్‌. అలాగే ఈ ఫర్నిచర్‌ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నిచర్‌కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి.

వాల్‌ క్యాబినెట్స్‌
వంటగది లేదా లివింగ్‌ రూమ్‌లో సెరామిక్‌ లేదా గ్లాస్‌వేర్‌ను అలంకరించటానికి వాల్‌ క్యాబినెట్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్‌ సేవింగ్‌ వాల్‌ క్యాబినెట్స్‌లో క్రాకరీ డిస్‌ప్లేకు వీలుగా గ్లాస్‌ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్‌ క్యాబినెట్స్‌ టేబుల్‌లా కూడా ఉపయోగపడతాయి. లివింగ్‌ రూమ్‌లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్‌ వాజులుంచుకోవచ్చు.

మినీ మలిస్టిక్‌ డ్రెస్సింగ్‌ మిర్రర్‌..
ఇంట్లోని మొత్తం ఫర్నిచర్‌లో డ్రెసింగ్‌ మిర్రర్‌ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెస్సింగ్‌ మిర్రర్‌ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుకుగా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్‌ చేసేలా వీలుండే డ్రెస్సింగ్‌ మిర్రర్‌ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్‌ డ్రెస్సింగ్‌ మిర్రర్‌ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్‌ను ఉంచి వాడుకోవచ్చు.

కోజీ డైనింగ్‌ టేబుల్‌
డైనింగ్‌ టేబుల్‌ కోసం ఇంట్లో డైనింగ్‌ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్‌ టేబుల్స్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుగుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్‌ టేబుల్‌ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు.

సైడ్‌ టేబుల్స్‌
గోడవారగా వేసుకునే సైడ్‌ టేబుల్స్‌ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్‌లు కలిసి ఉండే ఈ సైడ్‌ టేబుల్‌ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్‌ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్‌ ఐటమ్స్‌ను అమర్చుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement