మీ ఇంట పూలు పూయించండి!
కొత్తగా ఆలోచించే మనసు ఉండాలే కానీ... మన ఇంటిని మనం అలంకరించినంత అందంగా ఇంటీరియర్ డిజైనర్లు కూడా అలంకరించలేరు. నిజానికి ఇంటిని తీర్చిదిద్దడానికి మనం పెద్ద కష్టపడిపోవాల్సిన పని కూడా లేదు. అందుబాటులో ఉన్న వస్తువులను మనకు నచ్చినట్టుగా మార్చుకుని అలంకరించుకుంటే సరిపోతుంది. అందుకు ఇక్కడున్న డిజైన్లే ఉదాహరణ. ఇవన్నీ దేనితో చేశారో తెలుసా! వాటర్ బాటిళ్ల అడుగు భాగాలతో!
ఇన్ని అందమైన పూలను సృష్టించడానికి మనకు కావలసింది కేవలం వాటర్ బాటిళ్లు, ఓ కత్తెర/చాకు, అగ్గిపెట్టె, క్యాండిల్, జిగురు, కొన్ని రంగులు... అంతే! వాడకుండా వదిలేసిన సీసాల అడుగు భాగాలను కత్తిరించుకోవాలి. వాటికి కొవ్వొత్తి మంటతో కాస్త వేడిని తగిలిస్తే చాలు, మెత్తగా అయిపోతాయి. అప్పుడు నచ్చిన ఆకారంలో ఆకులు/రేకులు ఎలా కావాలంటే అలా కత్తిరించుకోవాలి. తర్వాత వాటికి నచ్చిన రంగులు వేసుకుని జిగురు సాయంతో కావలసిన పద్ధతిలో అతికించుకోవాలి. కావాలంటే మెటీరియల్ మెత్తగా ఉన్నప్పుడే సూదీ దారంతో కుట్టేసుకోవచ్చు కూడా (మేకింగ్ ఫొటో చూడండి). అవగాహన కోసం ఇక్కడ మీకు కొన్ని డిజైన్లు ఇచ్చాం. చూసి ప్రయత్నించండి. ఇవి మీ ఇంటికి కొత్త అందాలను తీసుకురాకపోతే అడగండి!
ఈ ఐసులు త్వరగా కరగవు!
తీయని చల్లని ఐస్‌ఫ్రూట్‌ని ఆరగిస్తుంటే కలిగే మజా కోసం అందరూ ఆరాటపడతారు. పెద్దలు సైతం పిల్లలతో పోటీ పడుతుంటారు. కానీ బయట కొనే ఐసుల్లో ఏం నీళ్లు వాడతారో, ఎలాంటి రంగులు వాడతారో అంటూ ఓ పక్క భయం పీకుతూ ఉంటుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే సందేహం వెంటాడుతూ ఉంటుంది. అలా ఆలోచించేబదులు చక్కగా ఈ క్విక్ పాప్ మేకర్‌ని కొనేసుకుంటే సరిపోతుంది.
జోకు అనే కంపెనీ దీనిని తయారు చేసింది. పట్టుకు ఒకటి, రెండు, మూడు ఐసులు చేసుకునే విధంగా మూడు రకాలుగా లభిస్తోంది. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. ఐస్ మిక్స్ తయారు చేసుకున్న తర్వాత, దానిని ఈ మేకర్ ట్రేలలో వేసి, స్టిక్స్ పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చాలా తక్కువ సమయంలోనే వీటిలో ఐసులు తయారైపోతాయి. మీరు ఏ పిక్నిక్‌కో వెళ్తుంటే కనుక వాటిని ట్రేతో సహా బ్యాగ్‌లో వేసుకుని వెళ్లిపోవచ్చు. ఎందుకంటే, వీటి తయారీకి వాడిన అధునాతన టెక్నాలజీ వల్ల ఫ్రిజ్‌లోంచి తీసిన కొన్ని గంటల వరకూ కూడా ఐసులు కరగవు. దాంతో తీరికగా కావాలనుకున్నప్పుడు ఎంచక్కా తీసుకుని తినవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు రేటు కూడా కాస్త ఎక్కువే ఉంటుంది కదా! రూ. 3200, రూ.2600, రూ.2100... ఇలా ఉన్నాయి రేట్లు. మీ పిల్లల్ని సంతోషపెట్టాలంటే మాత్రం రేటు గురించి ఆలోచించకూడదు మరి!