బొమ్మ బొమ్మకో సొగసోయి.. | Konaseema chitrakala parishath exhibition east godavari | Sakshi
Sakshi News home page

బొమ్మ బొమ్మకో సొగసోయి..

Published Fri, Jan 19 2018 10:54 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

Konaseema chitrakala parishath exhibition east godavari - Sakshi

సాక్షి, అమలాపురం టౌన్‌:‘కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి..’ అన్నాడు ఓ సినీ గేయ రచయిత. ‘బొమ్మ బొమ్మకో సొగసోయి.. కనులకు దక్కిన విందోయి..’ అన్నట్లుగా చిత్రకారుల కుంచెలు రంగులు పూసుకుని ఆవిష్కరించే ప్రతి చిత్రం ఓ భావ గర్భిత రంగుల లోకమే. ఓ సృజనాత్మక సందేశమే. ఇలాంటి అపురూప చిత్రాలెన్నో అమలాపురంలోని కోనసీమ చిత్ర కళా పరిషత్‌ ఏటా నిర్వహించే జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలు, ప్రదర్శనల్లో కనువిందు చేస్తాయి. 

పరిషత్‌ వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు కురసాల సీతారామస్వామి ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో అమలాపురంలోని సత్యసాయి కళ్యాణ మండపం జాతీయ స్థాయి చిత్ర కళా పోటీలకు, ప్రదర్శనలకు వేదికవుతోంది. గత 28 ఏళ్లుగా కోనసీమ చిత్ర కళాపరిషత్‌ క్రమం తప్పకుండా ఏటా జాతీయ స్థాయిలో చిత్రకారుల్లో పెద్దలు, పిల్లలకు పోటీలు నిర్వహిస్తూ వారిలోని చిత్ర కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే కాక ఆ కళకు తన వంతు ఊతం ఇస్తోంది. 28వ జాతీయ స్థాయి చిత్ర కళాపోటీలకు, ప్రదర్శనలకు పెద్దల విభాగంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 150 మంది అద్భుత చిత్రాలను గీసి పంపించారు.

ఆగాచార్యకు‘భారత చిత్రకళా రత్న’
పోటీల్లో ప్రథమ స్థాయి విజేతను చిత్ర కళా పరిషత్‌ రూ.31 వేల నగదుతో పాటు ‘భారత చిత్రకళా రత్న’ అవార్డుతో సత్కరిస్తుంది. ఈ బహుమతిని, అవార్డును హైదరాబాద్‌కు చెందిన చిత్రకారుడు ఆగాచార్య గెలుచుకున్నారని సీతారామస్వామి ప్రకటించారు. రూ.10 వేల నగదు బహుమతితో ‘అమరావతి చిత్ర కళా రత్న’ అవార్డులకు నలు గురిని,  రూ.5 వేల నగ దు బహుమతితో పాటు ‘చిత్ర మయూరి’ అవార్డులకు ముగ్గురిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అమరావతి చిత్ర కళా అవార్డుకు రాజేశ్వర్, ఎన్‌. (సికింద్రాబాద్‌), కొండా శ్రీనివాసరావు (హైదరాబాద్‌), కిరణ్‌కుమార్‌ తాదోజు (రాజమహేంద్రవరం), గొర్తి రవి సీతారామశాస్త్రి (ఇందుపల్లి, అమలాపురం రూరల్‌), చిత్ర మయూరి అవార్డులకు  జింకా రామారావు (సత్తెనపల్లి), ఆకాష్‌ ఎస్‌.అలి (బీదర్, కర్ణాటక), జి.మధు (మోరి, సఖినేటిపల్లి మండలం) ఎంపికయ్యారు. 

వారికి అవార్డులను, బహుమతులను 20న అందజేయనున్నారు. 21న 30 మంది ప్రముఖ చిత్రకారులతో ఆర్ట్‌ క్యాంప్‌ నిర్వహించనున్నారు. అనంతరం ‘చిత్రకళ–భవిష్యత్‌ పరిణామాల’పై ప్రముఖ చిత్రకారులతో ఇష్టాగోష్టి జరుగుతుంది. అ మలాపురం రూరల్‌ మండలం ఇందుపల్లి ని వాసి, కోనసీమ ఆర్ట్‌ లెజెండ్‌ ఎర్రమిల్లి రోహిణీకుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం ప్ర దా నం చేస్తారు. పోటీకి వచ్చిన చిత్రాలను రెండు రోజుల పాటు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలకు  ఉప ముఖ్యమంత్రి ని మ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement