![TDP govt Conspiracy Against AP Volunteers: Nakka Vasu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/vasu.jpg.webp?itok=AM1Tv-UO)
కూటమి ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోకుండా వేధింపులు
సర్కారు తీరును నిరసిస్తూ యువకుడి ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోలు పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకుంటుండగా
అడ్డుకున్న పోలీసులు.. విజయవాడ అంబేడ్కర్ స్మృతివనం వద్ద ఘటన
ఈ నిప్పు.. కావాలి కనువిప్పు
వలంటీరన్నా!
కరోనా కాలంలో గడప గడప ఎక్కావు..
ఐదు కోట్ల ప్రజల కోసం ప్రాణమే పణంగా పెట్టావు...
అలాంటి నిన్ను కూటమి ప్రభుత్వం నడిరోడ్డుపాలు చేసింది..
ఇది నా ఆవేదన నిప్పు.. కూటమికి కావాలి కనువిప్పు.
సాక్షిప్రతినిధి, విజయవాడ: ‘కష్టాల్లో ఉన్న వలంటీర్ వ్యవస్థను కాపాడుకుందాం.. కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తిద్దాం. మనలోని మానవత్వాన్ని చాటుకుందాం’ అంటూ ఓ యువకుడు బ్యానర్‌ను ప్రదర్శిస్తూ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనం దగ్గర సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వలంటీర్‌లపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్ననికి చెందిన నక్కా వాసు ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా.. అక్కడే విధుల్లో ఉన్న సూర్యారావుపేట సీఐ అబ్దుల్ అలీషేక్ అడ్డుకున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/vasu22.jpg)
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వాసు
అనంతరం సూర్యారావుపేట స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు చేస్తున్న ఆందోళన తనను కలిచి వేసిందన్నాడు. కరోనా సమయంలో సొంత వాళ్లే దగ్గరకు రాని దుర్భర పరిస్థితుల్లో వలంటీర్లు ప్రజలకు మర్చిపోలేని సేవలందించారని గుర్తుచేశాడు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నేడు పింఛన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, వలంటీర్లు ఉన్నప్పుడు హాయిగా ఇళ్ల వద్దే పింఛన్‌లు తీసుకున్నారని చెప్పారు.
అప్పటి నుంచే వలంటీర్ వ్యవస్థకు అభిమానిగా మారానని, అంతటి సేవ చేసిన వలంటీర్లను ప్రస్తుత ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండటంపై మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచినట్టు చెప్పాడు. వాసు కొన్నేళ్లుగా తండ్రితో కలిసి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడులో ఉంటున్నాడు. కుంచనపల్లిలో నాటు కోళ్ల ఫాంను నడుపుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని చికెన్ షాపులకు సరఫరా చేస్తుంటాడు. వాసు తండ్రి ఫైర్ స్టేషన్‌లో పని చేస్తుంటాడు. వాసుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వలంటీర్ వ్యవస్థ రావాలని బలంగా కోరుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment