సంపాదకీయం: పెళ్లి పీటలు చిన్నారి పెళ్లి కూతుళ్ల పాలిట వధ్యశిలలవుతున్నాయి. పేదరికమో, సురక్షితంగా పెంచలేమన్న భయమో... కన్నవారే ఆడపిల్లలను నరకకూపంలోకి నెట్టేస్తున్నారు. బాల్యమనేది తెలియకుండానే, శారీరక మానసిక ఎదుగుదల లేకుండానే ఎందరెందరో బాలికలు బాధల్లో మగ్గిపోతున్నారు. ప్రపంచంలో జరుగుతున్న బాల్యవివాహాల్లో 47 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ అంటున్నది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మనది 14వ స్థానం. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు, దాన్ని అరికట్టడానికి సకలవిధ చర్యలూ తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఈ దురాచారంపై మన పాలకులు దండెత్తుతారని, తమ సంకల్పశుద్ధిని చాటిచెబుతారని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశంలో మన దేశం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. బాల్య వివాహాలనూ, పెళ్లీడుకు ముందే జరిగే వివాహాలనూ, బలవంతపు వివాహాలనూ నిర్మూలించాలని పిలుపునిచ్చే తీర్మానాన్ని ప్రతిపాదించడంలో భాగస్వామ్యం స్వీకరించేందుకు నిరాకరించింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తాంగానీ... ప్రతిపాదకులుగా ఉండదల్చుకోలేదని చెప్పింది.
బాల్యవివాహాలకూ, బలవంతపు వివా హాలకూ వ్యతిరేకంగా భారత్‌లో చట్టాలున్నా యని, వాటి అమలు కూడా తగినంతగా ఉన్నదని చెప్పిన మన దేశ ప్రతినిధి... తీర్మానంలో ప్రస్తావించిన పెళ్లీడుకు ముందే జరిగే వివాహాల గురించి స్పష్టత లేదు గనుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. దేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తున్నదని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన అది నిలబడటం ఖాయమని మన పాలకులు చెబుతుంటారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కావాలని డిమాండ్ చేసే స్థాయికి, చాలా దేశాలు దాన్ని గుర్తించేస్థాయికి చేరుకున్నాం కూడా. కానీ, సామాజిక దురాచారా లను అరికట్టడంలో మాత్రం ఎప్పటిలాగే వెనకబడి ఉంటున్నాం. కుల, మత విభేదాలుగానీ...ప్రాంతీయ భేదాలుగానీ... స్త్రీ, పురుష వివక్షగానీ... బాల్య వివాహాలుగానీ ఎక్కడకూ పోలేదు. ప్రజాస్వామ్యమంటే అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల జాతరలో పాల్గొని ఓట్లేయడం తప్ప మరేమీ కాదని పదే పదే తెలియ జెబుతున్నచోట ఇంతకంటే మెరుగైన పరిస్థితులుండే అవకాశం లేదు.
మన దేశంలో ఆడపిల్లలకు పద్దెనిమిదేళ్లు, మగపిల్లలకు 21ఏళ్లు నిండితే తప్ప వివాహాలు చేయరాదని చట్టాలు చెబుతున్నాయి. పాత చట్టానికి మెరుగులద్ది 2006లో బాల్యవివాహ నిషేధ చట్టం కూడా తీసుకొచ్చారు. అయినా, దేశంలో పెళ్లవుతున్న ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరు 18ఏళ్ల లోపు వయసువారేనని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునిసెఫ్ నిరుడు రూపొందించిన నివేదిక తెలిపింది. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు చట్టవిరుద్ధంగా పెళ్లీడుకు చాలా ముందే వివాహాలు చేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. 20-24ఏళ్ల వయసున్న యువతులకు సంబంధించిన గణాంకాలను పరిశీలించినప్పుడు దేశంలో అత్యధికంగా బీహార్‌లో ఈ తరహా వివాహాలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడైంది. అక్కడ 68.2శాతం పెళ్లిళ్లు ఇలాంటివే. మన రాష్ట్రంలో ఇలాంటి పెళ్లిళ్ల శాతం 51.8.
గత దశాబ్దంతో పోలిస్తే బాల్యవివాహాలు తగ్గుముఖం పడుతున్న మాట వాస్తవమే అయినా, ఆ తగ్గుదల శాతం కేవలం 6.8 శాతం మాత్రమేనని యునిసెఫ్ చెబుతోంది. ఇవన్నీ భయంగొలిపే గణాంకాలు. ఇలాంటి దుస్థితినుంచి బాలికలను విముక్తం చేయాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించి రెండేళ్లక్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని దేశాలూ గట్టి ప్రతిన బూనాలని అప్పటినుంచీ కోరుతూనే ఉంది. కానీ, ఆచరణలో మాత్రం అవి యధావిధిగా సాగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు చిన్నతనంలోనే వివాహం చేయడం తమ సంప్రదాయ మని, తమ మతాచారమని, తమ కులాచారమని వాదిస్తున్నవారున్నారు. ఆయా వర్గాల్లో తమపట్ల వ్యతిరేకత వస్తుందని, తమకు వచ్చే ఓట్లు పోతాయని భావిస్తున్న పాలకపక్షాలు ఇలాంటి వివాహాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. ఎప్పుడైనా బహిరంగమై మీడియా దృష్టిలో పడితే నామమాత్రంగా కేసులు పెట్టడం తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
ఇలాంటి దురాచారంవల్ల బాలికలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారు ముఖ్యంగా చదువుకు దూరమవుతున్నారు. అమ్మా నాన్నల ఒడిలో పెరగాల్సిన వయసులోనే అమ్మలవుతున్నారు. గృహ హింసకు, లైంగిక హింసకు లోనవుతున్నారు. బండచాకిరీలో మగ్గిపోతున్నారు. తమలో జరిగే శారీరక, మానసిక, భావోద్వేగపరమైన మార్పుల గురించి అవగాహనే లేని పిల్లలు గర్భిణులవుతున్నారు. వారి శరీరాలు పిల్లలను కనడానికి అనువైన స్థితికి చేరుకోకపోవడంవల్ల కాన్పు సమయంలో తల్లీపిల్లల మరణాలు ఎక్కువుంటు న్నాయి. మృత్యువును ఎదిరించి నిలిచే చిట్టి తల్లులకు అటు తర్వాత అన్నీ కష్టాలే. వారికి పుట్టే పిల్లలు అల్పాయుష్కులుగా లేదా అత్యంత బలహీనులుగా మిగిలి పోతున్నారు.
చిన్న వయసులోనే పిల్లలను సాకవలసి రావడంతో ఆరోగ్యంపై ఎలాంటి అవగాహనా లేక ఆ తల్లులు తమకూ, తమ పిల్లలకూ కూడా మెరుగైన పోషకాహారాన్ని పొందలేకపోతున్నారు. ఇన్నింటితో ముడిపడి ఉన్న సమస్యపై మన ప్రభుత్వం తగిన మోతాదులో ఆందోళన కనబరచడంలేదన్నది వాస్తవం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో తీసుకొచ్చిన తీర్మానానికి ప్రతిపాదకులుగా ఉంటే ఇలాంటి సమస్యలన్నిటికీ అంతర్జాతీయ వేదికల్లో సమాధానం చెప్పుకోవలసి వస్తుంది గనుకనే మన దేశం సరిగా స్పందించలేదు. ఈ విషయంలో ఇతర ఆసియా దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల సరసనే మన దేశమూ నిలబడటం అన్నిటికన్నా సిగ్గుచేటైన విషయం.
ఎంత సిగ్గుచేటు?!
Published Fri, Oct 18 2013 2:18 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
Advertisement
Advertisement