పెరవలి: ఇత్తడి.. ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అజ్జరం. ఇత్తడికి పుట్టిల్లుగా ఈ గ్రామం జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది. వివిధ ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి తమకు కావలసిన ఇత్తడి వస్తువులు తయారు చేయించుకుంటారు. ఇక్కడ తయారవ్వని వస్తువంటూ లేదు. పవిత్రమైన దేవాలయాల్లోను, సామాన్యుల ఇళ్లలోను, సినిమాల్లోనూ కనిపించే అరుదైన ఇత్తడి వస్తువులు అజ్జరంలో తయారైనవే.
బ్రిటిష్ వారి హయాం నుంచీ..
బ్రిటిష్ హయాం నుంచే అజ్జరంలో ఇత్తడి వస్తువులు తయారవుతున్నాయి. నాడు కేవలం చేతి పనిముట్ల సాయంతో వస్తువులు తయారు చేసేవారు. నేడు యంత్రాలతో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకూ ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే తయారై వెళ్లిందే.
‘దేవత’ బిందెలు.. ఆలయాల్లో గంటలు
‘దేవత’ సినిమాలో ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ అనే పాట కోసం వేసిన సెట్టింగ్‌లో వాడిన బిందెలన్నీ అజ్జరంలో తయారైనవే. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లోని లెక్కలేనన్ని సన్నివేశాల్లో వాడిన ఇత్తడి వస్తువులు అజ్జరానివే. ఈ గ్రామ జనాభా 2,957 మంది. వారిలో ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారే 2,500 మంది. తాత ముత్తాతల కాలం నుంచీ గ్రామస్తులు ఈ పనిని కుటుంబ వారసత్వంగా భావిస్తున్నారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు వరకూ గంటలు తయారు చేసి ఈ గ్రామస్తులు రికార్డు సృష్టించారు. అమెరికాలోని ప్రముఖ చర్చిలకు కూడ ఇక్కడ తయారైన గంటలను ఎగుమతి చేశారు. నాణ్యత, నమ్మకం కారణంగానే అజ్జరం ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది.
తండ్రి నుంచీ ఇదే వృత్తి
మా తండ్రి గారు ఇత్తడి వస్తువులు తయారు చేసేవారు. నాకూ అదే నేర్పారు. మేం ఈ పనిని ఇష్టంగా చేస్తాం. అందుకే ఇంతకాలమైనా విసుగు రాలేదు. వచ్చిన కస్టమర్లు మా పనిని చూసి ఎంతో అందంగా చేస్తున్నావని అన్నపుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ పనిలో ఎంతో హాయి ఉంది.
– నున్న వీర వెంకట సత్యనారాయణ, ఇత్తడి వస్తువుల తయారీ కార్మికుడు
నేర్చుకునే వారు తగ్గిపోయారు
మేం నాయీబ్రాహ్మణులం. ఈ పనంటే ఎంతో ఇష్టం. అందుకే దీనినే జీవనోపాధిగా ఎంచుకున్నాను. మెషీన్లు రావడంతో ఇత్తడి వస్తువుల తయారీ పని నేర్చుకునేవారు ఇప్పుడు తగ్గిపోయారు. కార్మిక చట్టాల వలన పిల్లలు పనికి రావడం లేదు. దీంతో ఈ పని మా తరంతోనే అంతమైపోతుందేమోనని అనిపిస్తోంది.
– బొజ్జొరి బాలరాజు, కార్మికుడు
40 ఏళ్లుగా ఇదే పని
గత 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కులాలకు అతీతంగా అందరం కలసి ఉంటాం. గ్రామంలోని దాదాపు అందరూ ఈ పనిలోనే ఉన్నారు. ఇప్పుడు యంత్రాల రాకతో పని నేర్చుకునేవారే లేరు. ఈ పనితో కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాం.
– యడ్ల పోతురాజు, కార్మికుడు
వేగం పెరిగినా కార్మికులు తగ్గిపోయారు
ఒకనాడు ఇత్తడి పరిశ్రమ అజ్జరంలో వైభవంగా ఉండేది. యంత్రాలు వచ్చాక పని వేగంగా జరుగుతోంది. నైపుణ్యం ఉన్న కార్మికులు తగ్గిపోతున్నారు. గ్రామంలో 200 ఏళ్లుగా ఈ వ్యాపారం ఉంది. మా తాత బెప్పే పేరలింగం, మా తండ్రి సాంబమూర్తి కూడా ఈ వ్యాపారమే చేసేవారు. ఆయనకు మేం ముగ్గురు కుమారులం. అందరం ఈ పనే చేస్తున్నాం. చిన్నాపెద్దా తేడా లేకుండా 20 ఏళ్ల క్రితం అందరూ ఈ పనికి వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు పనికి రావడం లేదు. చిన్నప్పటి నుంచీ పని నేర్చుకునేవారు తగ్గిపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు.
– బెప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని
Comments
Please login to add a commentAdd a comment