సినిమా ఘర్‌లో తాను గీసిన చిత్రాలతో ఎంఎఫ్ హుస్సేన్ (ఫైల్)
ప్రస్తుతం కూల్చివేస్తున్న ‘సినిమా ఘర్’ ఎంఎఫ్ హుస్సేన్ కలల సౌధం. ఈ భవనంలోని పోర్టికోలో కూర్చుని తన విటేజ్ కారును చూస్తూ కాఫీ తాగడం ఆ ప్రసిద్ధ చిత్రకారుడికిఅలవాటు. తన మనసుకు కష్టం కలిగినా.. ఆనందం వచ్చినా ఇక్కడే గడిపేవారు. ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రాలను ఆయన ఇక్కడే గీసారు. ఈ ప్రాంతంలో ఈ భవనం ఓ ల్యాండ్ మార్క్‌గా ఉండేది. ఇక్కడే ఓ బస్టాప్ సైతం చాన్నాళ్లు కొనసాగింది. సినిమా ఘర్‌కూల్చివేతతో ఇప్పుడు ఇవన్నీకనుమరుగు కానున్నాయి
బంజారాహిల్స్: తన కుంచెతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది పేరు, ప్రతిష్టలతో పాటు వివాదాలను సైతం మూటగట్టుకున్న ‘ఇండియన్ పికాసో’గా సుప్రసిద్ధుడైన భారతీయ చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్(ఎంఎఫ్ హుస్సేన్) కళాసౌధం ‘సినిమా ఘర్’ కూలిపోతోంది. హుస్సేన్ 1999లో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రధాన రహదారిలో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఆనాడు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్ ఈ సినిమాఘర్‌ను ప్రారంభించారు. పర్షియన్ శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేకమైన గోడలు, అందంతో పాటు ఆకర్షణీయమైన మార్బుల్‌తో చూడగానే వినూత్నంగా కనిపించేలా ‘సినిమాఘర్’ను తీర్చిదిద్దారు. లోపల ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో గోడలను మలిచారు. ఎన్నోసార్లు ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సినిమాఘర్‌లో 50 సీటింగ్ కెపాసిటీతో ‘సౌందర్య టాకీస్’ పేరుతో మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. అలాగే సినిమా, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, కంప్యూటర్, సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన 2 వేల పుస్తకాలతో ‘ప్యారిస్ సూట్’ పేరుతో లైబ్రరీ కూడా ఏర్పాటైంది. ఇక సినిమా మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ.
ఎంఎఫ్ హుస్సేన్ వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించేందుకు ఓ ఎగ్జిబిషన్ హాలు కూడా సుందరంగా నిర్మించారు. హైదరాబాద్ అంటే అమితంగా ఇష్టపడే ఎంఎఫ్ హుస్సేన్ దేÔశంలో ఎన్నోచోట్ల సినిమాఘర్ నిర్మాణానికి అవకాశాలు వచ్చినా ఇక్కడ మాత్రమే ఆ కోరిక తీర్చుకున్నారు. విదేశాల్లో ఉండే ఆయన స్వదేశానికి తిరిగివచ్చి సినిమాఘర్‌లోనే చివరి మజిలీని గడపాలనుకునేవారు. తనకు మనసు బాగాలేనప్పుడు సినిమాఘర్‌లో కాసేపు కూర్చోవడం ద్వారా మనసు తేలికపడుతుందని హుస్సేన్ బతికుండగా భావించేవారు. నెలలో వారం రోజులు ఇక్కడే ఒంటరిగా గడిపేవారాయన. ఎన్నో కళాత్మక పెయింటింగ్స్‌ను ఇక్కడ ఉండగానే గీశారు. 2002లో ఏడాది పాటు సినిమాఘర్ మూతపడ్డప్పుడు కళాభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2004, జనవరి 26వ తేదీన దీన్ని తిరిగి తెరిచారు. ఆ సమయంలో ఎంఎఫ్ హుస్సేన్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. చిత్రకారుడిగా ఘనకీర్తి పొందిన హుస్సేన్ కొన్ని వివాదాలతో ప్రాణభీతి కారణంగా 2007లో లండన్ వెళ్లిపోయి ఇక తిరిగి రాలేదు. ఎంఎఫ్ హుస్సేన్ నెలరోజుల సుదీర్ఘ అస్వస్థతతో 2011, జూన్ 9వ తేదీన లండన్‌లో తన 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దాంతో తన చివరి మజిలీని నగరంలోని సినిమా ఘర్‌లో గడపాలని భావించినా ఆయన కోరిక మాత్రం తీరలేదు.
సినిమాఘర్ స్థానంలోవాణిజ్య సముదాయం
ఎంఎఫ్ హుస్సేన్ మరణానంతరం సినిమాఘర్ ఘనకీర్తి మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు సంతానం. సినిమాఘర్ ప్రాపర్టీని ఇద్దరు కూతుళ్లు రైసా హుస్సేన్, అఖిలా హుస్సేన్‌తో పాటు చిన్నకొడుకు ఒవైసీ హుస్సేన్‌కు రాసిచ్చారు. వీరంతా ముంబై, దుబాయ్‌లో స్థిరపడ్డారు. తండ్రి మరణానంతరం ఇందులోని ఒక్కో కళాఖండాలను ఆయన సంతానం ముంబైకి తరలించారు. దీంతో ఇప్పుడు ఈ భవనం పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకోవాల్సిన ఈ కళాక్షేత్రాన్ని.. తమకు ఇ భవనం అవసరం లేదని ఇటీవల సంజయ్ గుప్తా అనే వ్యాపారికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఈ కళా సౌధాన్ని కూల్చివేసి ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు కళాభిమానులను రంజింపజేసిన సినిమాఘర్ ఇక తన ఉనికిని కోల్పోయినట్టే. ఎంఎఫ్ హుస్సేన్ గీచిన చిత్రాలు గుండెల్లోని భావోధ్వేగాలను తట్టి లేపుతాయని అభిమానులు చెబుతుంటారు. అలాంటి సినిమాఘర్ ఇక లేదన్న విషయాన్ని కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కట్టడం కూల్చివేత ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లో కట్టడం పూర్తిగా కనుమరుగు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment