రైల్వే శాఖలో అతను ఒక ప్యూన్. కానీ అతని చేతిలో ఉన్న అద్భుతమైన కళ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అతను వేసిన ఒక పెయింటింగ్ ఏకంగా రైల్వేశాఖ ప్రచురించనున్న బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా ఎంపికైంది. భువనేశ్వర్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో శ్యామ్ సుందర్ ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. పెయింటింగ్‌లు వేయడం అతని హాబీ. ఇంటర్ రైల్వే పెయింటింగ్ పోటీల్లో శ్యామ్ సుందర్ చాలా సార్లు విజేతగా కూడా నిలిచాడు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రైల్వే శాఖ మోదీ హయాంలో తాము సాధించిన విజయాలపై ఒక బుక్‌లెట్ తీసుకురానుంది. ఈ బుక్‌లెట్‌కు కవర్‌పేజీగా శ్యామ్ సుందర్ వేసిన ఆర్ట్ వర్క్‌ని రైల్వే శాఖ ఎంపిక చేసింది.
మహాత్మాగాంధీ రైలు బోగీ దిగుతూ ఉంటే, ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు ప్లాట్‌ఫామ్‌పై గుమిగూడి ఉన్న దృశ్యాన్ని శ్యామ్ సుందర్ పెయింటింగ్‌గా వేశారు. కవర్ పేజీ కోసం ఎన్నో చిత్రాలను పరిశీలించిన రైల్వేశాఖ చివరికి ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అంత అద్భుతమైన చిత్రాన్ని వేసినందుకు శ్యామ్ సుందర్‌ని ఢిల్లీకి రప్పించి సన్మానించింది. ‘నేను గత పదేళ్లుగా రైల్వే శాఖలో పనిచేస్తున్నాను. ఈ చిత్రం గీయడానికి శ్రమపడ్డాను. మొదటి రెండు సార్లు చిత్రాన్ని తిరస్కరించారు. మొదటిసారి గాంధీ కెమెరా వైపు చూస్తున్నట్టు ఉండడంతో వద్దన్నారు. ఆ తర్వాత గీసిన దాంట్లో గాంధీ ముఖం సరిగా రాలేదు. ఇక మూడోసారి గీసిన ఈ పెయింటింగ్ ఎంపికైంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పెయింటింగ్ చాలా బాగుందని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి‘ అని శ్యామ్ సుందర్ అన్నాడు. రైల్వే శాఖ నుంచి ఇంతటి అపూర్వమైన గౌరవం దక్కినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment